సాక్షి, హైదరాబాద్: రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రసారాలను నిలిపివేసేంత వరకు తన పోరాటం ఆగదని జర్నలిస్టు శ్వేతా రెడ్డి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నటి గాయత్రి గుప్తా, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా తరహాలో బిగ్‌బాస్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని ఆరోపించారు. మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా షోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాను చేస్తున్న పోరాటానికి ఇప్పటికే పలు సంఘాల మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు కూడా తన పోరాటానికి మద్దతు తెలిపారన్నారు.
సినిమా రంగంలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం సరికాదన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టి మార్పులు తీసుకువస్తానని ప్రకటించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తమిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో తమిళనాడుకు వస్తున్నారని, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త రాజేశ్వరి ప్రియతో ప్రధానిని కలిసి ‘బిగ్‌బాస్’పై వినతిపత్రం సమర్పిస్తామని శ్వేతా రెడ్డి తెలిపారు. ‘బిగ్‌బాస్’ను నిలిపివేయాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టును ఆశ్రయించామని, దీనిపై ఈ నెల 29న విచారణ జరుగుతుందని వెల్లడించారు. (చదవండి: ఫస్ట్‌రోజే ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్)
Comments
Please login to add a commentAdd a comment