నైపుణ్యాభివృద్ధి ఫలించేందుకు సవాళ్లెన్నో... | Dr T Sampath Kumar Comments On Skill Development Sakshi Guest Column News | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధి ఫలించేందుకు సవాళ్లెన్నో...

Published Tue, Jul 2 2024 9:00 AM | Last Updated on Tue, Jul 2 2024 9:00 AM

Dr T Sampath Kumar Comments On Skill Development Sakshi Guest Column News

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఒక విప్లవాత్మకమైన యోజనను ప్రకటించింది. రాష్ట్రంలోని ఐటీఐల (పారిశ్రామిక శిక్షణ సంస్థలు)ను క్రమేణా అధునాతన సాంకేతిక కేంద్రాలు (అడ్వాన్స్‌డ్‌ టెక్నికల్‌ సెంటర్స్‌ – ఏటీసీలు)గా రూపాంతరం చేస్తూ మార్కెట్‌ అవసరాలకి మానవవనరులని తయారుచేస్తామని వెల్లడించింది.

ఈ రంగంలో పనిచేసేవారికి ఇదొక తియ్యని వార్త. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. పారిశ్రామిక రంగానికి ఉన్నత స్థాయి ప్రమాణాలతో మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్న ఆశ ముఖ్యమంత్రి ప్రసంగం విన్నవారికి కలుగుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే సంవత్సరాల్లో బంగారు తెలంగాణ ఆవిష్కృతమౌతుంది!

సాంకేతిక రంగంలో నైపుణ్యాభివృద్ధి అనేది కొత్త అంశమేమీ కాదు. మన దేశంలో ఐటీఐలు, పాలిటెక్నిక్‌లూ దశాబ్దాల నుండి పనిచేశాయి, చేస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐలు, 255 ప్రైవేట్‌ ఐటీఐలు శిక్షణనిస్తున్నాయి. ప్రకటించిన యోజన ప్రకారంగా 65 ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలు మార్చుతూ వచ్చే పదేళ్ళలో వివిధ విషయాల్లో సాంకేతిక నైపుణ్యతను సాధించిన నాలుగు లక్షల నిపుణలను తయారు చేయాలన్నది లక్ష్యం.

ఈ లక్ష్యాల్ని నెరవేర్చడానికి రాష్ట ప్రభుత్వం ‘టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌’ సంస్థతో పదేళ్ల ఒప్పందం చేసుకొంది. వీరు స్వల్ప, దీర్ఘ కాలిక శిక్షణా కార్యక్రమాలతో ప్రతి ఏటా 30 వేలకు పైగా యువతను నిపుణులుగా తయారుచేసి పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి పొందేలా చేస్తారు. అలాగే విదేశాలకు వెళ్లి బతకడానికి సంసిద్ధుల్ని చేస్తారు.

శిక్షణను కేవలం పుస్తక, అనుభవ సిలబస్సులకే పరిమితం చేయకుండా దాని చుట్టూతా ఆవరించి ఉన్న జీవకళలను కూడా జోడించాలి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతీయ అవసరాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. జిల్లాలవారీగా ఈ అవసరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఆ యా ప్రాంతాల్లో ఉన్న ఏటీసీలు కోర్సుల్ని రూపొందించాలి. ఉదాహరణకు తెలంగాణలోని కొన్ని జిల్లాల నుండి గల్ఫ్‌ దేశాలకు పెద్ద సంఖ్యలో వలస వెళతారు.

ముఖ్యమంత్రి చెప్పినట్టుగా గల్ఫ్‌ దేశాల అవసరాలకు అనుకూలంగా నైపుణ్యాభివృద్ధి జోడైతే వలసదారులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. గల్ఫ్‌ దేశాలకు వెళ్ళేవారే కాకుండా, తిరిగివచ్చిన వారికి సైతం స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు తక్షణమే అందుబాటులో ఉండాలి. వీరు మాతృదేశానికి వచ్చి స్థిరపడి పోవాలనుకొంటారు. గల్ఫ్‌ దేశాల్లో చేసిన పని, అనుభవం తిరిగివచ్చినవారి ఊళ్లలో పనికిరాకపోతే వారిలో నిరుత్సాహం మొదలై మళ్ళీ వలసపోవాలనే ఆలోచనలతో  సతమతమౌతారు.

