దీప్తి గాడ్గే, ‘స్వమాన్’ చిత్రంలో ఆశ
కోవిడ్ నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించిన కాలం అది. జాతీయ మహిళా కమిషన్‌కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి. ఇవన్నీ గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులే!
రోజురోజుకూ ఫిర్యాదుల వరద పెరుగుతుందే తప్ప తగ్గలేదు... ఈ విషయం పుణేకి చెందిన ఫిల్మ్‌మేకర్ దీప్తి గాడ్గేను ఆలోచనల్లోకి తీసుకువెళ్లింది.
‘లాక్‌డౌన్ సమయంలో ప్రతి ముగ్గురిలో ఒకరు గృహహింసకు గురయ్యారు...అనే విషయం తెలిసినప్పుడు బాధ అనిపించింది. నాలోని బాధను వ్యక్తీకరించడానికే ఈ లఘుచిత్రాన్ని తీశాను’ అని చెబుతుంది దీప్తి.
‘స్వమాన్’ పేరుతో ఆమె తీసిన అయిదు నిమిషాల నిడివిగల షార్ట్‌ఫిల్మ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు... రోమ్‌లో జరిగే గోల్డెన్ షార్ట్ ఫిల్మ్‌ఫెస్టివల్, కాలిఫోర్నియాలో జరిగే ఉమెన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, టోక్యో షార్ట్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. ‘ఇది ఎవరి కథా కాదు. పూర్తిగా కల్పితం’ అని దీప్తి చెబుతున్నప్పటికీ... గృహహింస ఎదుర్కొన్న ఎంతోమంది బాధితుల జీవితానికి దర్పణంగా అనిపిస్తుంది.
ఒకరోజు దీప్తి మార్నింVŠ వాక్‌కు వెళుతున్నప్పుడు ఒక మహిళ రోడ్డుపక్కన దిగాలుగా కూర్చొని ఉంది. పెద్దింటి మహిళ అని ఆమె ఆహార్యం సూచిస్తుంది. రాత్రంతా నిద్ర లేనట్లు కళ్లు చెబుతున్నాయి. ఉండబట్టలేక...‘మీకు ఏమైనా సహాయం చేయగలనా?’ అని అడిగింది. ‘లేదు’ అంది ఆమె ముక్తసరిగా. కాస్త ముందుకు వెళ్లిన దీప్తి వెనక్కి తిరిగిచూస్తే... ఆమె కనిపించలేదు! ఆ బాధితురాలి గురించే ఆలోచిస్తూ నడుస్తోంది...ఆమె బాధితురాలు అనేది కాదనలేని వాస్తవం.
అయితే ఆమెకు తాను ఎదురొన్న హింస గురించి చెప్పుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే పరువు సమస్య. గృహహింస ఎదుర్కొంటున్న వాళ్లలో చాలామంది మహిళలు ‘లోకం ఏం అనుకుంటుందో!’ ‘భర్తపై ఫిర్యాదు చేస్తే పిల్లల భవిష్యత్ ఏమిటీ’... ఇలా రకరకాల కారణాలతో రాజీ పడుతుంటారు. ఈ ధోరణి గృహహింసను మరింత పెంచుతుంది. తన ఆలోచనలకు అయిదునిమిషాల వ్యవధిలో చిత్రరూపం ఇవ్వడం అనేది కత్తి మీద సామే. అయితే ‘స్వమాన్’ రూపంలో ఆ పని విజయవంతంగా చేసి శభాష్ అనిపించుకుంది దీప్తి.
‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా షార్ట్‌ఫిల్మ్‌కు చక్కటి ప్రశంసలు లభించడం ఒక ఎత్తయితే, సామాన్య మహిళల మెప్పు పొందడం అనేది మరో ఎత్తు’ అంటుంది ఈ లఘుచిత్ర నిర్మాణ బాధ్యతలు చూసిన డా.అనిత.
‘కథలో నాటకీయతకు తావు ఇవ్వకూడదు అనుకున్నాను. చిన్న సంభాషణ లు మాత్రమే ఉపయోగించాను. ఇందులో కథానాయిక ఆశ గృహ హింస ను ఎదుర్కొంటుంది. అందరిలాగే తనలో తాను కుమిలిపోతుంది. చివరికి మాత్రం గొంతు విప్పి గర్జిస్తుంది. ఈ చిత్రం చూసి ఒక్క మహిళ స్ఫూర్తి పొందినా నేను విజయం సాధించినట్లే’ అంటుంది దీప్తి.
Comments
Please login to add a commentAdd a comment