వయసు మీద పడితే? | Old Age Health Problems | Sakshi
Sakshi News home page

వయసు మీద పడితే?

Published Thu, Aug 8 2019 9:37 AM | Last Updated on Thu, Aug 8 2019 9:37 AM

Old Age Health Problems - Sakshi

ఫలానా వారు బాత్‌రూమ్‌లో కాలుజారి పడిపోయారనే వార్త తరచూ వింటూనే ఉంటాం. ఇలా అందరూ పడిపోవచ్చు. కానీ అలా పడేవారిలో సాధారణంగా పెద్ద వయసువారే ఎక్కువగా ఉండటం ఎప్పుడైనా గమనించారా?  అరవై అయిదేళ్లు – డెబ్భయిల్లోకి వచ్చిన ప్రతి ముగ్గురిలోనూ ఒకరు ఇలాగే పడిపోతుంటారు. నిజానికి పడిపోవడం అనేది ఒక యాక్సిడెంట్‌. దాన్నెవరూ ఊహించలేరూ, ఆపలేరు. కానీ పెద్దవయసు వచ్చిన వారు పడిపోవడానికి కొన్ని ఆరోగ్యపరమైన కారణాలుంటాయి. తెలుసుకుంటే వాటిని నివారించవచ్చు కదా! పైగా చిన్న వయసు వారు పడిపోతే కోలుకోడానికి అవకాశాలెక్కువ. కానీ పెద్ద వయసు వారు పడిపోతే వచ్చే అనర్థాలెన్నో. ఒక్కోసారి వారు పూర్తిగా మంచం పట్టారంటే అది వారికీ, వారిని చూసుకునే ఇంట్లోని వారికీ ఇబ్బంది. అందుకే పెద్దవయసు వారు అలా పడిపోడానికి కారణాలేమిటో, ఏయే జాగ్రత్తలతో వాటిని నివారించవచ్చో తెలుసుకుంటే పెద్దలను జాగ్రత్తగా చూసుకున్నట్లూ ఉంటుంది. వారు పడిపోవడంతో వచ్చే అనర్థాలనూ, అసౌకర్యాలనూ నివారించినట్లూ ఉంటుంది. ఈ విధంగా అనేక బహుళ ప్రయోజనాలిచ్చేలా ఉపకరించేందుకూ, పెద్దలు పడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడే కథనమిది.

పెద్దలు పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఎక్కువ. ఒకసారి పడిపోయిన తర్వాత వారు అలా పడిపోవడానికి కారణాలను అప్పుడు తెలుసుకున్నామనుకోండి. ఆ కారణాలకు వైద్యపరంగా చికిత్స చేసి సరి చేయవచ్చేమోగానీ... ఇలా పడటం మూలంగా ఒక్కోసారి అప్పటికే కాళ్లూ, చేతులు, తుంటి వంటి కీలకమైన ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్‌ కావడం), తలకు పెద్ద గాయం (హెడ్‌ ఇంజ్యూరీ)  కావడం వంటివి జరిగితే మాత్రం...  దాని వల్ల కలిగే ఇబ్బంది చాలా ప్రమాదకరంగా ఉండవచ్చు. ఒక్కోసారి అది కుటుంబసభ్యులందరికీ జీవితాంతం వేధించవచ్చు. అందుకే పెద్ద వయసు వారు ఏయే సమస్యల వల్ల పడిపోతారు, వాటిని ఎలా నివారించవచ్చే తెలుసుకోవాలి.

మామూలుగా ఉన్న వారితో పోలిస్తే పెద్ద వయసు వారిలో పడిపోవడాల సంభావ్యత ఎక్కువ. వయసుతో పాటు అలా పడిపోయే ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న కొద్దీ ప్రమాదాలూ, వాటి తీవ్రత కూడా పెరుగుతూ పోతుంది. సాధారణ వయసువారు మొదలుకొని, మధ్యవయస్కులు, పెద్ద వయసు వారి వరకూ అకస్మాత్తుగా కింద పడిపోవడానికి కొన్ని కారణాలేమిటో చూద్దాం.

