బిల్లు సారాంశమిదీ.. | Andhra Pradesh State Re-organisation Bill-2013 | Sakshi
Sakshi News home page

బిల్లు సారాంశమిదీ..

Published Fri, Dec 6 2013 2:08 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

బిల్లు సారాంశమిదీ.. - Sakshi

బిల్లు సారాంశమిదీ..

రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం సమర్పించిన నివేదికను, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013ను గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇందులో ఇరు రాష్ట్రాల సరిహద్దుల నుంచి నదీ జలాలు, సహజ వనరుల పంపకాలు, హైదరాబాద్‌లో శాంతి భద్రతల వరకు అనేక అంశాలను పొందుపరిచారు. ఆ వివరాలివీ..
 
ఒకటో అంశం: సరిహద్దులు, నియోజకవర్గాలు...
1. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉంటాయి. అవి.. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో 119 మంది శాసనసభ సభ్యులు, 40 మంది శాసనమండలి సభ్యులు, 17 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటాయి. అవి.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది శాసనసభ సభ్యులు, 50 మంది శాసనమండలి సభ్యులు, 25 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

2. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంలో రాజ్యాంగంలోని 214వ అధికరణ కింద కొత్త హైకోర్టు ఏర్పడే వరకూ.. ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది.

3. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ)ని కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగంలోని 315 అధికరణ కింద కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసే వరకూ.. రాష్ట్రపతి అనుమతితో ఆర్టికల్ 315(4) కింద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) తెలంగాణ రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా వ్యవహరిస్తుంది.

4. ప్రస్తుతం మొత్తం 90 మంది సభ్యులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని పునర్‌వ్యవస్థీకరించటం జరుగుతుంది. తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 50 మంది సభ్యులు ఉంటారు.
 
రెండోది: పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
1. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకూ పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి గవర్నర్ ఉంటారు.
2. హైదరాబాద్ నగరం పదేళ్లకు మించని కాలం ఉమ్మడి రాజధానిగా పనిచేస్తుంది. ప్రస్తుతమున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధి ప్రాంతం ఉమ్మడి రాజధాని ప్రాంతమవుతుంది.

3. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పరిధిలో నివసించే ప్రజలందరి ప్రాణ, స్వేచ్ఛ, ఆస్తుల భద్రతకు సంబంధించిన ప్రత్యేక బాధ్యత గవర్నర్‌కు ఉంటుంది. ప్రత్యేకించి.. గవర్నర్ బాధ్యత శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల భద్రతకు సంబంధించిన అంశాలకు విస్తరించి ఉంటుంది. గవర్నర్ ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిని సంప్రదించి.. తన సొంత నిర్ణయంతో నిర్వర్తించవచ్చు. గవర్నర్ నిర్ణయమే తుది నిర్ణయమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సలహాదారులు గవర్నర్‌కు సాయం చేస్తారు. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ బాధ్యత గవర్నర్‌దే. ఈ ఏర్పాటు పదేళ్ల తర్వాత నిలిచిపోతుంది.

మూడో అంశం: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి బదిలీ
1. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయటానికి కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 45 రోజులలోగా ఈ నిపుణుల కమిటీ సిఫారసులు చేస్తుంది.

2. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేయటానికి కేంద్రం సాయం చేస్తుంది, అవసరమైన పక్షంలో వినియోగంలో లేని (డిగ్రేడెడ్) అటవీ భూమిని డీనోటిఫై చేయటం ద్వారా తోడ్పాటునందిస్తుంది.

3. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యలయాలు, సిబ్బంది క్వార్టర్లు, ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లతో సహా అవసరమైన సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందిస్తుంది.

నాలుగో అంశం: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి
1. రెండు కొత్త రాష్ట్రాల్లోనూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం.. భౌతిక, సామాజిక మౌలికవసతుల విస్తరణ, ఇతర కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి.

2. రెండు కొత్త రాష్ట్రాల్లోనూ పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని పెంపొందించటానికి పన్ను రాయితీ ప్రోత్సాహకాలతో సహా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి.

ఐదో అంశం: శాంతిభద్రతలు, పోలీసు దళాలు...
1. రెండు రాష్ట్రాలూ శాంతిభద్రతల నిర్వహణ కోసం అదనపు పోలీసు బలగాలను సమీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. హైదరాబాద్‌లో ఐదేళ్ల పాటు అదనంగా ఒక యూనిట్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరిస్తారు.

2. హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం మూడేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి శిక్షణా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సమయంలో ఈ శిక్షణాకేంద్రం కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో ఉంటుంది, దీనికి కేంద్ర ప్రభుత్వమే నిధులు అందిస్తుంది. ఈ మూడేళ్లలో ఆంధ్ర ప్రదేశ్‌లో తగిన ప్రాంతంలో సరికొత్త అత్యాధునిక గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుంది. మూడేళ్లు ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించటం జరుగుతుంది.

3. గ్రేహౌండ్స్ దళాల కార్యకలాపాల కేంద్రాల కోసం కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకూ ఆర్థిక సాయం చేస్తుంది.
4. ప్రస్తుతమున్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలకు చెందిన సిబ్బంది నుంచి వారి అభీష్టాలను తీసుకున్న తర్వాత.. రెండు రాష్ట్రాల మధ్యా విభజిస్తారు. విభజన తర్వాత ఈ రెండు దళాలూ రెండు రాష్ట్రాల సంబంధిత డీజీపీల ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
5. అవసరమైన పక్షంలో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో అదనపు కేంద్ర సాయుధ బలగాలను మోహరిస్తుంది.

ఆరో అంశం.. నదీ జలాలు, జల వనరులు, సహజ వనరుల పంపిణీ..
కృష్ణా నది జలాల పంపిణీపై ఏర్పాటు చే సిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపే బాధ్యతను ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్‌కు అప్పగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిర్దిష్ట గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్ణయానికి రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, నిర్వహణకు రెండంచెల వ్యవస్థ ఉంటుంది. అవి 1.కృష్ణా, గోదావరి జలాల ఉన్నత మండలి. 2. కృష్ణా, గోదావరి జలాల నిర్వహణ బోర్డులు.

1. ఉన్నత మండలి కూర్పు, విధులు ఇవీ..
* కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్‌గా కృష్ణా, గోదావరి జల మండలిని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. అంతర్రాష్ట్ర జల నిర్వహణ బోర్డులను ఈ మండలి పర్యవేక్షిస్తుంది.
* కృష్ణా, గోదావరి బేసిన్‌లో కొత్త ప్రాజెక్టు కట్టాలంటే అందుకు మండలి ఆమోదముద్ర తప్పనిసరి.
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏర్పడితే సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు మండలి తోడ్పడుతుంది.
* భవిష్యత్తులో నదీ జలాలపై ఏర్పడే సమస్యలేవైనా కృష్ణా, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ పరిధిలోకి రాకుంటే.. వాటిని కేంద్రం ఏర్పాటు చేసే కొత్త ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది.

2. కృష్ణా, గోదావరి జలాల నిర్వహణ బోర్డు పనితీరు ఇదీ..
* ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013 అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోపు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కృష్ణా, గోదావరి జలాల నిర్వహణ బోర్డులను ఏర్పాటు చేస్తుంది.
* కృష్ణా జల వనరుల బోర్డు ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. గోదావరి జల వనరుల బోర్డు ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఉంటుంది.
* రెండు బోర్డులకు ఒక్కో చైర్మన్ ఉంటారు. వీరిని (కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి/అదనపు కార్యదర్శి హోదా ఉన్న అధికారులు) కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.  రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరేసి  అధికారులను సభ్యులుగా నియమిస్తుంది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉన్న ఇద్దరు అధికారులను ఈ రెండు బోర్డులకు పూర్తిస్థాయి కార్యదర్శిగా నియమిస్తారు.
 

* కృష్ణా, గోదావరిపై ఉన్న జలాశయాలు, ప్రాజెక్టులు, కాలువలు, హైడల్ ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ తదితర బాధ్యతలను ఈ బోర్డులు పర్యవేక్షిస్తాయి. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీని పర్యవేక్షిస్తాయి.
పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రాజెక్టును నిర్మిస్తుంది.
* బోర్డుల నిర్వహణకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తాగునీరు, సాగునీటి మధ్య డిమాండ్ తలెత్తితే తొలి ప్రాధాన్యం తాగునీటికే ఇవ్వాలి.
* జల మండలి, బోర్డులు తీసుకున్న నిర్ణయాలను పాటించని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ జరిమానాలు విధిస్తుంది.

 బొగ్గు పంపకాలు ఇలా..
*  సింగరేణి కాలరీస్ కంపెనీలో 51 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వానికి, 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
*  సింగరేణి బొగ్గు కేటాయింపులు యథాతథంగా ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బొగ్గు పంపిణీ విధానానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకు కొత్త బొగ్గు కేటాయింపులు ఉంటాయి.

సహజ వాయువు..
*  కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశాల ప్రకారం సహజ వాయువు కేటాయింపు ఉంటుంది.
*  చమురు, సహజవాయువు ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అయితే దానిపై రాయల్టీ అదే రాష్ట్రానికి చెందుతుంది.

ఏడో అంశం: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా
 1. ఏపీ జెన్‌కో యూనిట్లను భౌగోళిక ప్రాంతాల ఆధారంగా విభజిస్తారు. 2. ప్రస్తుతం ఆయా డిస్కమ్‌లతో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. నడుస్తున్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కొనసాగుతాయి. 3. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆరు నెలల వరకూ ఉమ్మడి నియంత్రణ మండలిగా కొనసాగుతుంది. ఆ కాలంలో రెండు రాష్ట్రాలూ తమకు ప్రత్యేకంగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు ఏర్పాటు చేసుకోవాలి. 4. ప్రస్తుతం ఉన్న స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) రెండేళ్ల పాటు ఇరు రాష్ట్రాల కు ఉమ్మడిగా కొనసాగుతుంది. ఆ సమయంలోగా ఇరు ప్రాంతాల్లోనూ ఎస్‌ఎల్‌డీసీలను ఏర్పాటుచేసుకోవాలి. రెండేళ్ల కాలవ్యవధి సమయంలో ప్రస్తుత ఎస్‌ఎల్‌డీసీ బెంగళూరులో ఉన్న ఆర్‌ఎల్‌డీసీ నేతృత్వంలో పనిచేస్తుంది. 5. ఇరు రాష్ట్రాల్లోనూ ట్రాన్స్‌మిషన్ కేంద్రాలు నిర్మాణం అయ్యే అంతవరకు ఏపీ ట్రాన్స్‌కో రెండింటి అవసరాలను తీర్చేందుకు పనిచేస్తుంది. ఇరు రాష్ట్రాల్లోని 132 కేవీ, అంతకుమించిన విద్యుత్ లైన్లను అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ఐటీఐఎస్)గా పరిగణించటం జరుగుతుంది. పూర్తిగా ఏదైనా ఒక ప్రాంతంలోనే ఉన్న ట్రాన్స్‌మిషన్ లైన్లు ఆ రాష్ట్రానికే చెందుతాయి. వాటి నిర్వహణను సంబంధిత రాష్ట్రాలే చేపట్టాల్సి ఉంటుంది. 6. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి విద్యుత్ ఉత్పత్తిని గత ఐదేళ్ల సగటు విద్యుత్ వాడకం ఆధారంగా పంపిణీ చేస్తారు. 7. కర్నూలు, అనంతపురం జిల్లాలను ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ పంపిణీ సంస్థకు కేటాయిస్తారు.

ఎనిమిదో అంశం: ఆస్తులు, అప్పుల విభజన...
రాష్ట్ర సంస్థల ఆస్తులు, అప్పుల విభజన ఇలా ఉంటుంది...
(1) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏదైనా వాణిజ్య, పారిశ్రామిక సంస్థకు చెందిన ఆస్తులు, అప్పులు.. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నదనే అంశంతో సంబంధం లేకుండా.. ఆ సంస్థ లేదా అందులోని ఒక భాగం ప్రత్యేకించి ఒక స్థానిక ప్రాంతంలో ఉన్నట్లయితే; లేదా ఆ సంస్థ కార్యకలాపాలు ఒక స్థానిక ప్రాంతానికి పరిమితమైనట్లయితే.. ఆ ప్రాంత రాష్ట్రానికే చెందుతాయి.  ఆ సంస్థ కార్యకలాపాలు అంతర్రాష్ట్రంగా మారేట్లయితే..
 (ఎ) ఆ సంస్థకు సంబంధించి పనిచేస్తున్న యూనిట్లను అవి ఉన్న  ప్రాంతం ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకూ పంచాలి.
 (బి) ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంచాలి.
 ఆస్తులు, అప్పుల విభజన తర్వాత.. వాటిని ఉమ్మడి అంగీకారంతో చెల్లింపులు, సర్దుబాట్ల ద్వారా లేదా అంగీకరించిన మరేదైనా పద్ధతిలో గానీ భౌతికంగా బదిలీ చేయాలి.
 2. పెన్షన్లకు సంబంధించిన అంశాలు జనాభా ప్రాతిపదికన ఉంటాయి.
 3. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున నెలకొల్పిన రిజిస్టర్డ్ సొసైటీలు, సహకార సంఘాలు, ఆర్గనైజేషన్లు, కార్పొరేషన్లు, కంపెనీలు, ట్రస్టుల ఆస్తులు, అప్పుల విభజన అవి ఉన్న ప్రాంతాల ప్రాతిపదికగా ఉండాలి. ఇవి రెండు రాష్ట్రాలోనూ ఉన్నట్లయితే విభజన జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ఉంటుంది.
 4. (రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన రోజున..) ఆర్‌బీఐ, ఎస్‌బీఐలలో ఉన్న ప్రభుత్వ ఖాతా, నగదు నిల్వలను రెండు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంచాలి.
 5. ప్రభుత్వ అప్పులను జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంచాలి.
 6. ఏదైనా వాణిజ్య సంస్థకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించే స్వల్పకాలిక రుణానికి సంబంధించిన బాధ్యత.. ఆ సంస్థ నెలకొని ఉన్న ప్రాంతానికి చెందిన రాష్ట్రానిదే అవుతుంది. అలా లేని పక్షంలో.. దానిని జనాభా నిష్పత్తి ప్రాతిపదికన విభజించాలి.
 7. భవిష్యనిధి బాధ్యత సంబంధిత ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వతంగా ఏ రాష్ట్రానికి కేటాయిస్తే ఆ రాష్ట్రానిదే అవుతుంది.
 8. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడో ఆర్థిక సంఘం చేసిన కేటాయింపులను.. కొత్త రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం విభజిస్తుంది.
 9. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించి.. కేంద్రం తగిన కేటాయింపులు చేయవచ్చు.
 10. కాంట్రాక్టులకు సంబంధించి.. ఆయా కాంట్రాక్టుల ప్రయోజనం ఏదైనా ఒక రాష్ట్రానికి ప్రత్యేకమైనట్లయితే.. ఆ బాధ్యత ఆ రాష్ట్రానికే చెందుతుంది. అలా కాని పక్షంలో.. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రెండు రాష్ట్రాలూ బాధ్యత వహించాలి, ఆయా రాష్ట్రం తన వంతు మొత్తాన్ని చెల్లించాలి.
 11. జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులను విభజించిన తర్వాత.. కొత్త రాష్ట్రానికి కేటాయించాల్సిన వాటిని, ఒక రాష్ట్రం మరొక రాష్ట్రానికి అందించాల్సిన మొత్తాన్ని.. కేంద్ర ప్రభుత్వం భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్‌ను సంప్రదించిన తర్వాత ఆదేశిస్తుంది. దీనికి సంబంధించి ఏ వివాదాన్నయినా ఉమ్మడి అంగీకారంతో పరిష్కరించుకోవాలి. లేనిపక్షంలో కాగ్‌ను సంప్రదించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పరిష్కరిస్తుంది.
 తొమ్మిదో అంశం..
 సబార్డినేట్, అఖిల భారత సర్వీసుల్లోని ఉద్యోగుల పంపిణీ
  పరిపాలన కొనసాగేందుకు వీలుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులందరూ చివరి కేటారుుంపులు జరిగేంతవరకు తాత్కాలికంగా తమ తమ పోస్టుల్లో కొనసాగాలి.
  పాలన సాఫీగా సాగేందుకు ఇటు అఖిల భారత సర్వీసు అధికారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను (సచివాలయం, డెరైక్టరేట్లు, హెచ్‌ఓడీలు సహా) కేటాయించే అధికారం భారత ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయంలో సహాయ పడేందుకు కేంద్రం ఒకటి లేదా అంతకుమించి సలహా మండళ్లను ఏర్పాటుచేస్తుంది. అరుుతే కేటారుుంపులను నిర్ధారించిన తర్వాత ఏదైనా లోటును అధిగమించేందుకు వీలుగా అఖిల భారత సర్వీసులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఒక రాష్ర్టం నుంచి మరో రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై పంపవచ్చు.
  లోకల్, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు సంబంధించినంత వరకు.. ఉద్యోగులు నియమిత తేదీన, లేదా ఆ తర్వాత ఎక్కడ, ఎలా పనిచేస్తున్నారో అక్కడే, అలాగే యధాతథంగా కొనసాగుతారు.
  ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013లోని నిబంధనల మేరకు పరిశీలనానంతరం.. తాను ఇచ్చిన ఉత్తర్వుల సవరణ సహా మిగతా వాటిని కూడా సమీక్షించే అధికారాలు కేంద్రానికి ఉండాలి.
  ఆంధ్రప్రదేశ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013 చట్టరూపం దాల్చినప్పుడు లేదా ఆ తర్వాత కేంద్రం ప్రత్యేకంగా ఈ కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయూలి. సలహామండళ్ల సిఫారసుల మేరకు కేంద్రం ఉద్యోగుల ఆప్షన్‌ను కోరిన తర్వాత మాత్రమే ఉద్యోగుల వాస్తవ కేటాయింపు జరగాలి.
   సలహా మండలి లేదా మండళ్లను.. బిల్లు చట్ట రూపం దాల్చిన 30 రోజుల్లోగా నియమించాలి.
  నియమిత తేదీ, అలాగే ఆ తేదీ నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు అఖిల భారత సర్వీసుల కేడర్లు ఏర్పాటు చేయూలి. కొత్తగా నియమించేవారిని విభజనానంతరం తక్షణమే వేర్వేరు కేడర్లకు కేటాయించాలి. పాలన కొనసాగేందుకు వీలుగా..  విధుల్లో ఉన్న అధికారులను కేడర్లకు కేటాయించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయూలి.
  రాష్ట్ర ప్రభుత్వరంగ, కార్పొరేషన్లు, అటానమస్ సంస్థలకు చెందిన ఉద్యోగులు నియమిత తేదీ నుంచి ఏడాది పాటు ఎక్కడ, ఎలా పనిచేస్తున్నారో అక్కడే, అలాగే పనిచేయూలి.

పదో అంశం: 371 డి
విద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన 371 (డీ) రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుంది. ఈ విషయమై తగిన రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ కోసం రెండు రాష్ట్రాలూ ప్రతిపాదనలు సమర్పించాలి.

పదకొండో అంశం..
విద్య: రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యావకాశాలు కల్పించేందుకు.. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్ వృత్తి విద్యా కళాశాలలు, సంస్థల్లో ఐదేళ్లకు మించకుండా ప్రస్తుతమున్న ప్రవేశ కోటాలనే కొనసాగించాలి. ఈ సమయంలో ఉమ్మడి ప్రవేశ ప్రక్రియ కూడా కొనసాగాలి.
  12, 13 ప్రణాళికా కాలాల్లో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ప్రాధాన్యమున్న సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వీటిలో ఒక ఐఐటీ, ఒక ఎన్‌ఐటీ, ఒక ఐఐఎం, ఒక ఐఐఎస్‌ఈఆర్, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఒక వ్యవసాయ వర్సిటీ, ఒక ట్రిపుల్ ఐటీ కూడా ఉండాలి.
  కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ టీచింగ్ ఇనిస్టిట్యూషన్‌ను ఏర్పాటు చేయూలి.
  తెలంగాణలో ఓ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలి.
 
 మౌలికసదుపాయాలు:
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుగ్గిరాజుపట్నం వద్ద భారీ ఓడ రేవును అభివృద్ధి చేయూలి. మొదటి దశ 2018 చివరికల్లా పూర్తికావాలి.
  తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ‘సెయిల్’ తరహా ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలి.
  కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ అభివృద్ధి అవకాశాలను ఐఓసీ/హెచ్‌పీసీఎల్ పరిశీలించాలి.
  వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలి.
  విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లోని ప్రస్తుత విమానాశ్రయాలను విస్తరించేందుకున్న అవకాశాలను పరిశీలించాలి.
  తెలంగాణ రాష్ట్రంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు అవకాశాలను ఎన్టీపీసీ పరిశీలించాలి.
  కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ కొత్త రైల్వేజోన్ ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలి.
  తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లను మెరుగుపరిచేందుకు నేషనల్ హైవే అథారిటీ తగు చర్యలు తీసుకోవాలి.
  తెలంగాణ రాష్ట్రంలో రైలు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకున్న అవకాశాలు పరిశీలించాలి. రైలు సౌకర్యాలు మెరుగుపరచాలి.
  కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు రాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
  తెలంగాణలో హార్టీకల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement