తక్కువ కాలంలో మంచి నికరాదాయం పొందాలనుకుంటే సీమ పందుల పెంపకం చేపట్టడం ఒక్కటే మార్గం అంటున్నారు యువ మహిళా రైతు రాచెల్లి అనూష. తెలంగాణ రాష్ట్రం జిల్లా కేంద్రం సిద్దిపేటకు 12 కిలో మీటర్ల దూరంలోని మల్యాలకు చెందిన అనూష సీమ పందులను పెంచుతూ చక్కటి ఆదాయాన్ని గడిస్తున్నారు. పట్టభద్రురాలైన అనూష తన భర్త మల్లేశం ప్రోత్సాహంతో తన నాలుగు ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం నుంచి స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాల పాలయ్యారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, నాటుకోళ్లు, కంజు పిట్టలు, కుందేళ్లు, కొర్రమీను చేపలు.. ఏవి పెంచినా కలిసిరాలేదు.
మూడేళ్లు తిప్పలు పడిన తర్వాత వెటర్నరీ కళాశాలకు చెందిన నిపుణులు డా. ప్రసాద్, డా. విద్య సలహా మేరకు సీమ పందుల ఫాంను ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందుతున్నారు. పందులు పెంచటం ఏమిటని బంధువులు వారించినా పట్టించుకోకుండా భర్త సహకారంతో 2020 మార్చిలో 14 సీమ పందులను కొని తెచ్చుకొని పెంపకం ప్రారంభించారు. లార్ట్ వైట్ యార్క్ షేర్, ల్యాండ్రెస్, డ్యూరార్, లార్జ్ బ్లాక్ యార్క్ షేర్ వంటి సంకర జాతి పందులను ఆమె పెంచుతున్నారు.
ఫాంలో ఇప్పుడు వాటి సంఖ్య 150కి పెరిగింది. ఫాం సమీపంలోనే ఇంటిని నిర్మించుకొని నిరంతరం తానే స్వయంగా అన్ని పనులూ చేసుకోవటం ద్వారా అనూష చక్కటి ఫలితాలు పొందుతున్నారు. మార్కెటింగ్ సమస్య లేదని అంటూ.. కర్ణాటక, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి సీమ పందులను కొనుక్కెళ్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి రైతులు వచ్చి ఫాంను చూసి, పిల్లలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారన్నారు. వారానికో రోజు పంది మాంసాన్ని కిలో రూ. 280 చొప్పున ఫాం దగ్గరే విక్రయిస్తున్నారు.
మార్కెటింగ్ సమస్య లేదు!
సీమ పందులకు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ. పోటీ తక్కువ. శ్రమ తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ సమస్య లేదు. ఒక ఎకరం భూమి సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో రెండు పందులను పెంచితే అంతే ఆదాయం వస్తుంది. దాణా, గడ్డి రోజుకు రెండు సార్లు వేయాలి. ఎప్పుడైనా వీలుకాకపోతే సాయంత్రం వేయకపోయినా పర్వాలేదు. 200 పందులను ఒక్కరే చూసుకోవచ్చు. పందులను సాదుకుంటూ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు.
– రాచెల్లి అనూష, యువ రైతు
75 రోజుల్లో 20 కేజీలు
కోతకు అమ్మే పందులను, బ్రీడింగ్ కోసం అమ్మే పందులను ప్రత్యేక షెడ్లు వేసి వేర్వేరుగా పెంచుతున్నారు. పంది పిల్ల 75 రోజుల్లో 20 కేజీల బరువు పెరుగుతుందని అనూష వివరించారు. బ్రీడింగ్ కోసం 20 కేజీల బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. మాంసం కోసం కోతకైతే సుమారుగా 80 కిలోలకు పైగా బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు.
బ్రీడింగ్ పందులకు గడ్డితో పాటు రెండు పూటలా దాణా పెడుతున్నారు. కోతకు వెళ్లే పందులకు హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని కూడా మేపుతున్నారు. పశు వైద్యుడు డా. అభిలాష్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అనేక వ్యాక్సిన్లతోపాటు, ఇతర ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇస్తూ నాణ్యమైన మేతను అందిస్తే సీమపందుల పెంపకం సులభమేనని అంటారు అనూష భర్త మల్లేశం (97044 99873).
– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ; ఫోటోలు: కె. సతీష్ కుమార్
(చదవండి: సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం)
Comments
Please login to add a commentAdd a comment