పెద్దలు పడిపోవడానికి కొన్ని కారణాలివే...  
వయసు పెరుగుతున్న కొద్దీ కొందరి పాదాల్లో స్పర్శజ్ఞానం తగ్గుతుంది. దాంతో తమకు తెలియకుండానే వారు పడిపోవచ్చు.
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలూ పలచబడతాయి. నిర్దిష్టంగా చెప్పాలంటే మజిల్‌ మాస్‌ తగ్గుతుంది. ఇలా (మజిల్‌ మాస్‌ తగ్గి) కండరాలు పలచబడటం వల్ల కండరాల్లోని శక్తి కూడా క్షీణిస్తుంటుంది. పడిపోవడానికి ఇలా కండరాల శక్తి తగ్గిపోవడమూ ఒక కారణం కావచ్చు.
వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని కీళ్లలో ముఖ్యంగా మోకాలు, చీలమండ, తుంటి ఎముకల కీళ్లలో కొన్ని మార్పులు వస్తుంటాయి. ఆ మార్పుల కారణంగా కూడా పడిపోవడం జరగవచ్చు.
వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగించడం, వినికిడి శక్తి క్షీణించడం వంటివి చాలా సాధారణం. ఒక్కోసారి పెద్దవారు అకస్మాత్తుగా పడిపోడానికి ఈ అంశాలు కూడా దోహదం చేస్తుంటాయి.
మీరు జాగ్రత్తగా గమనిస్తే వయసు పెరుగుతున్న కొద్దీ వారు నిటారుగా ఉండలేదు. వాస్తవానికి పెద్దవయసు వారు పడిపోకుండా ఉండేందుకే ప్రకృతి వారిని ఇలా ముందుకు ఒంగిపోయేలా చేస్తుంది. దాంతో వారి గరిమనాభి (సెంటర్‌ ఆఫ్‌ గ్రావిటీ) భూమికి చాలా దగ్గరగా ఉండటం వల్ల పడిపోవడానికి అవకాశాలు తగ్గడం కోసమే ప్రకృతి వారిని ముందుకు వంగిపోయేలా చేస్తుంది. ఇది సాధారణంగా జరిగే పరిణామం. అయితే వారిలా ముందుకు వంగిపోవడమే ఒక్కోసారి పడిపోవడానికి కారణం కావచ్చు.
పెద్ద వయసు వచ్చాక గుండె జబ్బులనీ లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్యలంటూ వారు అనేక రకాల మందులు వాడాల్సి వస్తుంటుంది. ఒక్కోసారి ఆ మందుల ప్రభావం కారణంగా కూడా పడిపోయే ప్రమాదం ఉంది.
కొందరిలో నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా నరాల సమస్యలున్నప్పుడు పడిపోయే అవకాశాలు మరింత ఎక్కువ. అయితే ఒక్క విషయం. కొందరిలో నరాలకు సంబంధించిన కారణాలేమీ లేకుండానే ముందుకో వెనక్కో పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మొబైల్‌లో మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరగవచ్చు. అందుకే మొబైల్‌లో మాట్లాడుతూ నడవకూడదు. పెద్ద వయసు వారికే కాదు... ఈ నియమం అందరికీ వర్తిస్తుంది.

వృద్ధాప్యంలో అకస్మాత్తుగా పడిపోవడానికి మరికొన్ని వైద్యపరమైన కారణాలు
సింకోప్‌: కొంతమంది కొద్దిసేపు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినట్లుగా అయిపోతారు. కళ్లు తిరుగుతాయి. చూపు తాత్కాలికంగా మసకబారుతుంది.  ముఖంలో రక్తపుచుక్క లేనట్లుగా పాలిపోతారు. శరీరం చల్లబడి, ఒళ్లంతా చెమటలు పట్టవచ్చు. ఇలాంటి కండిషన్లతో వ్యక్తులు అకస్మాత్తుగా పడిపోయి, ఎముకలు విరగడం, తలకు గాయం కావడం వంటి ప్రమాదం జరగవచ్చు. ఒక్కోసారి మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. ఇలా అకస్మాత్తుగా తాత్కాలికంగా స్పృహ కోల్పోడాన్ని సింకోప్‌ అంటారు. దీనికి అనేక అంశాలు కారణం కావచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, మన మనసుకు ఏమాత్రం నచ్చని విషయాలను చూడటం (ఉదాహరణకు ఎవరైనా గాయపడటం, ఎవరికైనా తీవ్రమైన రక్తస్రావం అవుతుండటం, తీవ్రమైన నొప్పి/వేదనతో బాధపడటం వంటి అన్‌ప్లెజెంట్‌ విజువల్‌ స్టిములై వల్ల) ఇలా జరగవచ్చు.
పోష్చరల్‌ హైపోటెన్షన్‌ (లో బీపీ): ఇది అకస్మాత్తుగా బీపీ పడిపోయే పరిస్థితి. సాధారణంగా దీనికి ముందు శరీరంలోని ద్రవాలు, ఖనిజాల పాళ్లు తగ్గడం, ఏదైనా మందు/ఔషధం తీసుకోవడం వల్ల ఇలా జరగవచ్చు. ఒక్కోసారి మనం  కూర్చున్న స్థితి నుంచి అకస్మాత్తుగా పైకి లేవడం లేదా ఉన్నట్టుండి పక్కపై నుంచి లేవడం జరిగినప్పుడు కూడా బీపీ అకస్మాత్తుగా పడిపోవచ్చు. ఇలా పడిపోవడం అన్నది 20 హెచ్‌జీ/ఎంఎం కంటే ఎక్కువగా పడిపోతే (అంటే బీపీ అకస్మాత్తుగా తగ్గితే) మెదడుకు  చేరాల్సిన రక్తం పరిమాణం ఒకేసారి తగ్గిపోతుంది. దాంతో ఇలా పడిపోవడం జరుగుతుంది.
నిలబడి మూత్రవిసర్జన చేసే సమయంలో లేదా అకస్మాత్తుగా దగ్గు వచ్చినప్పుడు ఒక్కోసారి బీపీ అకస్మాత్తుగా తగ్గిపోయి పడిపోయే ప్రమాదం ఉంది.
వర్టిగో : ఒక్కోసారి కళ్లు తిరిగినట్లుగా అయిపోయి ఒళ్లు స్వాధీనం తప్పి పడిపోవచ్చు. ఇది సాధారణంగా లోపలిచెవి లేదా బ్రెయిన్‌ స్టెమ్‌లో ఉన్న వ్యాధుల వల్ల ఇలా జరగవచ్చు.
ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ ఎటాక్‌ (టీఐఏ): ఒక్కోసారి కొందరిలో చాలా తక్కువ తీవ్రతతో పక్షవాతం వచ్చి, మళ్లీ వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఇలాంటి కండిషన్‌ను వైద్య పరిభాషలో ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ ఎటాక్‌ అంటారు. అకస్మాత్తుగా పడటడానికి ఇది  కూడా ఒక కారణం. ఇలాంటి సందర్భాల్లో కొందరిలో సరిగా మాట రాకపోవడం, మాటలు ముద్దగా రావడం, కాళ్లూ, చేతులు తాత్కాలికంగా బలహీనంగా మారడం జరగవచ్చు.
ఫిట్స్‌ : కొందరిలో ఒక్కోసారి ఫిట్స్‌ రావడం / స్పృహ కోల్పోవడం / శరీరమంతా కుదుపునకు (జెర్క్‌) లోనుకావడం వల్ల పడిపోవడం జరగవచ్చు.
పార్కిన్‌సన్‌ డిసీజ్‌ : ఈ వ్యాధి ఉన్నవారిలో పడిపోవడం అన్నది శరీరం సరైన బ్యాలెన్స్‌ లేకపోవడం వల్ల జరుగుతుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో శరీర కదలికలు మందగించడం వల్ల పడిపోవడం జరగవచ్చు.
వెన్నెముక / నరాలు / కండరాల వ్యాధుల వల్ల ఒక్కోసారి కాళ్లూ చేతులు బలహీనమైపోయి పడిపోవచ్చు.
మన శరీరంలోని సోడియమ్, పొటాషియమ్‌ వంటి లవణాల పాళ్లు, చక్కెర పాళ్లు  తగ్గిపోయి పడిపోయే ప్రమాదం ఉంది.
చాలా అరుదుగా ఒక్కోసారి మెదడులో కణుతులు, మతిమరపు, సైకోసిస్‌ వంటి అంశాలు కూడా పడిపోవడానికి దోహదం చేయవచ్చు.

