సాక్షి, అమరావతి: పౌల్ట్రీ రంగంలో ఆడ కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణ చేశారు. మగ కోడి పిల్లలు పుట్టకుండా జన్యు సవరణ చేశారు. గుడ్ల ఉత్పత్తికి మగ కోడి పిల్లలు పనికిరావు. సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే బై ప్రొడక్ట్ (ఉప ఉత్పత్తి) కింద లెక్క. అంటే ఏదైనా ప్రయోగంలో ‘అసలు ఉత్పత్తి’ కాకుండా.. అదనంగా వచ్చేవి. ఇవి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు.
పౌల్ట్రీలో మాత్రం మగ కోడి పిల్లలూ ఎందుకూ పనికిరావు. అందుకే గుడ్లు పొదిగిన తర్వాత అవి మగవైతే వెంటనే చంపేస్తారు. వాటి నుంచి వచ్చే మాంసం కూడా ఆశించిన విధంగా ఉండదు. దాదాపు తినడానికి పనికిరాదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా వందల కోట్ల మగ కోడి పిల్లల్ని చంపేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని వాల్కని ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు.. కేవలం గుడ్లు పొదిగే కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా వాటి జన్యువుల్ని సవరించి సత్ఫలితాలు సాధించారు. తాజా పరిశోధనతో కోట్లాది మగ కోడి పిల్లల్ని చంపే పరిస్థితి పోతుంది. ఈ జన్యు సవరణ పరిశోధన అద్భుతాలు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఏటా 750 కోట్ల కోడి పిల్లల మృత్యువాత..
ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా గుడ్ల కోసం 1,500 కోట్ల కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందులో సగం మగ కోళ్లు, సగం ఆడ కోళ్లు ఉంటాయి. గుడ్ల ఉత్పత్తికి మగ కోళ్లు ఉపయోగపడకపోవడంతో వాటిని పుట్టిన వెంటనే చంపేస్తున్నారు. అంటే ఏటా దాదాపు 750 కోట్ల కోళ్లను పుట్టగానే చంపేస్తారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
తాజా పరిశోధన వెనుక జంతు సంక్షేమాన్ని కాంక్షించే కంపాషన్ ఇన్ వరల్డ్ ఫార్మింగ్ సంస్థ ఉంది. కోట్లాది కోడి పిల్లలను క్రూరంగా చంపే విధానానికి స్వస్తి పలికే ఉద్దేశంతోనే ఈ పరిశోధన జరిగినట్లు చెబుతున్నారు.
ఆడ కోళ్లను మాత్రమే ఎలా ఉత్పత్తి చేస్తారంటే..
ఆడ కోళ్లలో ఒక డబ్ల్యూ, ఒక జెడ్ క్రోమోజోమ్ కలిపి(డబ్ల్యూజెడ్) ఉంటాయి. మగ కోళ్లలో రెండూ జెడ్ క్రోమోజోములే(జెడ్‌జెడ్) ఉంటాయి. పరిశోధనలో భాగంగా ఆడ కోడిలోని జెడ్ క్రోమోజోమ్‌పై ఒక బ్లూ లైట్ వేయడం ద్వారా దాని జన్యువును మార్పు చేశారు.
దాన్ని మగ కోడితో జత చేసినప్పుడు.. మగ కోడి పిల్లలు జన్మించవని నిరూపించారు. అదే సమయంలో ఆడ కోళ్ల పుట్టుకపై దీని ప్రభావం ఉండదు. మగ కోడిలోని జెడ్ క్రోమోజోమ్‌ను మాత్రమే అవి తీసుకుంటాయి. దీని వల్ల కేవలం గుడ్లు ఉత్పత్తి చేసే ఆడ కోళ్లు మాత్రమే పుడతాయి.
Comments
Please login to add a commentAdd a comment