Israeli scientists
-
శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణ.. పెట్టలు మాత్రమే పుట్టేలా..!
సాక్షి, అమరావతి: పౌల్ట్రీ రంగంలో ఆడ కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణ చేశారు. మగ కోడి పిల్లలు పుట్టకుండా జన్యు సవరణ చేశారు. గుడ్ల ఉత్పత్తికి మగ కోడి పిల్లలు పనికిరావు. సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే బై ప్రొడక్ట్ (ఉప ఉత్పత్తి) కింద లెక్క. అంటే ఏదైనా ప్రయోగంలో ‘అసలు ఉత్పత్తి’ కాకుండా.. అదనంగా వచ్చేవి. ఇవి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. పౌల్ట్రీలో మాత్రం మగ కోడి పిల్లలూ ఎందుకూ పనికిరావు. అందుకే గుడ్లు పొదిగిన తర్వాత అవి మగవైతే వెంటనే చంపేస్తారు. వాటి నుంచి వచ్చే మాంసం కూడా ఆశించిన విధంగా ఉండదు. దాదాపు తినడానికి పనికిరాదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా వందల కోట్ల మగ కోడి పిల్లల్ని చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని వాల్కని ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు.. కేవలం గుడ్లు పొదిగే కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా వాటి జన్యువుల్ని సవరించి సత్ఫలితాలు సాధించారు. తాజా పరిశోధనతో కోట్లాది మగ కోడి పిల్లల్ని చంపే పరిస్థితి పోతుంది. ఈ జన్యు సవరణ పరిశోధన అద్భుతాలు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏటా 750 కోట్ల కోడి పిల్లల మృత్యువాత.. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా గుడ్ల కోసం 1,500 కోట్ల కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందులో సగం మగ కోళ్లు, సగం ఆడ కోళ్లు ఉంటాయి. గుడ్ల ఉత్పత్తికి మగ కోళ్లు ఉపయోగపడకపోవడంతో వాటిని పుట్టిన వెంటనే చంపేస్తున్నారు. అంటే ఏటా దాదాపు 750 కోట్ల కోళ్లను పుట్టగానే చంపేస్తారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. తాజా పరిశోధన వెనుక జంతు సంక్షేమాన్ని కాంక్షించే కంపాషన్ ఇన్ వరల్డ్ ఫార్మింగ్ సంస్థ ఉంది. కోట్లాది కోడి పిల్లలను క్రూరంగా చంపే విధానానికి స్వస్తి పలికే ఉద్దేశంతోనే ఈ పరిశోధన జరిగినట్లు చెబుతున్నారు. ఆడ కోళ్లను మాత్రమే ఎలా ఉత్పత్తి చేస్తారంటే.. ఆడ కోళ్లలో ఒక డబ్ల్యూ, ఒక జెడ్ క్రోమోజోమ్ కలిపి(డబ్ల్యూజెడ్) ఉంటాయి. మగ కోళ్లలో రెండూ జెడ్ క్రోమోజోములే(జెడ్‌జెడ్) ఉంటాయి. పరిశోధనలో భాగంగా ఆడ కోడిలోని జెడ్ క్రోమోజోమ్‌పై ఒక బ్లూ లైట్ వేయడం ద్వారా దాని జన్యువును మార్పు చేశారు. దాన్ని మగ కోడితో జత చేసినప్పుడు.. మగ కోడి పిల్లలు జన్మించవని నిరూపించారు. అదే సమయంలో ఆడ కోళ్ల పుట్టుకపై దీని ప్రభావం ఉండదు. మగ కోడిలోని జెడ్ క్రోమోజోమ్‌ను మాత్రమే అవి తీసుకుంటాయి. దీని వల్ల కేవలం గుడ్లు ఉత్పత్తి చేసే ఆడ కోళ్లు మాత్రమే పుడతాయి. -
కోవిడ్‌పై పోరులో ఇజ్రాయెల్ ముందంజ!
