ఖమ్మం మయూరిసెంటర్ : పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం బంగారు తెలంగాణ కాదని, కన్నీటి, కష్టాల, బాధల తెలంగాణగా మారిందని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ అన్నారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. మహిళలపై సామ్రాజ్యవాద విషసంస్కృతిని ప్రేరేపిస్తున్నారని, దేశంలో భ్రూణహత్యలు పెరిగిపోయాయని, వాటిని నిరోధించాల్సిన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు.
దేశంలో బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని, స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా మహిళలపై హింస, దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మహిళను ఆట వస్తువుగా చూపుతున్నారని, ప్రభుత్వాలు గృహహింస చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళలు, పురుషుల సమానత్వం కోసం పోరాడాలన్నారు.
అనంతరం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 4వేల మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి బలిదానంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజల బాధలను మర్చిపోయి హైదరాబాద్ బల్దియా ఎన్నికల కోసం ఆరాటపడుతున్నారని, నిజాం పాలననే పొగుడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ మాటే ఉండదని, అందరినీ పర్మినెంట్ చేస్తామని మాటలు చెప్పిన కేసీఆర్ వాటిని మరచి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 59 జీఓ అక్రమార్కులకు అండగా ఉందని, దీనిని వెంటనే రద్దు చేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కూలీలకు, రైతులకు రూ.వెయ్యి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు గాదె ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.రమ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు జి.సరోజని, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్‌లు మాట్లాడారు. అనంతరం కదలిరా.. ఓ మహిళా కదలిరా.. అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె.కల్పన, జిల్లా కార్యదర్శి సిహెచ్.శిరోమణి తదితరులు పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ కాదు.. కన్నీటి తెలంగాణ
Published Sun, Jan 4 2015 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM
Advertisement
Advertisement