
వివిధ కారణాలతో ఒక దశాబ్దానికి పైగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది నియా మకాలు చేపట్టకపోవటం వలన ఆ యా విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోనే యూజీసీ మార్గదర్శ కాల మేరకు అర్హత కలిగిన వారిని కాంట్రాక్ట్, అకడమిక్ కన్సల్టెంట్, పార్ట్ టైం ప్రాతిపదికన బోధనా సిబ్బందిగా నియమించుకుంటున్నాయి. రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బడ్జెట్ ఆమోదం పొంది ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో దరిదాపు 900 మందికి పైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన, 600 మందికి పైగా పార్ట్ టైం ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయా లలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని వివిధ వర్గాల నుండి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయటానికి జీవో నెంబర్ 21 ద్వారా నియామకపు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో తాత్కాలిక అధ్యాపకులు ఆందోళన చెందుతూ ఉద్యమ బాట పట్టారు.
దాదాపు 15 ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాప కులు తక్కువ వేతనాలతో విశ్వవిద్యాలయాలలోని పని భారాన్ని మోస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు రోస్టర్ పాయింట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తూ అర్హతగల వారిని కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాప కులుగా ఎంపిక చేసి ఆ యా విశ్వవిద్యాలయాలు వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని మూడు విభాగాలలో... ముఖ్యంగా మొదటి విభాగంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంపిక కోసం వారి సామర్థ్యాన్ని పరిశీలించటానికి మార్గదర్శకాలు రూపొందించినట్లుగా కనపడుతుంది. కానీ విశ్వవిద్యాలయం లాంటి ఒక అత్యు న్నత విద్యాసంస్థ తరగతి గదిలో పాఠాలు బోధించటానికి అర్హత ప్రమాణాలు రూపొందించినట్లుగా కనిపించటం లేదు. అధ్యాపక నియామకాలకు కొత్తగా అర్హత ప్రమా ణాలు రూపొందించటాన్ని తప్పు పట్టలేము కానీ ఆ అర్హత ప్రమాణాలు యూజీసీ మార్గదర్శకాల మేరకు సమర్థంగా పాఠాలు బోధించే సామర్థ్యం కలవారిని, అనుభవం కలవారిని ఎంపిక చేసే విధంగా ఉండాలి. పీహెచ్‌డీలాంటి అత్యున్నత విద్యార్హతకు జాతీయ క్వాలిఫయింగ్ టెస్ట్ జేఆర్‌ఎఫ్‌కి సమానంగా మార్కులు కేటాయించటం ఏమిటి? అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామ కానికి ప్రధాన అర్హత పోస్టు గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ మార్కులకు వెయిటేజ్ ఇవ్వటం ఏమిటి? పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసెస్‌ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పాఠాలు బోధించటానికి అత్యంత సమర్థత కలవారిని ఎంపిక చేయటానికి జీవో నెం. 21 మార్గదర్శకాలలో మార్పులు చేయవలసిన అవసరం కూడా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయా లలో కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, నియామకాలలో ప్రాధాన్యం ఇవ్వకుండా నియామకాలు చేపట్టటం అంటే దశాబ్దాలుగా విశ్వవిద్యా లయాలలో శ్రమ దోపిడీకి గురవుతూ తక్కువ వేతనాలతో పని చేస్తున్న వారికి అన్యాయం చేసినట్లుగానే భావించాలి. ‘పనికి మాత్రమే పనికొస్తామా! అవకాశాల కోసం పనికిరామా! మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, మా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విశ్వవిద్యాల యాలలో నియామకాలకు సిద్ధపడటం ఎంతవరకు సమంజసం’ అనే ప్రశ్నలు అధ్యాపక వర్గాల నుండి వçస్తున్నాయి. 2022లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలలో; పాలి టెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 8,000 మందికి పైగా అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతి రేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భవి ష్యత్తులో విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల సేవలను క్రమబద్ధీకరించే అవ కాశాలు లేవు కాబట్టి తమకు టైం స్కేల్‌తో ఉద్యోగ భద్రత కల్పించి నియామకాలలో ప్రాధాన్యమిచ్చి, తదనంతర చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
డా. తిరుణహరి శేషు
వ్యాసకర్త రాష్ట్ర పార్ట్ టైం అధ్యాపకుల సంఘం సలహాదారు