సాహిత్య వేదికలపై ఫత్వాలు సరికాదు | Srisailam Reddy Panjugula Article On Telangana Sahitya Akademi | Sakshi
Sakshi News home page

సాహిత్య వేదికలపై ఫత్వాలు సరికాదు

Published Thu, Jul 11 2019 1:11 AM | Last Updated on Thu, Jul 11 2019 1:12 AM

Srisailam Reddy Panjugula Article On Telangana Sahitya Akademi - Sakshi

తెలంగాణలో ఇక తెరవే (తెలంగాణ రచయితల వేదిక) అవసరం లేదనీ, వారు ఇక్కడితో ఆగితేనే గౌరవమనీ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి రెండురోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కేవలం తెలంగాణ రచయితల వేదికని ఉద్దేశించి మాత్రమే అన్నట్లుగా భావించలేము. ‘ప్రశ్నించడమే కవిత్వం ప్రధాన తత్త్వం. నిలదీయలేనిది అసలు కవిత్వమే కాదు’ అని అదే సభలో ఉన్న సీనియర్‌ పాత్రికేయులు కూడా అన్నారు. అదిగో – అలాంటి ప్రశ్ననే ఇప్పుడు పూర్తిగా చంపేయాలనుకుంటున్నారు నందిని సిధారెడ్డి.

ఆయనకు తెలియనిదీ, ఇంక తననుంచి ఏమాత్రమూ తెలుసుకోగోరనిదీ ఏమంటే – తెలంగాణ సమాజం ఊరుకోదు. ప్రశ్నించి తీరుతది. నిలదీసి నిలుస్తది. బరిగీసి కొట్లాడుతది. అక్షరం ఎల్లప్పుడూ ప్రజల పక్షమే నిలుస్తది అని మాత్రమే. అక్షరం, సాహిత్యం పోషించే ఇలాంటి పాత్రపై సరిగ్గా ఇదే భయం నందిని సిధారెడ్డిని ఇవాళ ఆవరించింది. ప్రశ్నలెక్కువైతే ఏలికకు ఇబ్బంది అని. ప్రభువులను ప్రజలు ప్రశ్నించే పరి స్థితి పట్ల ఆందోళన ఆయనది. ఆనాడు సిధారెడ్డి ఒక నదీప్రవాహం అయితే– నేడాయన పాలకుల రీడిజైన్‌లో గతి తప్పిన శుష్క ప్రేలాపం, పాలక స్తుతిలో తెలంగాణలో కవులను, రచయితలను సాహితీ నిర్వాసితులను చేసే ముంపు ఉపద్రవం! అందుకే అంటున్నాం – 

ప్రవహించు మంజీరా! 
కలాల్ని భయపెట్టొద్దు మంజీరా!!  
ఏలికల కాళ్ళ మణి మంజీరం కావొద్దు మంజీరా!!!

తెలంగాణలోని కొంతమంది మేధావులు, కవులు, రచయితలు, జర్నలిస్టులు ప్రభువుల సింహాసనపు సాలభంజికలుగా మారిపోవడంతో అందరూ అదే తొవ్వ తొక్కాలని అంటున్నడు సిధారెడ్డి. ఆ సాలభంజికలకంటే రెండాకులు ఎక్కువ చదివిన భజనభంజిక నందిని గారికి, ఆయన పోషకులకూ కొత్తగా చెప్పాలని మేమయితే అనుకోవడం లేదు. కానీ, నిత్య చైతన్య దీప్తి అయిన తెలం గాణ ఏమాత్రం మసకబారినా భవిష్యత్తు నాశనమైతదని చెప్పడమే ఈ ప్రయత్నం. ప్రత్యేకించి తెలం గాణ ప్రగతిశీల శక్తులకు ఈ సవినయ విన్నపం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరని ప్రస్తుత సందర్భంలో, ముఖ్యంగా రెండవసారి ఎన్నిక అయిన ప్రభుత్వాలు (అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో) ప్రజలు తమకు గంపగుత్త మెజారిటీ యిచ్చిన్రు కాబట్టి (ఇందులోని వాస్తవావాస్తవాలు, న్యాయాన్యాయాలూ వేరే చర్చ) తాము ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారు. ఉద్యమ ఆకాంక్షలను సులువుగా తొక్కేస్తామని, తెలంగాణ ఆత్మకు ఉనికి అన్నదే లేకుండా చేస్తామని భావిస్తున్న పాలకులనూ, వారి ఈ భావనను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్న బానిస కలాలనూ తెలంగాణ మేధోవర్గం నిరసించాలి. ఖండించాలి. అందుకే ఈ విన్నపం. 

మరొక విషయం. భారత్‌ను మతరాజ్యంగా మార్చే సంకల్పంతో జాతీయ స్థాయిలో కమ్ముకొస్తున్న ప్రస్తుత తరుణంలో, ఆ ఫాసిజం రేపు నందిని సిధారెడ్డి వంటి పోషకులనూ కమ్మేస్తుంది. కానీ, రచయితలుగా ఒక మాట ఇస్తున్నాం. రేపు మేము వాటినీ ఖండిస్తాం. ఆ ప్రజాస్వామ్య స్పృహ, హక్కుల స్పూర్తి మాకున్నది. ఫ్యూడల్, క్యాపిటల్, ఫాసిస్ట్‌ శక్తులను ఎదిరిస్తూనే, ఎవరు ఎక్కువ ప్రమాదకారి అన్న చర్చ వచ్చినపుడు తప్పకుండా బలమైన శత్రువుపై దాడి చేయాల్సిందే. ప్రశ్నలు రావాల్సిందే.

వాటికి సాహిత్యకారులు తమ గళమూ కలమూ మద్దతు ఇవ్వాల్సిందే. తెలం గాణ ఉద్యమవీణకు తంత్రియై మూర్చనలు పోయిన కవులూ రచయితలూ కళాకారులూ మేధావులూ... రేపు కూడా ఉండేది తెలంగాణ ప్రజల పక్షమే. నేడూ రేపూ వారిది ఉద్యమ ఆకాంక్షల సాధనామార్గమే. సాహిత్య సంస్థలను రద్దుచేయాలనే ఫత్వాలు జారీ చేసి దేశంలో తెలంగాణ రాష్ట్ర గౌరవం మంటకలపొద్దు. ప్రతిపక్షాలను ఏరేసే తీరుగా కవులను, కళాకారులను కొనివేయలేరు. సన్మానాలు,  శాలువాల కోసం కిమ్మనకుండే రచయితలారా మీరు గళం విప్పకపోతే రేపు ప్రజలు మిమ్మల్ని క్షమించరు.రచయితల కర్తవ్యాలను, లక్ష్యాలను చెప్పుకుంటూనే, సిధారెడ్డి లాంటి కలుపుమొక్కల కారణంగా, మరోసారి మనమెరిగిన ఓ పాతప్రశ్న వేయాల్సి వస్తున్నది... 
కవీ, ఓ కళాకారుడా/కవయిత్రీ, ఓ కళాకారిణీ
నీవెటువైపు?!/రాజ్యంవైపా?/
జనం ఆకాంక్షల దిక్కా?
(జూలై 14, 2019 ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో కలాల స్వేచ్ఛ కోసం, 27 ప్రజాసంఘాలతో జరగనున్న సభ సందర్భంగా)

వ్యాసకర్త రాష్ట్రకమిటీ సభ్యుడు, తెలంగాణ జన సమితి ‘ మొబైల్‌ : 90309 97371
శ్రీశైల్‌ రెడ్డి పంజుగుల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement