సాక్షి, హైదరాబాద్ : ‘‘జీవన గమనానికి మాతృభాషే ఆయువుపట్టు. మాతృభూమిని, మాతృభాషను మరిచినవాడు మనిషే కాదు. తెలంగాణ, రాయలసీమ నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర దాకా విన్పించే విభిన్న యాసలన్నీ భాషామతల్లి కంఠంలో మణిహారాలే’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ఆరంభ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 42 ఏళ్ల క్రితం 1975లో ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం జలగం వెంగళరావు ఆధ్వర్యంలో తెలంగాణలో, అంజయ్య హయాంలో మలేసియాలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయని గుర్తు చేసుకున్నారు.
మళ్లీ ఇవాళ తెలంగాణ గడ్డపై మరోసారి ప్రపంచ తెలుగు మహాసభలు కేసీఆర్ ఆధ్వర్యంలో అంతకన్నా పెద్ద స్థాయిలో జరుగుతుండటం తెలుగు వారందరినీ ఎంతగానో ఆనందింపజేస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. ‘‘నా తల్లి నా చిన్నప్పుడే మరణించింది. తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలే నాకు తల్లి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మన పద్యం, గద్యం ఒకప్పుడు జగద్విదితం. వాటిని మళ్లీ దశదిశలా వ్యాపింపజేయాలి. భిన్న భాషల హారమైన భారత్‌లో తెలుగు ప్రత్యేకతను నిలబెట్టుకుందాం’’ అంటూ పిలుపునిచ్చారు. ‘‘ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో పని చేయడానికి వచ్చే ఏ అధికారైనా తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి చేయాలి’’ అని సూచించారు. చదువును, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేయాలన్నారు. ఆ దిశగా కేసీఆర్, చంద్రబాబు మరింత చొరవ తీసుకుంటారని ఆశాభావం వెలిబుచ్చారు.
హాలుడు మొదలు సినారె దాకా...
తెలుగు భాష చరిత్ర ఎంతో ప్రాచీనమని వెంకయ్య గుర్తు చేశారు. ‘‘క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దం నాటి హాలుడి గాథాసప్తశతి, గుణాఢ్యుడి బృహత్కథల్లోనూ తెలుగు పదాలున్నాయి. ఆంధ్రుల ప్రస్తావన భారతంలోనూ, బౌద్ధుల కాలంలోనూ ఉంది’’ అన్నారు. కవిత్రయం మొదలుకుని సినారె దాకా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన కవులు, సాహితీకారులకు నివాళులర్పించారు. ‘‘బడిపలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలన్న కాళోజీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తా. హైదరాబాద్ సంస్థానంలో తెలుగు అత్యంత నిరాదరణకు గురైంది. అమ్మభాష కోసం తెలంగాణలో నాటి తరం భారీ ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ తెలుగును తెలంగాణ ప్రజలు కాపాడుకున్నారు’’ అంటూ ప్రస్తుతించారు.
సాహితీ సేద్యంలో మేటి తెలంగాణ...
తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తి దూస్తుందన్న దాశరథి మాటలు అక్షరసత్యమని వెంకయ్య అన్నారు. ‘‘ప్రశ్నించే, ప్రతిఘటించే సాహిత్యం ఇక్కడ ప్రాణం పోసుకుంది. సాహితీ, పత్రికా రంగాల్లో తెలంగాణ తేజాల సేవలు నిరుపమానం. స్త్రీ విద్య గురించి 1914లోనే తెలంగాణలో స్త్రీలు తామే స్వయంగా రాసి ప్రచురించుకునేవారని తెలిసి ఒళ్లు పులకరించింది. వీధి భాగవతం, చిందు భాగవతం, గంగిరెద్దులాట, ఒగ్గు కథ, పిచ్చుకుంట్ల, కోలాటాలు, బుడగ జంగాలు, శారద కాండ్రు, బహురూపులవారు, పిట్టల దొర, బుర్రకథ వంటి తెలంగాణ కళలు వాటికవే సాటి. ఇక్కడి బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారమ్మ జాతర, పీర్ల పండగ ప్రాంతీయ విశిష్టతను చాటిచెబు తాయి’’ అంటూ ప్రస్తుతించారు. జ్ఞానపీఠ గ్రహీత దివంగత సి.నారాయణరెడ్డి తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. తెలుగు పరిరక్షణకు ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. ఇంటర్‌నెట్‌లోనూ విరివిగా తెలుగును వాడాలన్నారు. భాష, యాస పదాలతో సమగ్ర నిఘంటువులను రూపందించుకోవాలన్నారు. తెలుగు మహాసభలను అపూర్వంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ తదితరులకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment