సాక్షి, తిరువనంతపురం : కేరళ లవ్ జిహాద్ కేసులో బాధితురాలిని తండ్రి హింసిస్తున్నాడన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మహిళా సంఘం స్పష్టత ఇచ్చింది. సోమవారం జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు కొట్టాయంలోని వైకోమ్ గ్రామంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. అనంతరం బృందం ప్రతినిధి రేఖా శర్మ మీడియాతో మాట్లాడారు.
‘‘ఆమె చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంది. తండ్రి ఆమెను హింసిస్తున్నాడన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. యువతి తల్లితో కూడా మేం మాట్లాడాం. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు రక్షణగా ఉన్నారు. ఆమె భద్రతకు వచ్చిన ముప్పేం లేదు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ముందు తాను జరిగిందంతా వివరిస్తానని యువతి మాతో చెప్పింది‘‘ అని రేఖా వివరించారు. చివర్లో ఆమె తన సెల్‌లో హదియా నవ్వుతున్న ఫోటోలను మీడియాకు చూపించటం విశేషం.
కాగా, ఇన్నాళ్ల ఈ కేసులో ఉన్నతాధికారులు ఆమెను కలవటం ఇదే తొలిసారి. హదియాను తండ్రి దగ్గరే ఉండాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఉద్యమకారుడు రాహుల్ ఈశ్వర్ రెండు వీడియోలను విడుదల చేయగా.. అందులో తనను తండ్రి హింసిస్తున్నాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ వీడియో ఆధారంగా హదియా భర్త షఫిన్ జెహాన్ సుప్రీంలో తాజాగా ఓ పిటిషన్ కూడా దాఖలు చేశాడు.
అఖిల అశోకన్ అనే యువతి గతేడాది డిసెంబర్‌లో మతమార్పిడి చేసుకుని మరీ షెఫీన్‌ను వివాహం చేసుకోవటం.. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘‘లవ్ జిహాద్ కేసు’’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూడగా.. తండ్రి చెంత ఉన్న యువతిని వచ్చే నెల 27న సుప్రీంకోర్టులో హాజరుపరచాలంటూ కేరళ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment