పదవికి వన్నె తెచ్చేలా పని చేస్తా
► అర్థవంతమైన చర్చ జరిగేలా రాజ్యసభను నడిపిస్తా
► ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించగానే ఉద్వేగానికి గురయ్యా
► పార్టీ కార్యక్రమాలకు దూరమవుతుంటే బాధగా ఉంది
► విలేకరులతో ఇష్టాగోష్టిలో వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడు అన్నారు. తాను ముక్కు సూటి మనిషినని, ఉప రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చేలా పని చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యలపై సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా నడిపిస్తా నని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, హిదాయతుల్లా, జాకీర్ హుస్సేన్ వంటి వారు సభను నడిపిన తీరును అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఇదే తన చివరి పాత్రికేయ సమావేశమని చెప్పారు. 20 ఏళ్లుగా ఎంపీగా పని చేసిన వ్యక్తి ఉపరాష్ట్రపతి కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటే బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ఇకపై రాజకీయాలు మాట్లాడనని, ప్రజా జీవితంలో దేశానికి అవసర మైన విషయాలపైనే మాట్లాడతానని, దేశాభి వృద్ధే ఎజెండాగా ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశంలోని 623 జిల్లాల్లో పర్యటించి నట్లు ఆయన చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కనీసం 20 సార్లు పర్యటించానని, రాజకీయ నేతలు ప్రజల్లో ఉంటేనే రాణిస్తారని పేర్కొన్నారు. 1972 జై ఆంధ్ర ఉద్యమం కోసం పోరాటం చేశానని, తనకు మీడియా అత్యంత ప్రాధాన్యం కల్పించిందని తెలిపారు. 1991 నుంచి బీజేపీ జాతీయ ఆఫీసులో పని చేసిన అందరినీ సన్మానించినట్లు చెప్పారు. పని, మీటింగులు అంటే చాలా సరదా అని, నాయ కుడు అనే వాడు ఎంత తిరిగితే అంత పేరు వస్తుందని పేర్కొన్నారు. ‘బీజేపీ ఆఫీసుకు దూరం అవుతున్నా. ఎవరు రాజకీయ విమర్శలు చేసినా ప్రతివిమర్శలు చేసే వరకు నాకు నిద్ర పట్టదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన అరగంటకే పార్టీకి రాజీనామా చేశా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత రాజ్యసభకు రాజీనామా చేయమని అమిత్ షా చెప్పారు. లేకపోతే రాజ్యసభకు అప్పుడే రాజీనామా చేసేవాడిని..’ అని వివరించారు. తన కుటుంబ సభ్యులకు రాజకీయం తెలియదని, అందుకే వారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించ లేదని తెలిపారు. వారసత్వ రాజకీయాలు మంచివి కావని, జవసత్వంతో రాజకీయాల్లోకి రావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ ఎల్పీనేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.