కోటి ఆశలు మోసుకొస్తూ కొత్త ఆలోచనలతో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భ వించిన తర్వాత తొలిసారిగా జరుగుతుండ టంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిని తొలి తెలుగు మహాసభలుగానే పరిగణిస్తోంది. తెలుగు భాష ఘనతను చాటడం ఒక ఎత్తయితే.. తెలంగాణ యాసకు పట్టాభిషేకం చేయడం ప్రధానంగా మహాసభలను వైభవంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగువారిని ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని స్వాగతించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమవుతున్నాయి. తొలి తెలుగు మహాసభలు జరిగిన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణమే ఈసారి వేడుకలకు ప్రధాన వేదికగా ముస్తాబైంది. ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, గవర్నర్లు నరసింహన్, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు విశిష్ట అతిథులుగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సభాధ్యక్షుడిగా వేడుకలు మొదలుకాబోతున్నాయి. ప్రధాన వేదిక లాల్‌బహదూర్ క్రీడా ప్రాంగణంతోపాటు రవీంద్రభారతి ప్రధాన మందిరం, మినీ మందిరం, తెలుగు విశ్వవిద్యాలయం సభా మందిరం, తెలుగు లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని మందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తులలో తెలుగు భాషా వైభవం కళ్లకు కట్టనుంది.