సంపాదకీయం
ఇటీవలికాలంలో ఓట్ల రాజకీయం తప్ప మరేదీ పట్టకుండా పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం తాజాగా మత హింస నిరోధక (న్యాయం, పరిహారాల లభ్యత) బిల్లు- 2013ను హడావుడిగా పార్లమెంటు ముందుకు తెస్తోంది. తనకు సంఖ్యాబలం సరిపోతుందా, అసలు నైతికంగా చెల్లుబాటవుతుందా అనే అంశాలతో నిమిత్తం లేకుండా చెయ్యద ల్చుకున్నవన్నీ చేసేయాలని సర్కారు తహతహలాడుతోంది. దాని వెనకున్న కారణం స్పష్టమే... ఈసారి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి రాసిపెట్టి ఉన్నదని సర్వేలన్నీ వేనోళ్ల చెబుతున్నాయి. అందులో వింతేమీ లేదు. పాలనలో అన్నివిధాలా విఫలమవడమే కాక, వరస కుంభకోణాలతో భ్రష్టుపట్టిన యూపీఏకు ఇంతకన్నా మెరుగైన ఫలితం రాగలదని ఎవరూ అనుకోరు.
అయితే, అధికారం చేతిలో ఉన్నది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం ప్రజాస్వా మ్యంలో చెల్లదు. ఎంతో లోతుగా ఆలోచించి, అందరితోనూ కూలంకషంగా చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను ‘లేడికి లేచిందే పరుగ’న్నట్టు చేయడంవల్ల ఫలితం వికటిస్తుంది. అందుకే, ఈ శీతాకాల సమావేశాల్లో మతహింస నిరోధక బిల్లు తెస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గుజ రాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు సీఎం జయలలిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇప్పటికే తమ నిరసనలు వ్యక్తంచేయగా మరికొందరు వారితో గళం కలపబోతున్నారు.
మత హింస నిరోధక బిల్లు తెస్తామని 2004లోనే యూపీఏ చెప్పింది. అందుకోసమని కొంత కసరత్తు కూడా చేసింది. 2008లో ఆ బిల్లు విషయమై జాతీయ సమగ్రతా మండలి(ఎన్‌ఏసీ)లో చర్చ జరిగింది. అంతే...అటు తర్వాత దాని ఊసెత్తలేదు. ‘ఇదిగో తెస్తున్నాం... అదిగో తెస్తున్నాం’ అనడం తప్ప ఆ బిల్లు గురించి అటు తర్వాత భిన్న వేదికలపై చర్చించడానికి ప్రయత్నించలేదు. మరోపక్క ఈ బిల్లుపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, వివిధ రాష్ట్రాలూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. మెజారిటీ మతస్తులను ఈ బిల్లు నేరస్తులుగా చూస్తున్నదని బీజేపీ ఆరోపించగా, సమాఖ్య వ్యవస్థకు ఇది ముప్పు తెస్తుందని ముఖ్యమంత్రులు ఆందోళనపడుతున్నారు. నిజానికి దేశంలో మతకల్లోలాల తీవ్రత నానాటికీ పెరుగుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ దేశవ్యాప్తంగా 479 మతకలహాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 107మంది మరణించగా 1,697మంది గాయ పడ్డారు. ఒక్క యూపీలోనే 93 ఘటనలు జరిగాయి. ఎప్పుడూ లేనట్టు ఈసారి కేంద్ర హోంమంత్రిత్వశాఖ మృతుల్లో, క్షతగాత్రుల్లో హిందువులెందరో, ముస్లింలెం దరో లెక్కలిచ్చింది. ఈ ఘటనల సంగతలా ఉంచి వాటి తర్వాత పరిస్థితులు బాధితులను మరింత దుర్భర స్థితిలోకి నెట్టేస్తాయి. చెలరేగిన అల్లర్లు అదుపులోకి వచ్చినా వాటి పర్యవసానాలు ఏళ్లతరబడి తీవ్రంగా ఉంటాయి. ముజఫర్‌నగర్ ప్రాంతంలో దాదాపు 20,000 మంది తమ స్వస్థలాలకు వెళ్లలేక ఇంతటి చలికాలం లోనూ శిబిరాల్లో కాలక్షేపం చేస్తున్నారు. వెళ్లిన కొంతమందికి కూలి పనులు కూడా దొరకడంలేదు. ఎలా బతకాలో అర్ధంకాని స్థితిలో వారంతా ఎక్కడెక్కడికో వలస పోతున్నారు. గుజరాత్‌లో అయితే 2002నుంచే చాలాచోట్ల మత ప్రాతిపదికన ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఒకరితో ఒకరు కలిసే పరిస్థితే లేదు. జాతీయ సమగ్రతకు ఇంతగా ముప్పు తెస్తున్న మత కల్లోలాలను కఠినంగా అణచితీరాలని ఈ పరిణామాలన్నీ చెబుతున్నాయి.
అయితే, ఇలాంటి స్థితిని చక్కదిద్దడానికి తాను తెచ్చిన బిల్లు ఎలా దోహదపడుతుందో యూపీఏ సర్కారు చెప్పలేకపోతోంది. కేవలం మతపరంగా, భాషాపరంగా మైనారిటీలైనవారికి, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా సాగే లక్షిత హింసను కట్టడిచేయడం ప్రధానోద్దేశమని మొదట తెచ్చిన బిల్లులో తెలిపారు. ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకాగా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మత హింస నిరోధక బిల్లుగా మార్చింది.
మతకల్లోలాలను కట్టడిచేయడానికి, వాటికి సంబం ధించిన కేసులను పర్యవేక్షించడానికి గతంలో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ పర్యవేక్షక సంస్థల ఏర్పాటును ప్రతిపాదించగా ఆ బాధ్యతలను ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ మానవహక్కుల సంఘాలకు అప్పగించారు. ఇప్పటికైతే కేవలం సలహా సంస్థలుగానే పనిచేస్తున్న వీటికి కొత్తగా ఎన్నో అధికారాలు కట్టబెడుతున్నారు. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడానికి, తగిన సలహాలిచ్చి వారిని కదిలించడానికి సంఘాలకు వీలుకల్పించారు. ఏదైనా ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించడానికి జిల్లా కలెక్టర్లకు అధికారమిచ్చే నిబంధనకూడా ఉంది.
అల్లర్ల నివారణకు చర్యలు తీసుకోని, విధులు సరిగా నిర్వర్తించని అధికారులను శిక్షించేందుకు నిబంధనలున్నాయి. విద్వేషాలను రెచ్చగొట్టేలా వదంతులు వ్యాప్తిచేసే వారిని, అలా చేస్తారని అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకొనేందుకు ఈ బిల్లు అవకాశమిస్తున్నది. ఎన్నికైన తమ ప్రభుత్వాలను కాదని, మానవహక్కుల సంఘాలకే సకల అధికారాలూ దఖలు పరచడం అప్రజాస్వామికమని సీఎంలు భగ్గుమంటున్నారు. ఏదో ఒక సాకుతో కేంద్రం క్రమేపీ తమ అధికారాల్లోకి చొరబడుతున్నదని వీరి ఆరోపణ. అస్పష్టంగా ఉన్న కొన్ని నిబంధనలవల్ల చట్టం దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మత హింసకైనా, ఏ హింసకైనా ప్రాతిపదిక సామాజికార్ధిక సమస్యలే. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తూ, అందుకు సహాయకారిగా చట్టాలు చేయాలి తప్ప చట్టమే అన్నిటికీ పరిష్కారమని భావించడం తెలివితక్కువ తనం అవుతుంది. సమస్యల సాకుతో ఓట్లు నొల్లుకుందామనో, రాష్ట్రాల అధికారాలను కొల్లగొడదామనో ప్రయత్నిస్తే ఎవరూ సహించరని కేంద్రం తెలుసుకోవాలి. అన్ని స్థాయిల్లోనూ సమగ్రమైన చర్చ జరిగాకే పార్లమెంటు ముందుకు బిల్లు తీసుకురావాలి. అందుకు ఇప్పుడు సమయం లేదనుకుంటే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆ పనిచేస్తుంది. ఆ వివేకం యూపీఏ పెద్దలకు కలగాలి.