సాక్షి, హైదరాబాద్ : తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్-3’ వివాదం ఢిల్లీకి చేరింది. ఈ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ.. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. వెంటనే ఈ షో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానికి సంబందించిన వీడియోను కూడా విడుదల చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదును కమిషన్ స్వీకరించిందని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.
హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన ఓయూ జేఏసీ
బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలివేయాలని కోరుతూ ఓయూ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేసింది. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో షోను రద్దు చేయాలని కోరారు. ఒకవేళ షో నిర్వహించాల్సి వస్తే.. మహిళలపై వేధింపులు, అసభ్యకరమైన సన్నివేశాలు లేవని నిరూపించిన తర్వాతే షో వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో షో నిర్వాహకుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాగా ఇప్పటికే ఈ షోపై శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ రియాలిటీ షోను నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ఇప్పటికే ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. బిగ్ బాస్ షో ప్రదర్శన వల్ల యువత చెడిపోతుందంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment