భాషకు బ్రహ్మోత్సవం | special story to telugu mahasabhalu | Sakshi
Sakshi News home page

భాషకు బ్రహ్మోత్సవం

Published Sat, Dec 16 2017 1:39 AM | Last Updated on Sat, Dec 16 2017 1:49 AM

special  story to telugu mahasabhalu - Sakshi

ఆరంభం అదరహో..
మతాబులు.. బాణ సంచా వెలుగులు జిలుగులు.. ఆకాశంలో సప్తవర్ణ కాంతులు.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సంబురం మిన్నంటింది! శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తున్నట్లు రాత్రి 8.30 గంటలకు అధికారికంగా ప్రకటించిన వెంటనే.. ఆకాశంలో కాంతులు విరజిమ్మాయి. ఎల్‌ఈడీ.. లేజర్‌ లైట్ల వెలుతురుతో ఆకాశంలో సప్తవర్ణాలు ఆవిçష్కృతమయ్యాయి. సుమారు పది నిమిషాల పాటు ఈ వెలుగులు.. ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. బాణసంచా వెలుగులను తమ సెల్‌ఫోన్లలో బంధించేందుకు వీక్షకులు ఆసక్తి చూపారు. ఆకాశంలోని అద్భుత దృశ్యాలను స్టేడియం నలుమూలలా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరల్లో చూసి ఆనందించారు. ఈ మ్యూజికల్‌ ఫైర్‌వర్క్స్‌ను ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ విచ్‌క్రాఫ్ట్‌ నిర్వహించింది. వీటికి సుమారు కోటి రూపాయల దాకా వెచ్చించినట్టు నిర్వాహకులు తెలిపారు. మహాసభల ముగింపు రోజైన ఈ నెల 19న  కూడా లేజర్‌షోతోపాటు బాణసంచా కాంతులతో మరోసారి మంత్రముగ్ధులను చేయనున్నారు. మొత్తంగా వీటన్నింటికిగానూ రూ.2.20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

సాంస్కృతిక సౌరభం..
ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సౌరభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ చరిత్రను, కళలను, వైభవాన్ని ఆవిష్కరించిన రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి బృందం ప్రదర్శించిన ‘మన తెలంగాణ మాణిక్యవీణ’ సంగీత నృత్య రూపకం అలరించింది. అద్భుతమైన నృత్యం, అందుకు తగిన అభినయంతో అరంగంటకు పైగా సాగిన ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ తన్మయత్వం పొందారు. ప్రధాన వేడుకల ప్రారంభోత్సవం అనంతరం మిరుమిట్లు గొలిపే బాణ సంచా వెలుగు జిలుగులు ఒకవైపు సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు మరోవైపు మహాసభలను కన్నులపండువ చేశాయి. ప్రారంభోత్సవ వేడుకలకు ముందు మయూరి ఆర్ట్స్‌ బృందం ప్రదర్శించిన పేరిణీ లాస్యం శతాబ్దాల నాటి కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టింది. శ్రీనిధి, వందేమాతరం శ్రీనివాస్‌ గీతాలాపన మరో ఆకర్షణ. ఆద్యంతం తెలంగాణ వైభవాన్ని కీర్తిస్తూ సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. అనంతరం లిటిల్‌ మ్యుజీషియ¯Œ ్స అకాడమీ రామాచారి బృందం పాడిన పాటలు, దేశపతిశ్రీనివాస్‌ సారథ్యంలో, రాధాకృష్ణన్‌ సంగీతం కూర్చిన ‘జయజయోస్తు తెలంగాణ’ నృత్య రూపకం మరో అద్భుతమైన ప్రదర్శనగా ఆకట్టుకుంది.

ఆహా ఏమి రుచి...
ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ రుచులు అదుర్స్‌ అనిపించాయి. తెలంగాణ రాష్ట్ర హోటల్స్‌ అసోసియేష¯Œ  ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో తెలంగాణ వంటకాలను తెలుగు భాషాభిమానులు ఆరగించి తృప్తిపడ్డారు. హైదరాబాదీ బిర్యానీ, బడేమియా కబాబ్, బొక్కల పులుసు, తెలంగాణ మిర్చి బజ్జీ, బ్రెడ్‌ ఆమ్లెట్, మలాయి కుల్ఫీ, తెలంగాణ చాయ్, వేడి వేడి గుడాలు వారేవా అనిపించాయి. హైదరాబాద్‌కు వస్తే హైదరాబాదీ బిర్యాని రుచి చూడాల్సిందే. పేరుతోనే ఆకలి పెంచే హైదరాబాదీ బిర్యానీ రుచులు మహాసభల్లోనూ అదిరిపోతున్నాయి. మటన్, చికె¯Œ తో చేసిన కబాబ్స్‌ నా¯Œ వెజ్‌ ప్రియుల నోరూరించాయి. వేడి వేడి శనగ, పెసర, బబ్బెర గుడాలు గుప్పెడు నోట్లో వేసుకుంటే చాలు.. గిన్నెలోవి మొత్తం కడుపులో పడే వరకు చెయ్యీ నోరూ ఆగవు. వేడి వేడి చర్చల్లో వీటి రుచి రెట్టింపు అని గ్రహించారేమో, వాటికీ ఒక స్టాల్‌ పెట్టేశారు. సీజ¯Œ తో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమైన పానీయం తేనీరే. దీంతో సభ ప్రాంగణంలోనికి వెళ్లే ముందు చాయ్‌ కోసం పోటీ పడ్డారు. ముందే చలికాలం కావడంతో మరింత మక్కువ కనిపించింది. తెలుగు భాష తియ్యనిదే అయినా కారం అంటే మమకారం వదలరు. అందుకేనేమో మహాసభల్లో మిర్చిబజ్జీలకు మహా గిరాకీ పలికింది!

తొలి తొవ్వ మనదే
ఎన్నో సాహితీ ప్రక్రియలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి: దేశపతిమాతృభాష మీద తెలంగాణ గడ్డకు అనాదిగా అమితమైన ప్రేమ ఉంది. అనేక సాహిత్య ప్రక్రియలకు తెలుగులో తొలి తొవ్వలు పరచిన వారిలో సింహభాగం తెలంగాణ బిడ్డలే కనిపిస్తారు.  ఎన్నో ప్రక్రియలకు తెలంగాణలోనే తొలి పొద్దు పొడిచింది అని ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తన సంగీత నృత్యరూపకం గురించి ఆయన స్పందన.

పాట.. ఎన్నో మహోద్యమాలను నడిపింది. దానికి అనుసంధానంగా నృత్యరూపకాలు. ఎన్నో సందర్భాల్లో ఇవి రుజువయ్యాయి. తెలంగాణ గడ్డపైన తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన తెలంగాణ  తేజోమూర్తులు అనేక మంది ఉన్నారు. వారి కష్టం వృథా పోకూడదు. వారి వీరోచిత చరిత్ర ప్రజలకు తెలియాలి. నేటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత కవిగా నాపై ఉందని భావించా. పాటతో నృత్యరూపకం అయితే బాగుంటుందని భావించా. దీన్నుంచి పురుడుపోసుకున్నదే ‘జయ జయోస్తు తెలంగాణ’ సంగీత నృత్యరూపకం.

వాళ్లు జీవితాన్నే పాడుతారు
∙జ్ఞానపీపురస్కార గ్రహీత సీతాకాంత్‌ మహాపాత్రద్విభాషాకోవిదులు, జ్ఞానపీ అవార్డు గ్రహీత, ఒరియా నుంచి 12 భారతీయ భాషలూ, 13 భారతీయేతర భాషల్లోకీ అనువదించిన అనేక పరిశోధనాత్మక గ్రంథాలను రాసిన, ఐదు దశాబ్దాలపాటు తన సాహిత్యంతో ఒడిశా ప్రజల, ప్రధానంగా ఆదివాసీల మన్ననలనందుకున్న గొప్ప రచయిత సీతాకాంత్‌ మహాపాత్ర పుస్తకం పేరు ‘దే సింగ్‌ లైఫ్‌’. మన దేశ చరిత్రలో మౌఖిక సాహిత్య ప్రాధాన్యతను గురించి చెప్పమని ‘సాక్షి’ అడిగినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. ‘వాళ్లు తమ జీవితాన్నే పాడుతారు’. ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారాన్ని స్వీకరించడానికి హైదరాబాద్‌ వచ్చిన సీతాకాంత్‌ పంచుకున్న అంతరంగం...

‘‘వాళ్లు తమ జీవితాన్నే పాడుతారు. మొదట వాళ్ల తల్లులు, ఆ తరువాత వాళ్ల పిల్లలు, మనవలు, మునిమనవరాళ్లు. కానీ వాళ్ల సజీవ సాహితీ ప్రక్రియ అయిన మౌఖిక సాహిత్యం మరణించదు. నిరంతరం, తరం తరం ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉంటుంది. ఇక్కడైనా, ఎక్కడైనా మౌఖిక సాహిత్యానికున్న ప్రత్యేకత అది. వాళ్లు నిరక్షరాస్యులు. అయితేనేం ఎంతో పాండిత్యాన్ని చదివినవారు కూడా వాళ్ల ప్రతిభ ముందు దిగదుడుపే. తూర్పు భారతంలో నేను ఎక్కువగా పనిచేశాను. ఒడిశా, బిహార్, బెంగాల్, జార్ఖండుల్లో విస్తృతంగా ఆదివాసీల జీవితాలను చదవడం కోసమే తిరిగాను. ఆదివాసులకు ఆస్తుల్లేవు. ఆధిపత్యాల్లేవు. అవకాశాలూ లేవు. ‘దే డోంట్‌ హావ్‌ పొసిషన్‌ ఆల్సో’. వాళ్లకి తెలిసిందొక్కటే... జీవితాన్ని అనుభవించడం. వాళ్లది సామూహిక జీవితం. సమైక్య జీవనం. ఆధునిక సమాజంలో ఉన్నట్టు ఒక్కరు పాడితే వెయ్యిమంది వినడం కాదు. వారంతా కలిసి పాడతారు. ఆడతారు. అందరికోసం అందరూ అనేది వారిదైన వారి సంస్కృతి. ఈ రెండు సమూహాలకీ మధ్య ఒక బలమైన గీత ఉంది. అదే కమర్షియలైజేషన్‌. వ్యాపారీకరణ. ఒక్కరు పాడటం డబ్బు కోసం. కానీ అందరూ కలసి పాడటం ఆనందం కోసం. కళని కొనుక్కోవడం బ్రిటిష్‌ వారి నుంచే వచ్చింది. కానీ ఆదివాసీలనెవరూ కొనలేరు(నెక్లెస్‌ రోడ్‌లో ఆకాశం గుండా ఎగురుతోన్న పక్షుల్ని చూపిస్తూ). ఎందుకంటే వాళ్లు స్వేచ్ఛా జీవులు. వాళ్లకి తమవాళ్లెవరో, పరాయివాళ్లెవరో స్పష్టంగా తెలుసు. బయటి వాళ్లని వాళ్లు ‘దిక్కు’ అని పిలుస్తారు. చేయాల్సింది వాళ్లని మనలో కలుపుకోవడం కాదు. వాళ్ల సంస్కృతినీ, వారి జీవితాలనూ, వారి సాహిత్యాన్నీ కాపాడాలి. అలా అని వారు ఎదుగూబొదుగూ లేకుండా నిరక్షరాస్యులుగా ఉండాలని కాదు. వారి భవిష్యత్‌ తరాలను అక్షరాస్యులుగా మార్చి వారి కళలను కాపాడాలి. వారి హస్తకళలు ఇప్పుడు ఆధునిక ప్రపంచం గోడలకు వాల్‌హ్యాంగింగ్స్‌గా వేలాడుతున్నాయి. అలాగే ఆధునిక ప్రపంచం వారి చేతితో గీసిన బొమ్మలు వేసిన బట్టలను విస్తృతంగా వాడుకలోకి తెచ్చింది. అలా వారి మనుగడను కొనసాగనివ్వాలి. 200 ఏళ్ల క్రితం తెలుగు ఎలా వుందో, ఇప్పుడలా లేదు. మౌఖిక సంప్రదాయాల్లో కొనసాగింపు అధికం. అనేక తరాలు వాటిని అందిపుచ్చుకుని కొనసాగిస్తాయి. వాటిని అలా బతకనిస్తే చాలు’’

