ఫిబ్రవరి 11న లోక్సభ ముందుకు తెలంగాణ బిల్లు?
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీన లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై అసలు చర్చ పూర్తి కాలేదు. గట్టిగా మాట్లాడితే అసలు సభ కూడా సజావుగా సాగడంలేదు. బిల్లుకు ఇప్పటికే వేల సంఖ్యలో సవరణలు వచ్చాయి. వాటిని ఇంకా క్రోడీకరించలేదు. ఈలోపే లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. సమాయాభావం వల్ల, లోక్సభ సమావేశాలు ముగిసిపోయే అకాశం ఉన్నందున ఈలోపే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా, తెలంగాణపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రుల బృందం ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఇదే ఆ బృందం చిట్టచివరి సమావేశం అవుతుందని చెబుతున్నారు. ఈ జీవోఎం బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు కూడా బిల్లుపై జీవోఎం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తుది చర్చలు పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ముందుకు ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ బిల్లు వెళ్తుందని సమాచారం. ఈ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 11 లేదా 12 తేదీలలో తెలంగాణ బిల్లు లోక్సభ ముందుకు రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఈసారి కూడా బిల్లును సభలో ప్రవేశపెడతారని అంటున్నారు. సవరణల గురించి ఆయనతో ప్రస్తావించగా, బిల్లుకు తప్పకుండా వేల సంఖ్యలో సవరణలు వస్తాయని, వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
ఎవరు ఎంతగా అభ్యంతరాలు చెబుతున్నా, అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు సైతం కాదంటున్నా కూడా వడివడిగా అడుగులు వేస్తూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు తాము తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టామని చూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.