తెలుగు భాషా సౌరభం గుబాళించింది.. అమ్మ భాష గొప్పదనం కళ్ల ముందు కదలాడింది.. తేనెలూరే తెలుగు భాషకు పట్టం కట్టాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సంబురం మొదలైంది. అలనాటి సాహితీ దిగ్గజాలు స్వర్గం నుంచి చూస్తే.. ఈ నేలపై వాలి మరోసారి తమదైన శైలిలో సాహితీ సేద్యాన్ని జరిపించాలని ఆశపడేవారేమో.. అన్నట్లుగా సాగింది. నింగిని తాకిన తెలుగుభాష గొప్పదనాన్ని చాటిన ఈ ఉత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావులు విశిష్ట అతిథులుగా పాల్గొనగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు.
అంగరంగ వైభవంగా..
సరిగ్గా 6.06 నిమిషాలకు సీఎం కేసీఆర్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పూర్ణకుంభ స్వాగతంతో ప్రాంగణంలోకి తోడ్కొని వచ్చారు. అనంతరం నృత్య కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యహేళతో సభలు సంప్రదాయ, సాహితీ సుగంధాన్ని అద్దుకున్నాయి. 6.25కు వేద మంత్రాల మధ్య ముఖ్య అతిథులు వేదికను అలంకరించారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలనం చేసి మహాసభలను ప్రారంభించారు. నిత్య సంతోషిణి, లావణ్యలు ఆలపించిన ‘యా కుందేందు..’ప్రార్థనతో సభ మొదలైంది.
సభల సైడ్‌లైట్స్..
- తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు ఇవే. 1975లో తొలి సభలు నిర్వహించిన లాల్‌బహదూర్ క్రీడా మైదానమే ఈ సభలకూ వేదిౖకైంది.
- మైదానానికి పాల్కురికి సోమన ప్రాంగణంగా పేరు పెట్టగా.. వేదికకు బమ్మెర పోతన వేదికగా నామకరణం చేశారు.
- వేదిక వద్ద ఎత్తయిన కాకతీయ తోరణం ప్రతిరూపం, దానిపై వాలిన రాష్ట్రపక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక... ఓవైపు పూల పండగ బతుకమ్మ నిలువెత్తు రూపం.. మరోవైపు బతుకమ్మను ధరించిన తెలంగాణ తల్లి విగ్రహం ఆకట్టుకున్నాయి.
- ప్రత్యేక వేదికలపై 8 వేల మంది ఆసీనులుకాగా.. మరో 30 వేల మంది ప్రాంగణంలో చుట్టూ ఆసీనులయ్యారు.
- తెలుగు మహాసభలపై అయాచిత నటేశ్వరశర్మ పద్య కవిత్వాన్ని, ఆచార్య ఎన్ గోపి మహాసంకల్పం పేరుతో వచన కవిత్వాన్ని వినిపించారు.
- దాదాపు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ సంస్థ విజ్‌క్రాఫ్ట్ ఆధ్వర్యంలో సాగిన బాణసంచా వెలుగు జిలుగులు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి.
- విదేశాల నుంచి వచ్చిన కొందరు తెలుగువారు పంచెకట్టులో ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment