గుజరాత్ షాక్!
రాజ్యసభలో ఆధిక్యత సాధించడం కేంద్రంలో ఉండే పాలక పక్షానికి కీలకమే కావొచ్చుగానీ ఆ సభకు జరిగే ఎన్నికలపై జాతీయ స్థాయిలో ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అవి లాంఛనప్రాయమే అవుతాయి. శాసనసభల్లో ఆయా పార్టీలకుండే బలాబలాలే, ఆ పార్టీల మధ్య ఏర్పడే అవగాహనలే ఫలితాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. కనుకనే గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలు చడీచప్పుడూ లేకుండా ముగిశాయి. కానీ గుజరాత్‌లో మంగళవారం మూడు స్థానాలకు జరిగిన ఎన్నికలు దేశవ్యాప్తంగా పెను ఉత్కంఠను కలిగించాయి. అనూహ్యమైన పరిణామాలతో ఆసక్తిని రేకెత్తించాయి. ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీ పోరాడిన ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించినా చివరకు అర్ధరాత్రి దాటాక విజయాన్నందించి ఊరట కలిగించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే దీనంతకూ కారణం. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెలివితక్కువగా బ్యాలెట్ పత్రాలు చూపి బీజేపీ ఆశల్ని తలకిందులు చేశారు. అమిత్ షా గెలుపునకు అవసరమైన ఓట్ల కేటాయింపు ఆయనకుంది. అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సైతం ఇలాంటి ఏర్పాటే ఉంది. ఈ రెండు స్థానాలు మాత్రమే గెల్చుకోగల స్థితిలో ఉన్న బీజేపీ... కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న అహ్మద్ పటేల్ ఓటమే ధ్యేయంగా మూడో అభ్యర్థిని రంగంలోకి దించడంతో ఎన్నికల తీరుతెన్నులు మారిపోయాయి. పటేల్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీపడిన బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుట్ మొన్నటి వరకూ శాసనసభలో పార్టీ చీఫ్ విప్. ఆయన, మరో ఆరుగురు ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించారు. అయినా గెలుపునకు అవ సరమైన 44 ఓట్లు ఆ పార్టీకి ఉన్నాయి. వారిని బీజేపీ గాలం నుంచి తప్పించడానికి తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు ఆ ఎమ్మెల్యేలను తరలించడం, అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ మంత్రి అధికారిక నివాసంలోనూ, ఆయన మిత్రుల ఇళ్లలోనూ ఆదాయం పన్ను శాఖ దాడులు నిర్వహించడం సంచలనం కలిగించాయి. ఆ ఒక్క స్థానాన్ని గెల్చు కోవడానికి ఒకరు... దాన్ని దక్కనీయరాదని మరొకరు ఇన్నివిధాలుగా ప్రయత్నిం చడం అసాధారణం.
అహ్మద్ పటేల్ సామాన్యుడు కాదు. రాజీవ్‌గాంధీ గుర్తించి అందలం ఎక్కించిన నేతల్లో ఆయనొకరు. రాజీవ్ అనంతరం ఆయన సోనియాగాంధీకి కూడా దగ్గర య్యారు. పేరుకు ఆమె రాజకీయ కార్యదర్శే అయినా గత రెండు దశాబ్దాలుగా పార్టీలో చక్రం తిప్పుతున్నారు. పటేల్ ఓటమి కాంగ్రెస్‌కూ, ప్రత్యేకించి సోనియాకూ నైతికంగా కోలుకోలేని దెబ్బ అవుతుందని... మరికొన్ని నెలల్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇది చాలా అవసరమని బీజేపీ భావించింది. అందుకే అమిత్ షా తన గెలుపు కంటే కూడా అహ్మద్ పటేల్ ఓటమిపైనే దృష్టంతా కేంద్రీకరించారు. స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. సర్వశక్తులూ ఒడ్డారు. ఈ క్రమంలో పార్టీపై ఎలాంటి ముద్ర పడుతుందన్న బెంగ ఆయనకు కలగలేదు. ఏం చేసైనా పటేల్‌ను ఓడించడమే ఆయన ఏకైక లక్ష్యం. ఇది తన గెలుపు కాదని... డబ్బు, కండబలం, అధికార దుర్వినియోగం ఉమ్మడిగా పొందిన ఓటమి అని అహ్మద్ పటేల్ అనడం లోని అంతరార్ధం ఇదే.
