extermination
-
ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోవాల్సిందే
వాషింగ్టన్: ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్ ప్రణాళికా బద్ధంగా, ప్రపంచదేశాలతో కలసి చర్యలు తీసుకోవాలని భారత్, అమెరికాలు పునరుద్ఘాటించాయి. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలని, వారికి ఎలాంటి సాయం చేయకుండా ఉండాలన్నాయి. ఏ రూపంలోనైనా ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారు దానికి తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుందని తేల్చిచెప్పాయి. ఆదివారం అమెరికా చేరుకున్న భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే సోమవారం ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో భేటీ అయ్యారు. ఈ భేటీలో విదేశీ విధానం, భద్రతాపర అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై పాంపియో, గోఖలే సంతృప్తి వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పుల్వామా దాడి అనంతరం భారత్కు మద్దతు ఇవ్వడంపై అమెరికా ప్రభుత్వానికి గోఖలే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొంది. ఉగ్రవాదం విషయంలో భారత్ ఆందోళనను తాము అర్థం చేసుకుంటానని పాంపియో వెల్లడించారని తెలిపింది. అమెరికాలోని ఇతర ప్రభుత్వ అధికారులతో కూడా గోఖలే భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
2030 మలేరియా ఖతం..!
నిర్మూలన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటా వేలాది మందిపై పంజా విసురుతున్న మలేరియా మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. మలేరియా నిర్మూలనకు అవసరమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, త్వరితగతిన వైద్య సాయం అందించడం అనే రెండు వ్యూహాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఏటా సగటున 3 వేలకుపైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 2017 జనవరి నుంచి జూలై 2 వరకు రాష్ట్రంలో 1,102 మలేరియా కేసులు నమోదైతే.. కొత్తగూడెం జిల్లాలోనే 400 కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. సరైన చికిత్సతోనే..: పరిసరాలు శుభ్రంగా లేక దోమలు వృద్ధి చెంది మలేరియా సంక్రమిస్తుంది. ఆరోగ్యపరమైన అవగాహన పెద్దగా లేని గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా మలేరియా రెండు రకాలు. జ్వర లక్షణాలతో ఉండే మలేరియాకు 14 రోజులు చికిత్స అవసరం. జ్వరం లేకుండా ఉండే తరహా మలేరియాకు 3 రోజులు చికిత్స తీసుకోవాలి. చాలా మంది జ్వరం తగ్గగానే మందులు వేసుకోవడం మానేస్తుంటారు. దాంతో మలేరియా క్రిమి మళ్లీ విజృంభిస్తుంది. 2030లోపు శాశ్వతంగా.. దశాబ్దాలుగా పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న మలేరియాను 2030లోపు పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 2027, 2028, 2029 సంవత్సరాల్లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాకుంటే.. 2030 నాటికి మలేరియా రహితంగా ప్రకటించడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. స్థానిక అవసరాలకనుగుణంగా ప్రణాళికను రూపొందించాలని సూచించింది. ఇందుకు నిధులను కేంద్రమే మంజూరు చేస్తోంది. భవిష్యత్తు తరాల కోసం.. ఆరోగ్యకరమైన భవిష్యత్ సమాజం కోసం మలేరియాను శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే 17 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మలేరియా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో 2.60 లక్షల దోమ తెరలు పంపిణీ చేశాం. మరో 4.89 లక్షల దోమ తెరలను పంపిణీ చేయనున్నాం.. –డా.ఎస్.ప్రభావతి, రాష్ట్ర అధికారి మలేరియా నిర్మూలన కార్యక్రమం -
అంటరానితనం నిర్మూలన అందరి బాధ్యత
కర్నూలు/గోస్పాడు: అంటరానితనం నిర్మూలన అందరి బాధ్యత అని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఎస్పీ ఆకె రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ రాత్రిబస చేసి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. దళితులు, నాయీబ్రాహ్మణులతో చర్చించి ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చారు. బుధవారం ఉదయం జిల్లా పోలీసు బాసు దగ్గరుండి నాయీబ్రాహ్మణులతో దళితులకు క్షౌరం చేయించి వారి మధ్య ఉన్న అంతరాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టానికి అందరూ సమానులేని, అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఉన్నాయన్నారు. నేటి ఆధునిక యుగంలో అంటరానితనానికి చోటు లేదని, ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని సూచించారు. అంటరాని తనాన్ని రూపుమాపడానికి అన్ని వర్గాల మత పెద్దలు, విద్యావంతులు, ప్రజాప్రతినిధులు, యువకులు ముందుకు రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆయన వెంట శిరివెళ్ల సీఐ శ్రీనివాసరెడ్డి, గోస్పాడు ఎస్ఐ తిరుపాలు ఉన్నారు.