జెరూసలెం: కరోనా వైరస్‌పై పోరులో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. వైరస్‌ను నిర్వీర్యం చేయగల యాంటీబాడీ తయారీలో విజయం సాధించారు. ఈ అంశంపై పేటెంట్లు సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టామని, త్వరలో వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి నఫ్టాలీ బెన్నెట్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కోవిడ్ టీకా అభివృద్ధి బాధ్యతలు అప్పగించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) సంస్థ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలోనే ఈ సంస్థ వైరస్‌కు సంబంధించిన కీలకమైన విషయాలను అర్థం చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే దానికీ.. తాజా పరిణామానికి మధ్య సంబంధం ఉందా? లేదన్నది స్పష్టం కాలేదు. కొత్తగా తయారు చేసిన యాంటీబాడీని మనుషులపై ప్రయోగించిన విషయం కూడా రూఢి కాలేదు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ మాత్రం నడిచినట్లు సమాచారం.
యూరప్ శాస్త్రవేత్తలూ తయారు చేశారు..
కరోనా వైరస్‌ను మట్టుబెట్టగల ఓ యాంటీబాడీని యూరప్ శాస్త్రవేత్తలూ గుర్తించారు. 47డీ11 అని పిలుస్తున్న ఈ యాంటీబాడీ వైరస్ కొమ్మును లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. 2003 నాటి సార్స్ వైరస్‌ను అడ్డుకునే యాంటీ బాడీల్లో ఒకటైన 47డీ11 తాజా వైరస్‌ను నిర్వీర్యం చేయగలదని వీరు గుర్తించారు. ఇప్పటివరకూ వైరస్ సోకని వ్యక్తులకు ఈ యాంటీబాడీ రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో ఈ యాంటీబాడీ వైరస్ కణానికి అతుక్కోకుండా అడ్డుకొని వైరస్ పనిచేయకుండా చేయగలిగిందని తెలుస్తోంది.
టీకా తయారీలో ఇటలీ పురోగతి
కరోనా వైరస్ టీకా తయారీలో ఇటలీ గణనీయ ప్రగతి సాధించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేసినట్లు ఇటలీ ప్రకటించింది. రోమ్‌లోని స్పాల్లంజనీ ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా తయారైన యాంటీబాడీలు మానవ కణాలపై ప్రభావవంతంగా పనిచేసినట్లు ‘అరబ్ న్యూస్’ తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించి చూడగా వాటిలో కరోనా వైరస్‌ను నివారించే యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తయ్యాయి. త్వరలో మరిన్ని ప్రయోగాలు జరపనున్నారు. కరోనా వైరస్‌లో సంభవించే ఎలాంటి మార్పులనైనా తట్టుకునే సామర్థ్యం ఈ యాంటీబాడీలకు ఉంది. ఇప్పటి వరకు తయారయిన టీకాలన్నీ డీఎన్‌ఏ ప్రొటీన్ ఆధారంగా చేసుకుని రూపొందించినవే. ‘ఇటలీ తయారు చేసిన టీకా అత్యంత అధునాతనమైనది’ అని ఈ టీకా తయారు చేస్తున్న టకిస్ కంపెనీ సీఈవో లూయిగి ఔరిసిషియో అన్నారు. మరికొద్ది నెలల్లోనే మనషులపై టీకా ప్రయోగాలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment