బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇది దేశంలోని బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. బిహార్ నమునాగా ఇతర రాష్ట్రాలు కూడా కులగణన చేసి శాస్త్రీయంగా బీసీల జీవన స్థితిగతుల లెక్కలు తీసుకుని విద్యా–ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంపుదల చేసుకోవచ్చని ఆశగా ఎదురు చూసిన వారు విస్మయానికి గురైనారు. దీంతో రాజ్యాంగ సవరణ చేయకుండా ఓబీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుదల జరుగదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం 69 శాతానికి పెంచిన మొత్తం రిజర్వేషన్ శాతం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం గమనార్హం. శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. పార్టీలకు అతీతంగా సీఎం జయలలిత ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి అప్పటి పీవీ నరసింçహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... తమ శాసన సభ చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా చేశారు. దీంతో తమిళనాడులో అమలు జరుగుతున్న 69 శాతం రిజర్వేషన్లపై ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేసే అవకాశం లేకుండాపోయింది.
బిహార్ రాష్ట్రం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ తరహాలో బీసీలకు అధిక రిజర్వేషన్లు అందేలా చూడాలి. బిహార్‌తో పాటుగా అన్ని రాష్ట్రాలూ ఇదే దారిలో ప్రయాణించవలసి ఉంది. ఇది జాతీయ ఉద్యమంగా రూపుదాల్చవలసి ఉన్నది. ఏ రాష్ట్రంలోనైనా బీసీల రిజర్వేషన్లు పెంచాలనే తలంపుతో ఏ విధాన నిర్ణయం తీసుకున్నప్పటికీ 1992లో ‘ఇందిరా సహానీ’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాద’నే తీర్పును అడ్డుపెట్టుకుని ఆధిపత్య వర్గాలు కోర్టులకు వెళ్ళి అడ్డుపడుతున్నాయి. బిహార్‌లో మాదిరిగా మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు మించి ఇచ్చాయని సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే విధిగా రాజ్యాంగసవరణ చేస్తే తప్ప బీసీలకు న్యాయం చేయడానికి వేరే మార్గం లేదని అర్థమవుతుంది.
బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 50 శాతానికి మించి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా అంగీకరించిందని బీసీలు ప్రశ్నిస్తున్నారు.
ఈ డబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జనాభా గణన చేయలేదు. వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయకుండా అగ్రవర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దేశజనాభాలో అగ్రవర్ణాలు ఎంతమంది? వారిలో పేదరికం ఎంత శాతం? ఈ లెక్కలు లేకుండా 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో కేంద్రమే చెప్పాలి. అయినా సుప్రీంకోర్టు ధర్మాసనం 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 85 శాతం మంది ఉంటే వీరిలో 56 శాతంగా ఉన్న బీసీలలో పేదలు ఎంతమందో ఎవరి దగ్గరా లెక్కలు లేవు. అందుకే ఓబీసీ రిజర్వేషన్లలో ఎలాంటి పరిమితి విధించకుండా అత్యవసరంగా రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్‌ను సవరించాలి. అపుడే బీసీలకు విద్యా– ఉద్యోగ రంగాలలో న్యాయం జరుగుతుంది.
పట్నా హైకోర్టు తీర్పు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇపుడు దేశంలోని ఓబీసీలంతా స్పష్టంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచనలతో తమిళనాడులో రామస్వామి పెరియార్ కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తితో ఓబీసీ ఉద్యమం కొనసాగించవలసి ఉంది. నితీష్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున తమిళనాడులాగా ఒక చట్టం చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చుకుని బిహారు రాష్ట్రం వరకు రిజర్వేషన్ల పెంపును అమలు జరుపుకునే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రత్వం బిహారుకు కలిసివచ్చే విధంగా ఉంది.
దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి బడుగులందరి తరఫున నిలిచి కేంద్రంపై బీసీ రిజర్వేషన్లు పెంచడానికై రాజ్యాంగ సవరణ చేయాలని ఒత్తిడి పెంచాలి. ఓబీసీల హక్కుల సాధన కోసం జాతీయోద్యమం రూపుదాల్చే సమయం ఆసన్నమయ్యింది.
దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పాటు పడిన బీఆర్ అంబేడ్కర్ తర్వాత అంతగా కృషి చేసినవారు తమిళనాడు సామాజిక, రాజకీయ రంగాల నాయకులనే చెప్పాలి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు విద్యా–ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదల కోసం తమిళనాడులో మహోద్యమాలు జరిగాయి. పెరియార్ రామస్వామి చేసిన కృషి మరువలేనిది. రిజర్వేషన్లను న్యాయస్థానం అడ్డుకోకుండా చేయడంలో పెరియార్ రామస్వామి జరిపిన పోరాటం మరిచిపోలేనిది. అంబేడ్కర్ రిజర్వేషన్ల రక్షణ కోసం చేసిన పోరాటానికి కొనసాగింపుగా తమిళనాడులో పెరియార్, ఉత్తర భారతంలో రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్‌లు చేసిన ఉద్యమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దేశవ్యాపితంగా ఓబీసీ రిజర్వేషన్ల కోసం జాతీయ ఉద్యమం రూపుదాల్చవలసి ఉంది. నేటి ఓబీసీ యువతరం, విద్యావంతులు ఈ ఉద్యమంలో కీలకంగా పాల్గొనాలి. బడుగు వర్గాల నుంచి వచ్చిన యువతరం బీసీలకు జరిగిన అన్యాయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. బీసీలను ఐకమత్యం చేసే పనిలో పాలుపంచుకోవాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాలలో బీసీలకు న్యాయం జరిగేదాకా ఉద్యమపథంలో ముందుకు సాగక తప్పదు. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం విధిగా చేయాలి.
– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment