ఎజెండాలో మహిళా సాధికారత అంశాలే అధికం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపై నిర్ణయం!
ఆర్థిక భారం పడే నిర్ణయాలు లేనట్టే అంటున్న ప్రభుత్వ వర్గాలు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మళ్లీ కోదండరాం,ఆమెర్ అలీఖాన్?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపోమాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలే ఈ భేటీ ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, వారికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం అమలు తదితర అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటనపై సైతం మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది. సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయాలను ప్రకటించనున్నారు. కాగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండకపోవచ్చని తెలిసింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై నిర్ణయం
గవర్నక్ కోటా కింద నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. తాజాగా ఈ ఉత్తర్వులను కొట్టివేసిన రాష్ట్ర హైకోర్టు, వారి పేర్లను పునః పరిశీలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమెర్ అలీ ఖాన్‌లను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్రమంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ కోదండరాం, ఆమెర్ అలీ ఖాన్‌ల పేర్లనే గవర్నర్‌కు ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ప్రభుత్వంలో కొనసాగుతున్న 1100 మంది రిటైర్డ్ అధికారులను కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే విద్యుత్ సంస్థల్లో కొత్త డైరెక్టర్లు, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, అదనపు పోస్టులతో గ్రూప్–2, గ్రూప్–3 అనుబంధ నోటిఫికేషన్ల జారీ లాంటివి కూడా మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది.
కాళేశ్వరంపై 15 అంశాల్లో విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం నిర్మాణం, మిషన్ భగీరథ వంటి అంశాలపై జ్యుడిషియల్, విజిలెన్స్ విచారణలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయా విచారణలకు సంబంధించిన విధివిధానాలను కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు.
విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ, ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయయూర్తితో కమిషన్ వేసి విచారణకు ఆదేశించే అంశంపై నిర్ణయం తీసుకోన్నుట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 15 అంశాలపై విచారణ జరిపించాలని ప్రతిపాదిస్తూ ఆ మేరకు విధివిధానాలను (టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్) నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment