గందరగోళం మధ్య కాసేపు..!
పార్లమెంటు సభా కార్యక్రమాల కొనసాగింపు
* క్వశ్చన్ అవర్, జీరో అవర్ పూర్తి
* నిరసనలు కొనసాగించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలు
* సోమవారానికి ఉభయ సభలు వాయిదా
* రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా సభా కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో.. నిరసనలు ఎదురైనా, విపక్షాలు గందరగోళం సృష్టించినా, సభను నడిపి తీరాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
అదే వైఖరి శుక్రవారం నాటి లోక్‌సభ నిర్వహణలో కనిపించింది. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సభ్యులు పట్టువదలకుండా నినాదాలతో హోరెత్తించినా, సభను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినా, స్పీకర్ తాత్కాలికంగా సభను వాయిదా వేశారే కానీ మరుసటిరోజుకు వాయిదా వేయలేదు. గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాల సమయాన్ని, జీరో అవర్‌ను పూర్తి చేశారు. గురుదాస్‌పూర్‌లో ఉగ్ర దాడిపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేసిన సమయంలో తప్ప, మిగతా సమయమంతా కాంగ్రెస్, పలు ఇతర విపక్షాలు నిరసనలు కొనసాగించాయి.
రాజ్యసభలో ప్రతిష్టంభన కొనసాగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి అధికార, విపక్ష సభ్యులు వాద ప్రతివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, పోటాపోటీ నినాదాలతో సభను వేడెక్కించారు. మోదీగేట్‌కు సంబంధించి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కామ్‌లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ల సమయంలో రెండు సార్లు సభను వాయిదా వేశారు.
ప్రధాని మోదీ సభకు వచ్చి వ్యాపమ్‌కు సంబంధించి శివరాజ్ సింగ్ రాజీనామాపై హామీ ఇచ్చేంతవరకు సభాకార్యక్రమాలను వాయిదా వేయాలంటూ సభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ డిమాండ్‌ను అధికార పక్షం తోసిపుచ్చింది. నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోబోమంటూ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. వ్యాపమ్‌పై చర్చకు సిద్ధమన్నారు. దానిపై, ప్రభుత్వం చర్య తీసుకున్న తరువాతే చర్చ అని ఆజాద్ తేల్చిచెప్పారు. అధికార, విపక్ష సభ్యులు తమ పట్టు వీడకుండా, నినాదాలతో గందరగోళం సృష్టించడంతో సభను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సోమవారానికి వాయిదా వేశారు.
లోక్‌సభలో.. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ శుక్రవారం వాయిదా తీర్మానాల నోటీసులను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాదాపు మీటరు వెడల్పు, ముప్పావు మీటరు ఎత్తుతో ప్లకార్డులు ప్రదర్శించారు. ‘దాగియో సే ముహ్ మోడో.. ప్రధాన్ మంత్రి చుపీ తోడో..’ , ‘భ్రష్టాచారీయోంకో సాథ్ చోడో.. ప్రధాన్ మంత్రి చుపీ తోడో..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు ప్లకార్డులతో స్పీకర్ స్థానానికి కుడిపక్కన అధికార పక్షం వైపు మౌనంగా నిల్చుని నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ఎంపీ మల్లారెడ్డి కూడా ఈ అంశంపై వెల్ వద్ద నిల్చుని నిరసన తెలిపారు. విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.
విజ్ఞప్తులు, హెచ్చరికలు
కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకుంటుండటంతో ఆందోళన విరమించుకోవాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్లకార్డులు తీసి, ఆందోళన విరమించకపోతే చర్య తీసుకోవాల్సి వస్తుందన్నారు. అయినా సభ్యులు వినకపోవడంతో స్పీకర్ ‘మీరు ఆందోళన చేసినా సభను వాయిదా వేయను. దేశం మొత్తం చూడనివ్వండ’ంటూ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. అనంతరం గురుదాస్‌పూర్ ఉగ్ర ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరగా స్పీకర్ నిరాకరించారు. దాంతో విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. 12.30 గంటప్పుడు స్పీకర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.
సభ మళ్లీ మొదలయ్యాక రాజ్‌నాథ్ ప్రకటనపై కాంగ్రెస్ ఖర్గే మాట్లాడుతూ.. ఉగ్ర ఘటనపై సుమోటో ప్రకటన ఇస్తానన్న హోంమంత్రి రాజకీయ ప్రసంగం చేశారని విమర్శించారు. దాంతో, బీజేపీ సభ్యులు ఖర్గేను అడ్డుకున్నారు. ఇలా అధికార, విపక్ష సభ్యుల నిరసనల మధ్యే జీరో అవర్‌ను పూర్తి చేశారు. గందరగోళం మరింత పెరగడంతో మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో పావుగంట పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో 10 నిమిషాల తరువాత సోమవారానికి వాయిదా వేశారు.