Banana fruit
-
మామూలు అరటిపండు కాదు.. ‘సూపర్ బనానా’.. ప్రపంచంలో ఇదే తొలిసారి
‘రోజుకో యాపిల్.. డాక్టర్‌ను దూరం పెడుతుంద’ని ఓ సామెత ఉంది. అది సీజనల్. రేటు కూడా కాస్త ఎక్కువే. అదే సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉండేది అరటి పండు. ధర కూడా తక్కువే. మరి యాపిల్‌లా అరటిపండుతోనూ బోలెడన్ని పోషకాలు అందితే.. తక్కువ ఖర్చుతోనే మంచి ఆరోగ్యం సొంతం. ఈ ఆలోచనతోనే ఉగాండా, ఆ్రస్టేలియా శాస్త్రవేత్తలు బిల్‌గేట్స్ ఫౌండేషన్ సాయంతో ‘సూపర్ బనానా’ను రూపొందించారు. అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. కోట్ల మందికి ప్రయోజనం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాల్లో కోట్లాది మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం, కంటి చూపు దెబ్బతినడం, వ్యాధినిరోధక శక్తి లేక రోగాల పాలవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారని ప్రకటించింది. ఈ క్రమంలోనే విటమిన్ ఏ, ఇతర పోషకాలు అధికంగా ఉండే సూపర్ బనానాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బనానా21 ప్రాజెక్టు పేరిట.. జన్యు మార్పిడితో.. ♦ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు చెందినఫౌండేషన్ ఆర్థిక సాయం, ఆ్రస్టేలియా వ్యవసాయ శాస్త్రవేత్త జేమ్స్ డేల్ సహకారంతో ఉగాండా జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ లేబోరేటరీ శాస్త్రవేత్తలు ‘సూపర్ బనానా’పై 2005లో పరిశోధన చేపట్టారు. ♦ అత్యవసర పోషకాలన్నీ ఉండటంతోపాటు తెగుళ్లు, ఫంగస్‌లను తట్టుకోవడం, కరువు ప్రాంతాల్లోనూ పండించగలిగేలా నీటి ఎద్దడిని తట్టుకోగలగడం వంటి లక్షణాలు ఉండేలా అరటిని అభివృద్ధి చేశారు. ♦ జన్యు మార్పిడి విధానంలో సుమారు 18 ఏళ్లపరిశోధన తర్వాత.. విటమిన్ ఏ సహా అత్యవసర పోషకాలన్నీ ఉండేలా సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేయగలిగారు. ప్రపంచంలో ఇదే మొదటిసారి.. ఇలా పోషకాలన్నీ ఉండేలా జన్యుమార్పిడి అరటి పండ్లను అభివృద్ధి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారుల జీవితాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కొత్త అరటి రకం సాగుకు సిద్ధమైనట్టేనని, అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించారు. -
ఆంధ్రా అరటి.. చలో యూరప్
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రా అరటి’ తీపిని ప్రపంచ దేశాలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అరటి సాగు, దిగుబడి, ఎగుమతుల్లో ఇప్పటికే మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి రెండేళ్లుగా మధ్య తూర్పు దేశాలకు అరటి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది నుంచి యూరోపియన్ దేశాలతోపాటు లండన్‌కు సైతం ఎగుమతి చేయనున్నారు. కనీసం లక్ష టన్నుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యాన శాఖ ఉపక్రమించింది. రాష్ట్రంలో ఈ ఏడాది 1,08,083 హెక్టార్లలో అరటి సాగు చేస్తుండగా.. 64,84,968 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. చక్కెరకేళి, గ్రాండ్–9, ఎర్ర చక్కెరకేళి, కర్పూర, అమృతపాణి, బుడిద చక్కెరకేళి, తేళ్ల చక్కెరకేళి, సుగంధ, రస్తోలి వంటి రకాలు సాగవుతున్నాయి. వైఎస్సార్, అనంతపురం, ఉభయ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో అరటి సాగు ఎక్కువగా విస్తరించింది. పచ్చ అరటికి భలే డిమాండ్ రాష్ట్రంలో వివిధ రకాల అరటి సాగవుతున్నా.. నిల్వ సామర్థ్యం, తీపి అధికంగా ఉండే గ్రాండ్–9 (పచ్చ అరటి) మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. 2016–17 సంవత్సరంలో ఇక్కడి నుంచి ఎగుమతులకు శ్రీకారం చుట్టగా.. ఆ ఏడాది 246 టన్నుల అరటి పండ్లు ఎగుమతి అయ్యాయి. 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 టన్నులను ఎగుమతి చేశారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితులు తలెత్తినా 38,520 టన్నులను ఎగుమతి చేయగలిగారు. ముంబై కేంద్రంగా ఎగుమతులు అరటి ఎగుమతులను పెంచే లక్ష్యంతో ఐఎన్ఐ, ఫార్మ్స్, దేశాయ్, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ కంపెనీలతో రాష్ట్ర ఉద్యాన శాఖ ఒప్పందాలు చేసుకుంది. వీటితో పాటు మరో 10 మేజర్ కార్పొరేట్ కంపెనీల ద్వారా కనీసం లక్ష టన్నులను విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఒక్కొక్కటి 45 వ్యాగన్ల సామర్థ్యం గల ఆరు ప్రత్యేక రైళ్ల ద్వారా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ముంబై నౌకాశ్రయానికి అరటి పండ్లను రవాణా చేశారు. అక్కడ నుంచి విదేశాలకు 20 వేల టన్నులను ఎగుమతి చేశారు. మరో రైలు ఈ నెల 27వ తేదీన బయల్దేరబోతుంది. విత్తు నుంచి మార్కెట్ వరకు.. డ్రిప్ ఇరిగేషన్, టిష్యూ కల్చర్‌ను ప్రోత్సహించడంతో పాటు బడ్ ఇంజెక్షన్, బంచ్ స్ప్రే, బంచ్ స్లీవ్స్, రిబ్బన్ ట్యాగింగ్, ఫ్రూట్ కేరింగ్, ప్రీ కూలింగ్, వాషింగ్, గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని విభాగాల్లోనూ నాణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా.. విత్తు నుంచి మార్కెట్ వరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 12 జిల్లాల్లో 46 క్లస్టర్స్‌ను గుర్తించి ఐఎన్ఐ ఫరŠమ్స్, దేశాయ్ కంపెనీల సహకారంతో కడప, అనంతపురం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వైఎస్సార్ తోట బడుల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్రూట్ కేరింగ్ కార్యకలాపాలను రైతులకు చేరువ చేస్తున్నారు. ఆంధ్రా అరటే కావాలంటున్నారు ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల వ్యాపారులు ఆంధ్రా అరటి మాత్రమే కావాలంటున్నారని ఎక్స్‌పోర్టర్స్ చెబుతుంటే ఆశ్చర్యమేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మన అరటి కోసం ఎగుమతిదారులు పోటీపడుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎక్స్‌పోర్టర్స్ ముందుకొచ్చారు. మరింత మంది రాబోతున్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్‌తో పాటు ఆర్బీకేల ద్వారా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ తోటబడులు అరటి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంలో దోహదపడ్డాయి. ఈ ఏడాది హెక్టార్‌కు 65 నుంచి 70 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, జాయింట్ డైరెక్టర్, ఉద్యాన శాఖ (పండ్ల విభాగం) -
తొక్కేకదా అని తేలిగ్గా తీసేయకు....
కాలిఫోర్నియా: అరటి పండు తొక్కను తేలిగ్గా తీసుకొని పారేయకు. పండులోకన్నా తొక్కలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. తొక్కలో ఏ, బీ6,బీ12, సీ విటమిన్లతోపాటు మ్యాగ్నీషియమ్, పొటాషియమ్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఉన్నాయని శాండియాగోకు చెందిన లారా ఫ్లోర్స్, ఎల్లా ఆల్రెడ్ అనే పోషక విలువల నిపుణులు తెలియజేస్తున్నారు. ఏ విటమిన్ వల్ల పళ్లు, ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. పంటి చిగుళ్లు బలపడుతాయి. బీ6 విటమిన్ వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది. బీ12 విటమిన్ మెదడుతోపాటు నాడీ వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడడంతోపాటు బరువును తగ్గిస్తుంది. సీ విటమిన్ శరీరంపై గాయాలు మానేందుకు ఉపయోగపడుతుంది. కొత్త కణజాలం, లిగమెంట్ల అభివృద్ధికి దోహదపడుతుంది. ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ బలపడడమే కాకుండా శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నిద్ర లేమిని దూరం చేసేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు పొటాషియం, మ్యాగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు దోహదపడతాయి. అరటి పండు తొక్కలో మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. భారత్ లాంటి దేశాల్లో చర్మంపై దురదలు పోవడానికి, పులిపిర్లను నయం చేసేందుకు ప్రధానంగా ఉపయోగిస్తారు. దోమలు, ఇతర కీటకాలు కుట్టిన చోట తొక్కను ప్యాచ్‌లాగా వేస్తే చల్లదనానిచ్చి ఉపశమనం కలిగిస్తుంది. సిట్రిక్ యాసిడ్ కలిగిన నారింజ, నిమ్మ కాయల తొక్కల్లో కూడా పోషక విలువలు అధికంగా ఉంటాయని, అవి త్వరగా జీర్ణం కావు కనుక వాటిని ఆహారంగా తీసుకోలేమని నిపుణులు తెలియజేస్తున్నారు. అరటి పండు తొక్క త్వరగా జీర్ణమవుతుందని, నేరుగా తినలేనివాళ్లు ఉడకబెట్టుకొని, కొంచెం వేపుకొని కూడా తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
చీకాకులు తగ్గించే అరటిపండు
ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్(పిఎంఎస్)తో బాధపడుతున్న వాళ్లకు అరటి పండు చక్కని ఔషధం. పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి రోజూ ఒక అరటిపండు తింటుంటే ఆ సమయంలో బాధించే ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే ఆ సమస్య కూడా అదుపులోకి వస్తుంది. మానసిక ఒత్తిడి, అశాంతితో నిరుత్సాహంగా ఉన్నప్పుడు అరటిపండు తింటే ఉత్సాహం వస్తుంది. డిప్రెషన్‌తో బాధపడే వాళ్ల మానసిక స్థితిలో అరటిపండు తినడానికి ముందుకూ, తిన్న తర్వాతకూ మంచి మార్పు ఉంటుంది. అరటిలో ఉండే పొటాషియం మెదడును అలర్ట్‌గా ఉంచుతుంది. క్రమం తప్పకుండా ఉదయం కాని మధ్యాహ్న భోజనం తర్వాత కాని అరటిపండు తిన్న వారి మెదడు అరటిపండు తినడానికి ముందు కంటే మరింత చురుకుగా పని చేసినట్లు ఒక పరిశీలన.