దేశ రాజధానిలోనూ జరగాలి!
తెలుగు సంస్కృతి ప్రపంచంలో నలుదిశలా విస్తరించింది. సంస్కృతి పరిపూర్ణమయ్యేది భాషతోనే. అలా తెలుగు భాష విస్తరించని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు. మేము మా కళ ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలలో పర్యటించినప్పుడు అక్కడ తెలుగు మహిమ గురించి మాట్లాడే అవకాశాలెన్నో వచ్చాయి. ఉద్యోగాల కారణంగా ఖండాంతరాలలో స్థిరపడిన వాళ్లు ఒక ఇరవై ఏళ్ల నుంచి తెలుగు భాష, సంస్కృతి మీద మమకారం పెంచుకుంటున్నారు. అమెరికాలో తెలుగు వారి సాంస్కృతిక సభలకు వెళ్లినప్పుడు అనేక మంది తల్లిదండ్రులు వారాంతంలో పిల్లలను కల్చరల్‌ క్లాస్‌లకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. స్విట్జర్లాండ్, స్టాక్‌హోమ్‌లో ప్రదర్శన ఇచ్చినప్పుడు 90 ఏళ్ల మహిళ ఈ పద విన్యాసం, అంగ విన్యాసం, భావ వ్యక్తీకరణ ఏకకాలంలో ఇంత అద్భుతంగా చేయడం భారతీయులకే సాధ్యం అని మురిసిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చినప్పుడు అనేక మంది ఉత్తరాది కవులు తెలుగు భాషలో, తెలుగు గ్రంథాలలో భావ వ్యక్తీకరణ రమణీయంగా ఉంటుందని ప్రశంసించేవారు. చరిత్రలో కూడా తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తించిన రాజు తెలుగేతరుడే. కృష్ణదేవరాయలు తెలుగు భాష సౌందర్యానికి ముగ్ధుడవడంతోపాటు తెలుగు కవులకు ఆశ్రయమిచ్చి తెలుగు సాహిత్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లాడు. నేటికీ మనం తెలుగు భాష గురించి గొప్పగా చెప్పుకోవడానికి కృష్ణదేవరాయలు చెప్పిన ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే జాతీయాన్నే చెప్పుకుంటున్నాం. తెలుగు భాష మహోన్నతంగా విరాజిల్లాలంటే ఇలాంటి సభలు ఇంకా జరగాలి. దేశ రాజధాని నగరంలో కూడా నిర్వహించాలి.
– రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు, ప్రముఖ నాట్యకారులు

ఇలా  చేద్దాం...!
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నిటా పాఠశాల విద్య ప్రభుత్వ నిర్వహణలోనే ఉంది. మరీ ముఖ్యంగా విద్యాబోధన తల్లి భాషలోనే జరుగుతోంది. మన దగ్గర ఇది పూర్తి విరుద్ధం. పాఠశాల విద్యను దాదాపు ప్రైవేటు పరం చేశారు. ప్రభుత్వ నియంత్రణే లేని ప్రైవేటు రంగంలో ఆంగ్లమాధ్యమ పాఠశాలలే అత్యధికం. అమెరికా, రష్యా, చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతోపాటు ఐరోపాకు చెందిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌ వంటి ఏ దేశం తీసుకున్నా అక్కడి విద్యా బోధన ప్రధానంగా తల్లిభాషలోనే! వలస విముక్త దేశాల్లో ఆంగ్ల దుష్ప్రభావం వల్ల ఎన్ని స్థానిక భాషలు కాలగర్భంలో కలిసిపోయాయో ‘యునెస్కో’వద్ద లెక్కుంది. పలు ప్రపంచ అధ్యయనాల సారం ఏమంటే.. ‘పరభాషల కన్నా తల్లి భాషలో విద్యాబోధన వల్ల పిల్లల్లో మేధోవికాసం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. అలా చేస్తూనే ఒకటి, లేదా రెండు పరభాషల్ని నేర్పించినా 13–14 ఏళ్ల వరకు పిల్లలు అత్యంత తేలిగ్గా వాటిని నేర్చుకోగల్గుతారు. అలాంటి వారే ఎన్నెన్నో పరిశోధనలు జరిపి, కొత్త విషయాలు కనుగొని, వినూత్న ఆవిష్కరణలు చేసిన దాఖలాలున్నాయి. ఇది శాస్త్రీయంగా ధృవపడిన అంశం. చైనాలో అత్యధికులకు బొత్తిగా ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషు ఎరిగిన వారూ అదనపు భాషగా నేర్చుకున్నదే! కానీ, విశ్వవ్యాప్తంగా వారు విస్తరించడానికీ, ఇటీవల సాధిస్తున్న ఆధిపత్యానికీ అదేం అవరోధం కాలేదు. పాఠశాల విద్య తల్లిభాష తెలుగులోనే ఉండాలి. ఐదారు తరగతుల నుంచి ఇంగ్లీషును అదనపు భాషగా నేర్పాలి. 12వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరి అంశం కావాలి. ఆ పైన కూడా యువతలో ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రాచీన, ఆధునిక తెలుగుసాహిత్యాన్ని విరివిగా ప్రచురించి, చౌకగా అందుబాటులోకి తేవాలి. శాస్త్ర–సాంకేతిక, విశ్వస్థాయిలో వచ్చే నూతన పదజాలానికి, భావజాలానికి తెలుగులో మంచి అనువాదం, అనుసృజన జరిపించాలి. ఇందుకోసం అకాడమీలు, భాషా పరిశోధనాలయాలు, విశ్వవిద్యాలయాల్లో భాషాపీఠాలకు తగు నిధులిచ్చి నిరంతరం క్రియాశీలంగా కృషి జరిపేట్టు చూడాలి. 
– దిలీప్‌రెడ్డి

తమిళనాట తెలుగు శోకం
తమిళనాడులో తెలుగు ‘బతికి బట్ట కట్టడం కష్టమే’నంటున్నారు మాడభూషి సంపత్‌కుమార్‌. అక్కడ మద్రాస్‌ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తెలుగు మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే..

