
నాడు శ్రీరాముడు అయోధ్యను వీడి సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళినపుడు అయోధ్యాపురం కంటికిమింటికి రోధించిందట.. నేడు.. ఆ వనమాలి .. వనజీవి రామయ్య భూలోకాన్ని వీడి దివికేగిన తరుణంలో వనాలు విలపించావా.. తమను ఇన్నాళ్లూ సాదుకుని ఆదుకుని నిలబెట్టిన రామయ్య తానే కాలం ఒడిలో ఒదిగిపోతే మొక్కలు.. మానులు.. తీగలు లతలు అల్లాడిపోవా.. తలవంచి విలపించవా..
ఎక్కడెక్కడో.. ఏ రోడ్డుమీద ఏ లారీకింద పది నలిగిపోవాల్సిన గింజలను ఏరుకొచ్చి ఒడిలో వేసుకుని భద్రంగా తీసుకెళ్లి అడవిలో ఓ చిన్న గొయ్యి తీసి.. వాటిని నాటి.. పెరిగేవరకూ కంటికి రెప్పలా చూసుకునేవారు. అవి పెరిగిపెద్దవవుతుంటే తన బిడ్డలే ఎదుగుతున్న భావన. గాలికి ఒరిగిపోకుండా వాటికి తన చిటికెనవేలు మాదిరి ఓ కట్టెపుల్లను దాన్నుగా ఉంచి పెంచాడు. అవి పెద్దవై పూలు.. పళ్ళు.. కాయలు ఇస్తుంటే పసిపిల్లాడి లెక్క కేరింతలు కొట్టేవాడు. ఎక్కడైనా మొక్కలు చెట్లు చనిపోయేలా ఉంటే తన చేత్తో తీసుకెళ్లి నీళ్ళుపోసి వాటి ప్రాణం నిలబెట్టేవారు. ఒకటా రెండా.. దశాబ్దాలుగా లక్షలాది మొక్కలపాలిట దేవుడాయన .. దేవుడంటారో.. బిడ్డల్ని పెంచిన తండ్రి అంటారోగానీ వనజీవి రామయ్య కన్నుమూత సమాచారం వనానికి అందింది.. .. మొక్కలను చేరింది.. తీగలకు తెలిసింది ... మానులకు చెవినపడింది..
క్షణాల్లో వార్త అడవంతా వ్యాపించింది.. మొక్కలు చెట్లు తీగలు లతలు అంతా ఏకమై తమ ప్రాణాలను ఎవరో తీసుకుపోయారన్నంతగా రోదించాయి.. వేపమాను విలవిల్లాడింది
..రేపట్నుంచి తమ విత్తనాలు ఎవరు సేకరిస్తారు..ఎవరు
ఏరుకెళ్ళి వేరే ప్రాంతంలో తమ శాఖను జాతిని విస్తరిస్తారు అంటూ కుమిలిపోయింది. జామచెట్టు జవగారింది.. తన పెద్దవేరును ఎవరో
గొడ్డలితో నరికినంత పనైందని కుమిలిపోయింది. మల్లెతీగ మ్రాన్పడిపోయింది .. మందారం బాధతో ముడుచుకుపోయింది. చింత మాను చిన్నబోగా మద్ది చెట్టు మూలకుచేరి వెక్కివెక్కి ఏడ్చింది. బంతిమొక్క బావురుమనగా సన్నజాజి చిన్నబోయింది.
ఒకటా రెండా.. వేలాది ముక్కలు
తమకు జీవాన్ని జీవితాన్ని ఇచ్చిన రామయ్యకు సద్గతులు కలగాలని మొక్కాయి..మొక్కుకున్నాయి.. మున్ముందు కూడా ఇలాంటి రామయ్యలు భూమ్మీద జన్మించాలని.. వారి ద్వారానే వనాలు..తద్వారా జనాలు సైతం సుభిక్షంగా జీవిస్తారని ఆశించాయి. వనాల మారిన బతికే జీవాలు.. కూడా రామయ్య వంటి వాళ్ళు యుగానికొక్కరైనా పుట్టి దేశాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుకున్నాయి..
(వనజీవి రామయ్యకు సంతాపం తెలిపేందుకు ఈ కథనం)
-సిమ్మాదిరప్పన్న
