ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అయ్యింది.
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అయ్యింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక తదితర అంశాలపై చర్చ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ కానున్న విషయం తెలిసిందే. కాగా జీవోఎం సభ్యులు మాత్రం పూటకో రకమైన ప్రకటనలతో సీమాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచుతున్నారు. రాయల తెలంగాణను కాదనలేమని జైరాం రమేష్ అంటుంటే..... చిదంబరం మాత్రం రాయల తెలంగాణ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జీవోఎం తన పనిని ముగించి చేతులు దులుపుకోవడంతో ఇక మీదట ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నా రాయల తెలంగాణ ఏర్పాటుకే జీవోఎం సిఫార్సు చేసిందని హోం శాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి అజిత్ సింగ్ తెలిపారు.