తెలుగువాళ్లు తమిళులుగా మారుతున్నారు..తెలుగు మహాసభల ఏర్పాట్లు బాగున్నాయి. తెలుగు నేల మీద అడుగు పెట్టడమే ఒక పులకింత అయితే ఆత్మీయ స్వాగతం మరింత ఆనందపరిచింది.
తమిళనాడులో మన తెలుగు పరిస్థితి ‘బతికి బట్ట కట్టడం కష్టమే’ అన్నట్లుంది. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తమిళనాడులో తెలుగు వాళ్ల సంఖ్య 40 శాతం. ఇప్పుడు రెండు శాతానికి మించి లేదు. ఉన్న తెలుగు జనం మాత్రం ఎక్కడికీ పోవడం లేదు. పిల్లవాడిని పాఠశాలలో చేర్చేటప్పుడు కృష్ణ అనే పేరు ఉంటే కృష్ణన్‌ అని రాసేస్తారు. అలా తెలుగు వాళ్లు తమిళులుగా మారిపోతున్నారు.తెలుగు టీచర్‌ రిటైర్‌ అయితే అంతే..తమిళనాడులో ఒకప్పుడు తెలుగు పాఠశాలలు ఉండేవి. కానీ ఆ స్కూళ్లలో తెలుగు టీచర్‌ రిటైర్‌ అయితే ఇక ఆ పోస్టును భర్తీ చేయడం లేదు. దాంతో పిల్లలు అందులో చేరరు. ‘విద్యార్థులు చేరడం లేదు కాబట్టి ఆ పోస్టును రద్దు చేస్తున్నాం’ అని ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెలుగు భాషను అణచివేస్తోంది. 2006లో నిర్బంధ తమిళ విద్య చట్టాన్ని తెచ్చింది. ఇతర భాషలను చదవడానికి ఇప్పుడసలే వీల్లేదు.  అందుకే తెలుగు భాషా పరిరక్షణ సమితి తమిళులకు వాళ్ల మాతృభాష మీద ప్రేమ చాలా ఎక్కువ. ఈ క్రమంలో వారి తీరుతో తెలుగు భాష, తెలుగు వాళ్లు వివక్షకు గురవుతున్నారని అనిపించేది. అందుకే తెలుగు వాళ్లను ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నంలోనే భాగంగానే తెలుగు భాçషా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. యూనివర్సిటీలో తమిళ ప్రొఫెసర్‌లు పైకి ఏమీ అనరు. కానీ తమిళనాడులో ఉన్నప్పుడు తమిళులుగానే జీవించవచ్చు కదా, తెలుగు భాష అంటూ ఇవన్నీ ఎందుకు... అని తమలో తాము చర్చించుకుంటారు!

తెలుగు మాట్లాడేవారు 16 కోట్లుతెలుగు మాట్లాడేవాళ్లు 16 కోట్ల మంది ఉన్నారు. అయితే ఇందులో సగం మంది తెలుగేతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాబట్టి ఈ సంఖ్యను ప్రభుత్వాలు అధికారికంగా ఒప్పుకోవు.  ప్రభుత్వాలు తమిళనాడుతో మాట్లాడాలి..తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పుడే.. భాష పరిరక్షణకు మాలాంటి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలకు ఊతం వస్తుంది. కన్నడిగులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల ఫొటోలను ఇళ్లలో పెట్టుకుంటారు. తెలుగులో ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు వస్తే... ఆ సంగతి సాహిత్యకారులకు తప్ప సామాన్యులకు తెలీదు.       
– వాకా మంజులారెడ్డి

తెలుగును కాదని పరభాషని ప్రేమించకూడదుచరిత్రకారులు కొందరు జరిగిన దాన్ని రాస్తారు. కానీ జరుగుతున్న ప్రజల చరిత్రను, వారి అనుభవాలను రాయడమే నేడు అవసరం అంటారు కారా మాష్టారుగా తెలుగు ప్రజలకు పరిచయమైన కాళీపట్నం రామారావు. 93 ఏళ్ల  వయోవృద్ధులు కారా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. 

నేటి తరానికి కావాల్సిన కథలెలా ఉండాలి? 
సంస్కృతం చదివిన వారికి కూడా కావ్యాలు చదివే శక్తిలేదిప్పుడు. కూటి కోసం, కూలి కోసం వలసెళుతున్న ఎందరో పేదలు నిలువనీడలేక, బ్రిడ్జిల కింద కూడా తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తుల జీవితాల్ని ఆవిష్కరించే రచనలు, ఆ అభిప్రాయాలను వ్యక్తీకరించే పాత్రలు రచనల్లో కనపడాలి. 

తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ కాపాడుకోవడానికి ఏం చేయాలంటారు?
ప్రగతిశీల భావాలు కలిగిన వారే ఆ పని చేయగలరని ఆశ.
     
తెలుగు వారిపై ఆంగ్ల భాషా ప్రభావాన్ని ఎలా చూడాలి?
భాషల్లో ఎక్కువ తక్కువలుండవు. తమిళం మాట్లాడేవారికి అదే గొప్ప. తెలుగు మాట్లాడతాం కనుక మనకిది గొప్ప. కానీ తెలుగువాళ్ళు తెలుగుని నిర్లక్ష్యం చేసి ఆంగ్లంలో మాట్లాడటం సరికాదు. అభిప్రాయాల కారణంగా పొరపాట్లు జరుగుతాయి. విజ్ఞానంతో విమర్శనాత్మకంగా మన జీవితాల్ని తరచి చూసుకోవాలి. అది అందరికీ అర్థం అయ్యేట్లు చేయాలి. మంచి ఆలోచన, మంచి పద్ధతి ఎవరినుంచి గ్రహించినా అది కలకాలం ఉంటుంది. కానీ మన భాషని నిర్లక్ష్యం చేసి, పరభాషని ప్రేమించడం కాదు. 

స్త్రీల సమస్యల్నెలా చూడాలి?
స్త్రీల జీవితాలను గురించి మాట్లాడేటప్పుడు మహిళా ఉద్యమకారులు, ఓల్గా లాంటి వారు ఒకప్పుడు తమ రచనల్లోనూ, నిజజీవితంలోనూ పురుష ద్వేషాన్ని ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు వారిలో మార్పొచ్చింది. పురుషుల్ని కాకుండా సామాజిక పరిస్థితుల్ని ద్వేషిస్తున్నారు. ఇది మంచిదే. ఎంతో మంది వారి అభిప్రాయాలను అంగీకరించడానికి కూడా అదే కారణం.

ఆగితే స్త్రీల చరిత్రే లేదు
జ్ఞానపీపురస్కార గ్రహీత ప్రతిభా రాయ్‌ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌కి విచ్చేసిన  ప్రతిభారాయ్‌ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. తన రచన ‘ఉల్లఘ్న’కు 1985లో ఒడిశా సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. ఆమె రాసిన ‘యజ్ఞసేని’కి సరళ అవార్డు, అమృతకీర్తి పురస్కార్‌లాంటి ఎన్నో ఆమె ఖాతాలో చేరాయి. ఏడు పదుల వయసు దాటిన ప్రతిభారాయ్‌ ఇప్పటికీ ఉత్సాహంగా రాస్తున్నారు. ‘నాకీ శక్తి ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా?’ అంటూ ఆమే ప్రశ్నించి, తన చుట్టూ ఉన్న జనఘోషే తన రచనాశక్తికి కారణమంటూ ‘సాక్షి’తో ముచ్చటించారు.

∙మీ రచనకు ప్రేరణ ఏమిటి?
అమ్మ. ప్రకృతి. ఇవి రెండూ నాలోని రచనాశక్తికి ప్రాణం పోశాయి. తొమ్మిదేళ్ళకే రాయడం మొదలుపెట్టాను. కానీ అవి అందమైన ఇంద్రధనుస్సులో, అమ్మ మీదో, ప్రకృతిని గురించో. అయితే స్త్రీలకు ఇల్లు, భర్త, పిల్లలే పరామవధి. ఇప్పటికీ. రాత వాళ్ళ ప్రాధాన్యత కాకుండా చేశారు. 

మీ రచనలన్నింటికీ నేపథ్యం అసమానతలే. ఆ సామాజిక చైతన్యానికి స్ఫూర్తి?
నా జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన విషయం మత వివక్ష. మేం నివసించే పరిసరాల్లో మా యింటి చుట్టూ ఉన్న ముస్లింల జీవితాలను నిత్యం వెంటాడే అభద్రతాభావం నా రచనలకు స్ఫూర్తి. ఎక్కడో ఏదో విస్ఫోటనం జరిగితే అక్కడ హిందూ, ముస్లింలిరువురూ ఉంటే కేవలం ముస్లిం యువకుడొక్కడే ఎందుకు జైలుకెళ్ళాల్సి వస్తోంది అన్నది నా ప్రశ్న. దానిపైనే ‘పవిత్ర రాత్రి’ రాశాను. టెర్రరిస్టులనే ముద్రకాదు, సమస్యకు పరిష్కారాలు కావాలి. 

ఆశించినంతగా స్త్రీల రచనలు రాకపోవడానికి కారణం? 
ఒకప్పుడు ప్రాచీన స్త్రీల రచనలన్నీ వారి జీవితం ముగిసిన తరువాత ఏ తలదిండుకిందనో, బీరువాలోని చీరల మడతల్లోనో, ఏ వంటింటి మరుగుల్లోనో రాతప్రతులుగా దొరికేవి. జీవితంలో తమకోసం ఒక్క క్షణాన్నీ వెచ్చించలేని పరిస్థితి స్త్రీకి కల్పించారు. అయినా వారి అభిప్రాయాల్ని ఎక్కడోచోట భద్రపరిచారు రహస్యంగా. స్త్రీలు రాయడమే నేరమనే భావనలోంచి ‘వు డేర్‌ టు రైట్‌’ అనేదాకా వచ్చాం. మేం రాసే సాహసం చేశాం. ఆనాడు రాసే ఆడవాళ్లని చెడ్డవాళ్లని ముద్రవేసారు. ఇప్పుడు ఇంకేదో ముద్ర వేస్తున్నారు. అయినా మనం ఆగకూడదు. ఆగితే స్త్రీల చరిత్రే లేదు. 

భాష, లేదా సాహిత్యం ఎలా కాపాడుకోగలం?
చదువొక్కటే ఈ రెంటినీ బతికించలేవు. జనజీవితాలే సాహిత్యంగా రావాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చుట్టూ వున్న సమాజం మన పిల్లల ఎదుగుదలపై ప్రభావాన్ని చూపే అంశాలు. వారే సమాజాన్ని ప్రభావితం చేయగలరు. మార్పుకి నాంది పలకగలరు. 

తెలుగు మహాసభలపై మీ స్పందన? 
మాలాంటి ఇతర భాషీయులను కూడా పిలిచారు కాబట్టి, ఇవి తెలుగు సభల్లా కాదు ప్రపంచ భాషా సభల్లా అనిపిస్తున్నాయి. ఇది హర్షించాల్సిన విషయం. మాలాంటి ఎందరినో ఈ సభలకు ఆహ్వానించి సన్మానించడం సంతోషం.

‘‘నేను వర్గరహిత, కులరహిత, వర్ణవివక్షలేని సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాను. అవే రాశాను. అదే ఆచరించాను కూడా. లింగ వివక్ష మీద రాసినందుకు ఫెమినిస్ట్‌నన్న ముద్రవేశారు. కుల, వర్గ వివక్షపైన రాస్తున్నానని నన్ను కమ్యూనిస్టునన్నారు. కానీ నేను హ్యూమనిస్టుని. అసమానతలు లేకుండా, వివక్షకి బలికాకుండా సమానంగా జీవించే సమాజాన్ని చూడాలన్నదే నా జీవితాశయం’’ అంటున్నారు ఒడిశా రచయిత్రి, జ్ఞానపీuŠ‡ పురస్కార గ్రహీత ప్రతిభారాయ్‌. 

సంభాషణ: అత్తలూరి అరుణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement