న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం తుది అంకానికి చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి జీవోఎమ్(కేంద్ర మంత్రుల బృందం)కు అప్పచెప్పిన పనిని పూర్తి చేసి ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ నివేదికను అందజేశారు. కొత్తరాజధానికి నిధులు కేటాయించడంతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలలో వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయింపుపై ప్రధానంగా దృష్టి సారించారు. హైదరాబాద్ విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల కాలపరిమితి పొడిగింపుపై, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో ఉంచడంపై ఎటువంటి స్పష్టత రాలేదు.
జనాభా ప్రాతిపదిక ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపకాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. కాగా, సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండ్లను కేంద్రం పక్కకుపెట్టింది. హైదరాబాద్ ను యూటీ(కేంద్ర పాలిత ప్రాంతం)చేయాలన్న సీమాంధ్ర మంత్రుల విన్నపాన్ని కొట్టిపారేసింది. తెలంగాణ రాష్ట్ర అంశంపై కేంద్ర కేబినెట్ రేపు మరోసారి ప్రత్యేక భేటీ కానుంది. ఇదిలా ఉండగా టి.బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీజేపీ సూచించిన సవరణల్లో కొన్నింటినైనా పరిష్కారించాలనే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రేపటి కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు స్పష్టత రానుంది.