అయితే గెలుపునకు చాలినన్ని ఓట్లు లేకపోయినా మూడో అభ్యర్థిని రంగంలోకి దించినందుకు బీజేపీని తప్పుబట్టి ప్రయోజనం లేదు. ఆ మాదిరి సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది, దాన్ని అనేక సందర్భాల్లో విజయవంతంగా ప్రయోగించిందీ కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు డబ్బు, కండబలం, అధికార దుర్వినియోగం లాంటి ఆరోపణలు చేస్తున్న అహ్మద్ పటేల్ ఇలాంటి పనుల్లో తానే సిద్ధహస్తుడు. తెరవెనక ఉంటూ ఇవన్నీ ఎడాపెడా చేయడం ద్వారా హేమాహేమీలైన నేతలెందరి తల రాతలనో ఆయన మార్చాడు. సోనియా దగ్గర తనకున్న ప్రాపకాన్ని ఉపయో గించుకుని పార్టీలో సమర్ధులైన నాయకులను శంకరగిరి మాన్యాలు పట్టించాడు. అనర్హులను అందలం ఎక్కించాడు. రాహుల్‌గాంధీతో మాత్రం పొసగలేదు. ఆయన సమర్ధుడైన పక్షంలో బహుశా ఈపాటికే పటేల్ దుకాణం సర్దుకునేవారు. అటు రాహుల్, ఆయన అనుచరగణం ఎక్కడా ఏమీ సాధించలేక చతికిలబడుతున్న సమయంలో ఎంతో చాకచక్యంగా ఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తు చేయగలనని నిరూపించుకునేందుకు... మరికొన్నాళ్లపాటు పార్టీలో వెలిగిపోయేందుకు రాజ్యసభ స్థానం గెల్చుకోవడం ద్వారా అహ్మద్ పటేల్‌కు ‘గొప్ప అవకాశం’ వచ్చిపడింది.
తమది విలక్షణమైన పార్టీ అని ఎప్పుడో రెండు దశాబ్దాలక్రితం బీజేపీ చెప్పుకుని ఉండొచ్చుగానీ... దాన్ని పట్టుకుని వేలాడాలన్న యావ ఆ పార్టీకి పోయి చాన్నాళ్లయింది. గెలవడం ముఖ్యం తప్ప ఎలా గెలిచామన్నది ప్రధానం కాదని చాలా పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఫార్ములా తెలిసినంతగా దాన్ని ప్రయో గించడానికి అవసరమైన నైపుణ్యం బీజేపీకి పూర్తిగా పట్టుబడలేదని గుజరాత్ పరిణామాలు నిరూపించాయి. గుజరాత్‌లో ఓట్లు లెక్కింపు ఆగిపోగా ఢిల్లీలో రెండు పార్టీలూ ఈసీ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరిగి మహజర్లు సమర్పించాయి. పోటీలు పడి కొన్ని గంటల వ్యవధిలోనే ఫిర్యాదులు, అభ్యంతరాలు వినిపించాయి. చివరకు మూడు స్థానాల్లో రెండు గెల్చుకుని కూడా చివరకు బీజేపీ ఓడిపోయిన భావనతో మిగిలిపోతే... రావలసిన ఒక్కటీ దక్కించుకోవడానికి తెగ కష్టపడి ఏదో ఘనకార్యం సాధించినట్టు ప్రకటించుకుని కాంగ్రెస్ బీరాలు పోతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఇలాంటి అవకాశాన్నిచ్చి తప్పు చేశామని, కోమాలోకెళ్లిన ఆ పార్టీకి జవసత్వాలిచ్చామని బీజేపీ ఇప్పుడు తీరిగ్గా చింతిస్తూ ఉండొచ్చు. కానీ కనీస విలువలను పాటించలేకపోతున్నామని, నైతికతకు నీళ్లొదులుతున్నామని ఈ రెండు పార్టీలతోపాటు ఇలాంటి ఎత్తుగడలకే పూను కుంటున్న ఇతర పార్టీలు కూడా గ్రహించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది.