మోదీ లేరంటూ గందరగోళం.. రాజ్యసభ వాయిదా
మోదీ లేరంటూ గందరగోళం.. రాజ్యసభ వాయిదా
Published Thu, Nov 24 2016 3:22 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
మధ్యాహ్నం భోజన విరామ సమయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్చలో పాల్గొనేందుకు రాజ్యసభకు రాలేదంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. పెద్దనోట్ల రద్దుపై విపక్షాల డిమాండ్ మేరకు రాజ్యసభలో గురువారం చర్చ నిర్వహించారు. ఈ చర్చలో ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. అయితే భోజన విరామానికి సభ వాయిదా పడిన తర్వాత ఆయన మళ్లీ సభకు రాలేదు. ఈ అంశాన్ని కాంగ్రెస్, సీపీఎం, ఇతర పార్టీల సభ్యులు లేవనెత్తారు. దానికి అధికారపక్షం తరఫున సభా నాయకుడు అరుణ్ జైట్లీ, మరో మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సమాధానం ఇచ్చారు. మొత్తం 25 మందికి పైగా సభ్యులు మాట్లాడాల్సి ఉన్నందున చర్చ ఇంకా ముగిసిపోలేదని, చర్చ ముగిసేలోపు ప్రధాని తప్పనిసరిగా వచ్చి, ఆయన కూడా చర్చలో పాల్గొంటారని చెప్పారు. కానీ, ప్రతిపక్ష సభ్యులు దాంతో ఏకీభవించలేదు.
గతంలో 2013 ఆగస్టులో ఇలాగే రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సభలోనే ఉండి తీరాలని నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారని, ఇప్పుడు మాత్రం ఆయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మాజీ మంత్రి ఆనంద్ శర్మ మండిపడ్డారు. అనంతరం ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంపీలంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సభను జరగనివ్వాలని, ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదే పదే కోరినా ఎవరూ పట్టించుకోలేదు. పరిస్థితి ఎంతసేపటికీ అదుపులోకి రాకపోవడంతో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు.
Advertisement
Advertisement