పడిపోయే అవకాశాలుఎవరెవరిలో ఎక్కువ...
రెండు కాళ్ల మధ్య తక్కువ ఖాళీ ఉంచుతూ నడిచేవారు. నడిచే సమయంలో అడుగులు చిన్నవి చిన్నవిగా వేసేవారు.
నిల్చున్నప్పుడు రెండు కాళ్ల మధ్య చాలా తక్కువగా ఖాళీ ఉంచేవారు.
నడిచే సమయంలో కళ్లు మూసుకునేలా ముఖం ఎక్కువగా రుద్దుకునేవారు.
అకస్మాత్తుగా పడిపోవడాన్ని నివారించడం ఇలా...
గతంలో అకస్మాత్తుగా పడిపోయిన  సంఘటనలు జరిగినవారు లేదా అలాంటి వైద్యచరిత్ర (మెడికల్‌ హిస్టరీ) ఉన్నవారు ముందుగా తాము అలా పడిపోవడానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. సమస్యను గుర్తించి అందుకు అవసరమైన మందులు వాడాలి.
వైద్యపరమైన కారణాలు కాకుండా... అలా పడిపోవడానికి నిర్దిష్టమైన కారణాలను తెలుసుకొని... వాటిని సరిదిద్దుకోవాలి. అంటే ఉదాహరణకు ... పడుకున్నవారు అకస్మాత్తుగా లేవడం వల్ల పడిపోయినా / కూర్చుని ఉన్నవారు అకస్మాత్తుగా లేచి నిల్చున్నప్పుడు పడిపోవడం జరిగినా, ముఖ్యంగా మూత్ర విసర్జన చేసిన తర్వాత... అలా వెంటనే ఠక్కుమంటూ కదలడం / లేవడం సరికాదు. ఒక్కోసారి నిల్చుని మూత్ర విసర్జన చేసే వారు పడిపోతున్నట్లుగా అనిపిస్తే... అలాంటివారు కూర్చుని మూత్ర విసర్జన చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇక పడుకున్న వారు లేవాల్సి వస్తే పక్కలో మెల్లగా ఒక పక్కకు ఒరుగుతూ లేచి కూర్చుని... ఆ తర్వాత మెల్లగా నించోవాలి. అలాగే కూర్చున్న వారు కూడా ఒకేసారి కుర్చీలోంచి లేవకుండా... మెల్లగా లేని నిల్చోవాలి.
అకస్మాత్తుగా పడిపోవడానికి నరాలకు సంబంధించిన (న్యూరలాజికల్‌) కారణాలు ఏవైనా ఉంటే వాటిని వైద్యపరంగా లేదా ఇతరత్రా సరిదిద్దుకోవాలి.
ఉపకరణాలు వాడటం: అకస్మాత్తుగా పడిపోయే వారు తమకు అవసరమైన ఉపకరణం... అంటే వాకర్‌ / చేతికర్ర (వాకింగ్‌ స్టిక్‌) / కళ్లజోడు వంటి ఉపకరణాలు వాడటం అవసరం. అవి లేకపోతే పడిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే వాటి అవసరం ఉన్నవారు వాటిని విస్మరించకూడదు.
మహిళలు హైహీల్స్‌ వాడటం సరికాదు. దానికి బదులు తమకు సురక్షితంగా ఉంటూ నచ్చే పాదరక్షలు ధరించాలి.
కాలి కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు, వాకింగ్‌ వంటివి చేయడం అవసరం.
ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాలను నివారించుకోవచ్చు.

ఇవి మరికొన్ని జాగ్రత్తలు...
పడిపోవడాన్ని నివారించే నాన్‌స్టిక్‌ మ్యాట్స్‌ వాడాలి.
ఘర్షణ (ఫ్రిక్షన్‌) ఎక్కువగా ఉంటే ఫ్లోరింగ్‌ వేయించాలి. టాయిలెట్స్, బాత్‌రూమ్‌లలో కూడా జారిపడేందుకు ఆస్కారం ఉన్న పూర్తిగా నున్నగా ఉండే టెయిల్స్‌కు బదులు మంచిగా నిలబడటానికి పట్టునిచ్చే తరహా టైల్స్‌ వాడాలి.
కాలుజారడానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకు ఫ్రిక్షన్‌ను పెంచే కార్పెట్స్‌ పరచుకోవాలి.  
గదిలో ధారాళంగా మంచి వెలుతురు / గాలి వచ్చేలా చేసుకోవాలి.  
టాయిలెట్స్, బాత్‌రూమ్స్‌లో మంచి పట్టు ఉండటానికి వీలుగా హ్యాండ్‌ రెయిల్స్‌ అమర్చుకోవడం, బాత్‌రూమ్‌ బయట కాలుజారకుండా ఉండే మ్యాట్స్‌ వాడటం వంటివి చేయాలి.
మరీ అవసరమైతే తప్ప ఎక్కడా ఎత్తులకు ఎక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఎత్తుల నుంచి దిగేటప్పుడు పడిపోవాడానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి అలా దిగాల్సి వచ్చినప్పుడు మెట్ల పక్కన ఉండే పట్టు (రెయిలింగ్స్‌) పట్టుకుని జాగ్రత్తగా దిగాలి. -డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి,చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్,హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement