
ప్రతిపక్ష సవాల్‌ను స్వీకరిస్తా: మన్మోహన్ సింగ్
మతహింస బిల్లు ఎన్నికల గిమ్మిక్కు కాదు
ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలో దిగుతాం
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే పెద్ద సవాల్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చేస్తున్న సవాళ్లపై కాంగ్రెస్ పార్టీ స్పందించడంలేదన్న విమర్శకు ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాన్ని తాము ఆషామాషీగా తీసుకోవడంలేదని, వారి విమర్శలను సీరియస్‌గా తీసుకుంటున్నవారిలో తానొకడినని స్పష్టం చేశారు. ప్రతిపక్షాన్ని నిర్లక్ష్యంగా చూడడానికి వీల్లేదన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన 11వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలోకి ఆత్మవిశ్వాసంతో దిగుతామన్నారు. మతహింస బిల్లు ఎన్నికల గిమ్మిక్కు, ‘విధ్వంసక వంటకం’ అని మోడీ విమర్శించడాన్ని తప్పుబట్టారు. అల్లర్లను నిరోధించడమే ఆ బిల్లు లక్ష్యమని చెప్పారు.
ఉద్రిక్తతలు చోటుచేసుకున్నపుడు ప్రజలను రక్షించడానికి అది ఉపకరిస్తుందన్నారు. అధికారులు త్వరగా స్పందించి పనిచేయడానికి, అల్లర్లలో నష్టపోయిన వారికి తగిన పరిహారం అందించే ఉద్దేశంతో రూపొందించిందన్నారు. దేశంలో రాజకీయ వ్యవస్థ అవినీతిమయమైపోయిందని కొంతమంది వ్యాఖ్యానిస్తుం డడాన్ని కూడా ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యం వైఫల్యం చెందిందని చెప్పేవారు, పార్లమెంట్‌ను వ్యతిరేకించేవారు, ప్రజలకు ప్రజాస్వామ్యంపై ఎంత విశ్వాసం ఉందో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటింగ్ సరళిని చూసి తెలుసుకోవాలన్నారు. అధికారంలో ఉన్నవారు వస్తుంటారు, పోతుంటారని, అన్ని సందర్భాలలోనూ దేశ ప్రజల్లో అభివృద్ధి పథంలో పయనించాలనే స్ఫూర్తి మాత్రం కొనసాగుతూనే ఉండాలన్నారు. అభివృద్ధి సూచీలో మార్పులు వస్తుంటాయని, పెరిగినపుడు, తగ్గినప్పుడు వాటికి తగ్గట్టుగా వ్యూహాలు ఉంటాయని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న అభివృద్ధి రేటుపై చాలామంది అసంతృప్తిగా ఉన్నారని, కానీ పంచవర్ష ప్రణాళికల్లో 5 శాతం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్న విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలని అంగీకరించారు. దేశాన్ని మతాల వారీగా విడగొట్టడమే టైస్టుల ఉద్దేశమని, కానీ వారు దాడులు చేసినపుడల్లా తామంతా ఒక్కటే అని ప్రజలు చాటి చెప్పారని కొనియాడారు. భద్రతలో లోపాలుంటే మీడియా దాన్ని ఎత్తిచూపాలని, అయితే దాడులు జరిగినపుడు మాత్రం విచక్షణ పాటించాలని కోరారు. అదే సమయంలో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భద్రతా దళాల కృషిని కూడా కొనియాడాలని చెప్పారు.