జెరూసలెం: కరోనా వైరస్‌పై పోరులో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. వైరస్‌ను నిర్వీర్యం చేయగల యాంటీబాడీ తయారీలో విజయం సాధించారు. ఈ అంశంపై పేటెంట్లు సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టామని, త్వరలో వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి నఫ్టాలీ బెన్నెట్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కోవిడ్ టీకా అభివృద్ధి బాధ్యతలు అప్పగించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) సంస్థ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలోనే ఈ సంస్థ వైరస్‌కు సంబంధించిన కీలకమైన విషయాలను అర్థం చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే దానికీ.. తాజా పరిణామానికి మధ్య సంబంధం ఉందా? లేదన్నది స్పష్టం కాలేదు. కొత్తగా తయారు చేసిన యాంటీబాడీని మనుషులపై ప్రయోగించిన విషయం కూడా రూఢి కాలేదు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ మాత్రం నడిచినట్లు సమాచారం. యూరప్ శాస్త్రవేత్తలూ తయారు చేశారు.. కరోనా వైరస్‌ను మట్టుబెట్టగల ఓ యాంటీబాడీని యూరప్ శాస్త్రవేత్తలూ గుర్తించారు. 47డీ11 అని పిలుస్తున్న ఈ యాంటీబాడీ వైరస్ కొమ్మును లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. 2003 నాటి సార్స్ వైరస్‌ను అడ్డుకునే యాంటీ బాడీల్లో ఒకటైన 47డీ11 తాజా వైరస్‌ను నిర్వీర్యం చేయగలదని వీరు గుర్తించారు. ఇప్పటివరకూ వైరస్ సోకని వ్యక్తులకు ఈ యాంటీబాడీ రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో ఈ యాంటీబాడీ వైరస్ కణానికి అతుక్కోకుండా అడ్డుకొని వైరస్ పనిచేయకుండా చేయగలిగిందని తెలుస్తోంది. టీకా తయారీలో ఇటలీ పురోగతి కరోనా వైరస్ టీకా తయారీలో ఇటలీ గణనీయ ప్రగతి సాధించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేసినట్లు ఇటలీ ప్రకటించింది. రోమ్‌లోని స్పాల్లంజనీ ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా తయారైన యాంటీబాడీలు మానవ కణాలపై ప్రభావవంతంగా పనిచేసినట్లు ‘అరబ్ న్యూస్’ తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించి చూడగా వాటిలో కరోనా వైరస్‌ను నివారించే యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తయ్యాయి. త్వరలో మరిన్ని ప్రయోగాలు జరపనున్నారు. కరోనా వైరస్‌లో సంభవించే ఎలాంటి మార్పులనైనా తట్టుకునే సామర్థ్యం ఈ యాంటీబాడీలకు ఉంది. ఇప్పటి వరకు తయారయిన టీకాలన్నీ డీఎన్ఏ ప్రొటీన్ ఆధారంగా చేసుకుని రూపొందించినవే. ‘ఇటలీ తయారు చేసిన టీకా అత్యంత అధునాతనమైనది’ అని ఈ టీకా తయారు చేస్తున్న టకిస్ కంపెనీ సీఈవో లూయిగి ఔరిసిషియో అన్నారు. మరికొద్ది నెలల్లోనే మనషులపై టీకా ప్రయోగాలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. -
నానోకు ఏటా నిధులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సామాజిక సమస్యల పరిష్కారంతో పాటు జీవన నాణ్యతను మెరుగు పరచే క్రమంలో నానోసైన్స్, నానోటెక్నాలజీలను ఏటా నిర్ణీత నిధులతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత రత్న అవార్డు విజేత ప్రొఫెసర్ సీఎన్ఆర్. రావు సూచించారు. నానో అనేది పరమాణువు శాస్త్రీయ కొలమానమని, మనిషి శిరోజం కంటే 50 వేల వంతులు చిన్నదిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడి అశోకా హోటల్లో గురువారం ప్రారంభమైన ‘ఆరో బెంగళూరు ఇండియా నానో’లో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తు సైన్స్‌గా విభిన్న రంగాల్లో ప్రజలకు ప్రయోజనాలను అందించే సామర్థ్యం నానో టెక్నాలజీకి ఉందని తెలిపారు. నానో గొప్పదనాన్ని ఆయన వివరిస్తూ, ‘ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు నానో ముక్కును అభివృద్ధి పరిచారు. ఈ ముక్కు ద్వారా తుమ్మితే కేన్సర్ రోగిలోని కేన్సర్ అణువులు బయట పడతాయి’ అని వివరించారు. నానో పార్కు రాష్ర్టంలో నానా టెక్నాలజీ అభివృద్ధికి నానో పార్కును స్థాపించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు ఇండియా నానోను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, నానో టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలను కల్పిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సీఎన్ఆర్. రావును ఇండియా నానో సైన్స్-2013 పురస్కారంతో సత్కరించారు.