తెలంగాణ?.. రాయలా?.. ఇంకా సస్పెన్సే! | Telangana GoM finalises report, cabinet to discuss Thursday | Sakshi
Sakshi News home page

తెలంగాణ?.. రాయలా?.. ఇంకా సస్పెన్సే!

Published Thu, Dec 5 2013 2:08 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

తెలంగాణ?.. రాయలా?.. ఇంకా సస్పెన్సే! - Sakshi

తెలంగాణ?.. రాయలా?.. ఇంకా సస్పెన్సే!

* కసరత్తు ముగించి బిల్లు సిద్ధం చేసిన జీవోఎం
* నివేదిక, నోట్‌లతో పాటు నేడు కేబినెట్‌కు సమర్పణ
* జీవోఎం సిఫార్సు ఏమిటన్న దానిపై ఇంకా గోప్యతే
* సాయంత్రం ఐదింటికి కేబినెట్ సమావేశంలో చర్చ
* ‘రాయల’, తెలంగాణపై భేటీలోనే తుది నిర్ణయం
* బిల్లును ఆమోదిస్తే ఆ వెంటనే రాష్ట్రపతికి సిఫార్సుపై పెదవి విప్పని షిండే, సభ్యులు
* ఫక్తు రాజకీయ కోణంలో చూస్తున్న కాంగ్రెస్
* చివరి క్షణం దాకా లాభనష్టాల బేరీజే లక్ష్యం?
* రాయల తెలంగాణ, తెలంగాణ ఆప్షన్లు రెండూ ఇచ్చిన మంత్రుల బృందం!
 
సాక్షి, న్యూఢిల్లీ: విభజన పర్వంలో ఓ అంకం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఏర్పాటుచేసిన మంత్రుల బృందం(జీవోఎం) ఎట్టకేలకు తన పని పూర్తి చేసింది. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా రూపొందించిన సిఫార్సులతో కూడిన నివేదికకు, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు, కేబినెట్ నోట్‌కు బుధవారం జరిపిన చివరి భేటీలో జీవోఎం ముద్ర వేసింది. గురువారం సాయంత్రం ఐదింటికి జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడింటినీ టేబుల్ ఐటెమ్‌గా పెడతారని తెలియవచ్చింది. కేబినెట్ వాటిపై చర్చించి ఆమోదం తెలపడంతో పాటు ఆ వెంటనే, అంటే గురువారమే రాష్ట్ర విభజన బిల్లును
 రాష్ట్రపతికి కూడా పంపుతుందని సమాచారం. గంట పాటు జరిగిన జీవోఎం భేటీ అనంతరం బుధవారం రాత్రి షిండే మీడియా ముందుకొచ్చి క్లుప్తంగా మాట్లాడారు.

‘‘జీవోఎంను ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ మాకిచ్చిన బాధ్యతను నేటితో పూర్తిచేశాం. మేం సిఫార్సులు చేశాం. వాటిపై గురువారం కేబినెట్ చర్చిస్తుంది’’ అని చెప్పడంతో సరిపెట్టారు. తెలంగాణ, రాయల తెలంగాణల్లో దేనికి సిఫార్సు చేశారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి బదులూ ఇవ్వకుండానే వెనుదిరిగారు. జీవోఎం సిఫార్సు ఏమిటన్నది మరో 24 గంటల్లోపే తేటతెల్లమయ్యేదేనని తెలిసి కూడా ఇంతగా గోప్యత పాటించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. రెండు ఆప్షన్లలో దేనితో తనకు రాజకీయంగా కొద్దో గొప్పో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందన్న కోణంలో లాభనష్టాల బేరీజులో, తుది విడత మల్లగుల్లాల్లో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలుగా ఉన్నట్టు సమాచారం. అందుకే, ఈ అంశంపై అస్పష్టతను గురువారం సాయంత్రం దాకా కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన వంటి అత్యంత కీలకాంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఫక్తు రాజకీయ ప్రయోజన కోణంలోనే చూస్తోందన్నది తాజా వైఖరితో మరోసారి స్పష్టమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి 12 జిల్లాలతో కూడిన ‘రాయల తెలంగాణ’ ఏర్పాటుకు జీవోఎం ఆమోదముద్ర వేసినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ, 10 జిల్లాలతో కూడిన తెలంగాణఅంటూ రెండు ఆప్షన్లనూ నివేదికలో జీవోఎం పొందుపరిచిందని, అంతిమ నిర్ణయాన్ని కేబినెట్‌కు విడిచిపెట్టిందని మరికొన్ని వర్గాల కథనం. దాంతో విభజన ఎలా ఉండాలనే విషయమై జీవోఎం కచ్చితంగా చేసిన సిఫార్సు ఏమిటనే దానిపై సందిగ్ధత నెలకొంది. నదీ జలాల పర్యవేక్షణ మండళ్లకు సంబంధించి కృష్ణా, గోదావరితో పాటు పెన్నా నదిని కూడా చేర్చినట్టు సమాచారం.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సరిగ్గా ముందురోజు జీవోఎం తన కసరత్తును ముగించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడతారా, లేదా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవోఎం తన పనిని ముగించి చేతులు దులుపుకోవడంతో ఇక మీదట ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నా రాయల తెలంగాణ ఏర్పాటుకే జీవోఎం సిఫార్సు చేసిందని హోం శాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

అంతేగాక, ‘‘317డి అధికరణాన్ని రెండు రాష్ట్రాలకూ వర్తింపజేయాలని కూడా జీవోఎం సిఫార్సు చేసింది. రాజ్యాంగ సవరణ ఆవశ్యకత తలెత్తకుండా ఉండేందుకు గాను బిల్లు పేరును కూడా ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు అని కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బిల్లుగా మార్చాలని కూడా సిఫార్సు చేసింది’’ అని పీటీఐ తెలిపింది. ఆస్తులు-అప్పులు, జల వనరుల పంపకం, రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం, ప్రభుత్వాధికారుల క్యాడర్ల విభజన తదితర అంశాలకు కూడా జీవోఎం తుది మెరుగులు దిద్దినట్టు పేర్కొంది.
 
కేబినెట్ నుంచి వెంటనే రాష్ట్రపతికి: జైరాం
రాష్ట్ర విభజన ప్రతిపాదనను అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ ఆమోదించి ఏర్పాటుచేసిన జీవోఎం ఇప్పటివరకూ పలు సమావేశాలు నిర్వహించి, ఇదిగో అదిగో నివేదికను ఖరారు చేస్తున్నామంటూ చెబుతూ వచ్చిన విషయం విదితమే. మంగళవారం రాత్రి జరిగిన అసంపూర్ణ భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి  షిండే చెప్పిన ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు నార్త్ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో జీవోఎం ‘చిట్టచివరి భేటీ’ నిర్వహించింది. షిండే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు ఎ.కె.ఆంటోనీ, పి.చిదంబరం, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, నారాయణసామి పాల్గొనగా, గులాం నబీ ఆజాద్ గైర్హాజరయ్యారు. షిండే, జైరాం, నారాయణసామి ఒకే వాహనంలో భేటీకి రావడం విశేషం.

అంతకుముందు వారు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి నివేదిక అంశాలపై చివరిసారిగా చర్చించారని, ఆమె సమ్మతి తర్వాత నేరుగా నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారని తెలుస్తోంది. జీవోఎం సమావేశం గంటలోపే ముగిసింది. ఆ తర్వాత కూడా షిండే, జైరాం దాదాపు గంటపాటు లోపలే గడిపారు. సభ్యులంతా ఆమోదించిన సిఫార్సులకు తుది మెరుగులు దిద్ది తుది నివేదికను, బిల్లును సిద్ధం చేశారు. అన్ని నిర్ణయాలూ తీసుకున్నామని, తుది సమావేశం పూర్తయిందని భేటీ అనంతరం ఆంటోనీ కార్యాలయం లోపల మీడియాకు చెప్పారు. ఒక బిల్లు, ఒక నివేదిక సిద్ధమయ్యాయని కార్యాలయం బయట మొయిలీ విలేకరులకు తెలిపారు.

అయితే నివేదిక, ముసాయిదా బిల్లు స్వరూపంపై మీడియా ఎంతగా ప్రశ్నించినా సభ్యులెవరూ స్పందించలేదు. చివరగా బయటికొచ్చిన జైరాం కూడా తెలంగాణ, రాయల తెలంగాణలపై ఏమీ చెప్పలేదు. నివేదిక, బిల్లు వెంటనే కేబినెట్‌కు వెళ్తాయని, ఆ వెంటనే వాటిని రాష్ట్రపతికి పంపుతారని మాత్రమే చెప్పారు. అయితే బిల్లును పరిశీలించేందుకు, అసెంబ్లీకి పంపేందుకు రాష్ట్రపతి ఎంత సమయం తీసుకుంటారో చెప్పడానికి జీవోఎం సభ్యులతో పాటు హోం శాఖ వర్గాలు కూడా నిరాకరించాయి. వీలైనంత త్వరగా అసెంబ్లీకి పంపవచ్చన్నది కాంగ్రెస్, ప్రభుత్వ వర్గాల అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement