జన్యు మార్పిడి చేసిన సాలీడు కాటు వల్ల తాజా స్పైడర్‌మ్యాన్ సినిమాలో హీరోకు విచిత్ర శక్తులు వస్తాయి. వాస్తవానికి సాలీడు కాటువల్ల సినిమాలో తప్ప నిజజీవితంలో ఎలాంటి శక్తులూ రావు. కానీ.. జన్యుపరంగా సాలీడుకు, మనకూ కొన్ని పోలికలు మాత్రం ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. డెన్మార్క్ ఆరస్ యూనివర్సిటీ, బీజింగ్ జీనోమిక్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా చిన్నగా ఉండే వెల్వెట్ స్పైడర్, పెద్దగా, వెంట్రుకలతో ఉండే టరంటులా స్పైడర్‌ల జన్యుపటాలను ఆవిష్కరించారు. ఈ రెండు సాలీడు జాతులు 30 కోట్ల ఏళ్ల క్రితం ఒకే జాతి సాలీడుల నుంచి పరిణామం చెందాయని అంచనా. సుదీర్ఘ కాలం అయినందున వీటిలో 300 జన్యువులు మాత్రం ఒకేలా ఉన్నట్లు గుర్తించారు.
అయితే టరంటులా సాలీడు జన్యుపటంలో ఇంకా కొన్ని జన్యుక్రమాలను ఆవిష్కరించాల్సి ఉంది. సాలెగూడు అల్లేందుకు సన్నటి, దృఢమైన దారాన్ని, విషాన్ని అవి ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి? అందుకు జన్యుపరంగా ఉన్న అనుకూలతలు ఏమిటన్నది సాలీడు జన్యుపటంతో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటి జన్యుసమాచారంపై అధ్యయనం ద్వారా భవిష్యత్తులో అత్యుత్తమమైన బయోమెటీరియల్స్, ఔషధాలు, పురుగుమందులు వంటివాటిని తయారు చేయవచ్చని చెబుతున్నారు.