జెండర్‌ వివక్ష ఎక్కువ ఉన్న మన సమాజంలో సమతుల్యం తేవడానికి అమ్మాయిలు సంప్రదాయేతర కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలి. జనవరి 2001లో భుజ్‌ (గుజరాత్‌) లో భయంకర భూకంపం వచ్చాక పునరావాసానికి వేల సంఖ్యలో ఇళ్లను కట్టడానికి తీవ్రమైన మేస్త్రీల కొరత ఏర్పడింది. అహమ్మదాబాద్‌కు చెందిన సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ విమెన్స్‌ అసోసియేషన్‌ వారు గ్రామీణ మహిళలకు నిర్మాణరంగంలో శిక్షణనిచ్చి పునరావాస కార్యక్రమాలను వేగంగా అమలుపరచడంలో చేయూతనిచ్చారు. నిర్మాణ రంగంలో ఎప్పుడూ మానవవనరుల కొరత ఉంటుంది. మహిళలు కేవలం అల్పస్థాయి పనులకే పరిమితమౌతున్నారు. ఇప్పుడు ఐటీఐల ప్రక్షాళన మొదలవుతుంది కాబట్టి పెద్దయెత్తున ప్రయత్నాలు చేపట్టి మహిళలకు సాంకేతిక రంగంలో సముచిత స్థానం కల్పించాలి.

1980వ దశాబ్దంలో భారత ప్రభుత్వం ‘కౌన్సిల్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ టెక్నాలజీస్‌’(ïసీఏఆర్‌టీ– కార్ట్‌) అనే సంస్థని ఢిల్లీలో స్థాపించింది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సంస్థను 25 ఏళ్లుగా పనిచేస్తున్న మరో సంస్థ, ‘పీపుల్స్‌ ఆక్షన్‌ ఫర్‌ డెవలప్మెంట్‌ ఇండియా’ (పీఏడీఐ)తో విలీనం చేసింది. రెండు పేర్లలో ఉన్న మూలసూత్రాలను కలుపుకొని ‘కౌన్సిల్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ పీపుల్స్‌ ఆక్షన్‌ అండ్‌ రూరల్‌ టెక్నాలజీస్‌’– కపార్ట్‌ పేరుతో దేశమంతా ఎన్జీవోలకి ఆర్థిక సహాయన్నందిస్తూ చాలా సంవత్సరాలు పనిచేసింది (వ్యాస రచయిత ఈ సంస్థలో ఆరు సంవత్సరాలు పనిచేశారు).

ఈ రెండు సంస్థలూ గ్రామీణాభివృద్ధి విభాగం (వ్యవసాయ మంత్రిత్వ శాఖ) కింద పనిచేసేవి. అప్పుడు కపార్ట్‌ ఒక వినూత్న ప్రయోగాన్ని– ‘రీజినల్‌ రిసోర్స్‌ సెంటర్స్‌ ఫర్‌ రూరల్‌ టెక్నాలజీస్‌’ (ఆర్‌ఆర్‌సీఆర్‌టీ) ఆరంభించింది. కపార్ట్‌ స్వచ్ఛందసేవా సంస్థలకు ఆర్థిక సహాయంచేసే సంస్థ కాబట్టి ఉన్నతశ్రేణి ఎన్జీవోలకు  ఇది గొప్ప అవకాశంగా అందుబాటులోకి వచ్చింది. ఎన్నో పేరున్న సంస్థలు ఏళ్లనుండి గ్రామీణాభివృద్ధికి అంకితమై యువతకి ఉపాధికోసం శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్ని జరుపుకున్నాయి.

ఈ యోజన ద్వారా పలు సంస్థలకి పెద్ద మొత్తాల్లో 3–5 సంవత్సరాల ప్రాజెక్టులను ఇచ్చారు.  లబ్ధి పొందిన ఈ సంస్థలు తమ తమ ప్రాంతీయ అవసరాలను తెలుసుకొని మంచి శిక్షణా కార్యక్రమాలను రూపొందించి గ్రామ యువతకు శిక్షణ ఇచ్చాయి. మరింత బలపర్చడానికి గాను ఈ యోజన ఎంతో తోడ్పడి యువత భవిష్యత్తు నిర్మాణంలో గణనీయమైన పాత్ర వహించాయి. అయితే కాలక్రమేణా కపార్ట్‌ మూతపడింది. తెలంగాణ ప్రభుత్వం పైవిషయాలనూ దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సాగించాలి.

– డా. టి. సంపత్‌ కుమార్‌, వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు. ఢిల్లీలోని కెనడియన్‌ హై కమిషన్‌ మాజీ సీనియర్‌ సలహాదారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement