ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సాక్షి, హైదరాబాద్ : 'తెలుగువారంతా ఒకటేనని నేను నమ్ముతాను. ఢిల్లీలో ఎవరైనా తెలుగు మాటలు మాట్లాడటం నేను వింటే వెంటనే వెనుదిరిగి మాట్లాడేవాడిని. తెలుగు వారిని మా ఇంటికి పిలిపించుకుంటాను. తెలుగు సమ్మేళనాలకు వెళతాను. తెలంగాణ గడ్డపై ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం చాలా ఆనందంగా ఉంది' ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడారు. తెలుగు ప్రాంతంలోని కవులందరిని ఆయన స్మరించుకున్నారు. తెలుగు భాషలోని గొప్పగొప్ప మాటలను, పద్యాలను, వచనాలను ఆయన గుర్తు చేశారు. ఇంకా తెలుగు అంటే తనకు ఎంత ఇష్టమో వివరించారు.
'నేను పెరిగిన తెలంగాణలో నేను పుట్టిన ఏపీలో అడుగు పెట్టకుంటే నాకు ఎంతో వెళితిగా ఉంటుంది. 40 ఏళ్లు ఇక్కడే (హైదరాబాద్)లో పెరిగాను.. ఏపీలో పుట్టి 25 ఏళ్లు అక్కడే చదివాను. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. అందుకే తెలుగును తెలుగు నేలను తల్లిగా భావిస్తాను. తెలుగులో తెలివి తేటలు చూపించే వారంటే నాకు చాలా ఇష్టం. మీరంతా భోజనం ఆలస్యం అయిందని బాధపడొద్దు.. కేసీఆర్ గారు చక్కటి విషయాలతో మంచి విందు పెట్టారు(వేదికపై అందరి నవ్వులు). గురువుకు సన్మానం చేసిన కేసీఆర్‌ను నేను అభినందిస్తున్నాను. ఈ ఒరవడిని ప్రతి ఒక్కరు కొనసాగించాలి. తరగతి గది గొప్ప తరగని నిధి.. మన గురువును మరువొద్దు. ఎంతటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా తెలుగు మరువొద్దు. గూగుల్ కూడా గురువుకు ప్రత్యామ్నాయం కాదు. దానికి కూడా గురువు కావాలి. హైదరాబాద్‌లో జలగం వెంగళరావు ఆధ్వర్యంలో 1975లో తెలుగు మహాసభలు జరిగాయి. నేడు మళ్లీ హైదరాబాద్‌లో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్‌కు కూడా నాకంటే ఎక్కువ తెలుగంటే మక్కువ. నగరమంతటా కవుల పేరిట స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం అభినందనీయం.
తెలుగు భాష చాలా ప్రాచీనమైనది. క్రీశ2వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యం లభిస్తోంది. భాష సమాజాన్ని సృష్టిస్తుంది. భాష కీలకమైన ఇరుసు. సహజ ప్రవాహం, మానవ సంబంధాలను అభివృద్ధి పరుస్తుంది. మనిషి నుంచి ప్రాణం తీయడం ఎలా కష్టమో సమాజం నుంచి భాష తీయడం అంతే కష్టంగా ఉంటుంది. సమాజం ఎంత ఆధునికమైనా, ఎంత ఎత్తుకు ఎదిగినా భాష మర్చిపోతే కష్టం. తెలుగు నేలపై అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా.. అంటూ కాళోజీ నారాయణ రావుగారు చాలా గొప్పగా చెప్పారు. భాషను విడవొద్దు అలాగే యాసను కూడా మరువ కూడదు. భాష ఉనికిని, యాస ప్రాణాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో ఎందరో కవులు ఉన్నారు. నాడు తెలంగాణలో ఉర్దూ రాజ్యమేలింది. తెలుగువారు 50శాతంపైనే ఉన్నా తెలుగును అణగదొక్కారు. కాలక్రమంలో తెలుగు ఉర్దూ కలిసి అద్భుత సాహిత్యంతో విరాజిల్లుతూ వస్తోంది. అప్పట్లో తెలుగు తీవ్ర నిరాధారణకు గురైందనేది వాస్తవం.
పీవీ నరసింహరావు గొప్ప భాషా కోవిధుడు. రచనలు చేశారు. తెలుగు సాహిత్యానికి నిజమైన రారాజు సినారె. ఆయనతో సాన్నిహిత్యం చాలా అద్భుతం. వేళ్లకు చెదలు పడితే మహావృక్షం పడిపోతుంది. అలాగే తెలుగు కూడా. అందుకే తెలుగును కాపాడుకోవాలి. మనసులో ఉన్న మాట చెబుతున్నాను. మన తర్వాత తెలుగు ఉంటుందా అని బాధపడుతున్నాను. ఇంగ్లీషు వాళ్లు మాతృభాషను మృతభాషగా మార్చొద్దు. మాతృభాషలో బోధన జరిగితే మాతృభాషలో పాలన జరిగితేనే సంస్కృతి బతుకుతుంది. ఒక జాతి ఉనికికి భాష ప్రధానం. అమ్మ భాషలో మాట్లాడితే అమ్మ దగ్గరకు వెళుతున్నట్లుంది. పరిపాలన పరంగా తెలుగు భాషలోనే చేయాలి. గవర్నర్‌గా ఉండి కూడా ఆయన తెలుగులో మాట్లాడారు. తెలుగు నేర్చుకోండి అని చెప్పాలి. ఉద్యోగులకు నేర్పించాలి. ప్రభుత్వం ఈ చర్యను తీసుకోకపోతే తెలుగును రక్షించే ప్రయత్నం విఫలం అవుతోంది. పల్లెటూరులో పుట్టాను, వీధి బడులకు పోయాను. నేలపై రాశాను. మూడు కిలో మీటర్లు నడిచాను. పై నున్న రెండు పదవులు తప్ప అన్ని పదవులు నాకు దక్కాయి. ఆంగ్లంలో చదివితేనే నాకు ఇవన్నీ వచ్చాయా? ఇంట్లో వీధి బడిలో గుడిలో ఎక్కడ వీలైతే అక్కడ తెలుగు మాట్లాడండి.
ఢిల్లీకి ఎన్నో దేశాల నుంచి అధ్యక్షులు వచ్చేవారు. వారంతా వారి భాషలోనే మాట్లాడుతున్నారు. వారికి ఒక దుబాసి ఉంటారు. వారికి కూడా మాతృభాషపై మమకారం ఉంటే ఒక్క తెలుగు వారికి మాత్రమే ఈ జబ్బు వచ్చింది. సరిగా వచ్చి రాని ఆంగ్లంలో మాట్లాడే జబ్బును ఆంగ్లేయులు అంటించి వెళ్లారు. అది గుర్తించి ఆ ప్రమాదం నుంచి బయటపడాలి. తెలుగు భాషలో కార్యక్రమాలు జరిగితే అస్తిత్వం బతుకుతుంది. బావ మరదలు అంటేనే సంతోషం. అంతేగానీ బ్రదర్ ఇన్‌లా సిస్టర్ ఇన్‌లా అంటే ఏం బావుంటుంది. అమ్మ భాష కళ్లలాంటివి.. పరాయి భాష కళ్లద్దాల్లాంటివి.. అమ్మభాషలేకుంటే కళ్లద్దాలు కూడా పనికి రావు. తన భాష తనకు తెలుసు ప్రజల భాష తెలుసు కాబట్టే కేసీఆర్ పరిపాలకుడయ్యారు. ఆంగ్లం చదివితేనే పై స్థాయికి వెళతారనుకోవడం తప్పు. ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారికి తెలుగు స్కూళ్లు పెట్టించే ప్రయత్నం చేయిస్తున్నాం. మాతృభాషను మర్చిపోతే అస్తిత్వానికి ప్రమాదం.. ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు కలిసి పనిచేయాలి. ఆంగ్లం వారు అంటించిన అంటు వ్యాధిని ఇంటి దాక రానివ్వకండి. తెలుగులో మహా నిఘంటువు రావాలి' అంటూ ఆయన పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment