* సీమాంధ్ర కేంద్రమంత్రులతో భేటీ
* వారు కోరిన 9 సవరణలను పరిశీలిస్తామని హామీ
* ఇక భేటీలుండవన్న మర్నాడే మళ్లీ సమావేశమైన జీవోఎం
* అసంపూర్తిగా ముగింపు.. నేడు మళ్లీ మంత్రుల బృందం భేటీ
* నేడు కేబినెట్‌కు బిల్లు వెళ్లడం అనుమానమే
* ఇప్పుడే చెప్పలేమన్న షిండే, చూడాలన్న జైరాం రమేశ్
* హైదరాబాద్ ఆదాయం పంపకం, సీమాంధ్రకే భద్రాచలం!
* కొత్త రాజధాని, రాయలసీమ ప్యాకేజీకీ సానుకూలం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంకం దేశ రాజధానిలో రకరకాల మలుపులు తిరుగుతూ అందరిలోనూ ఉత్కంఠ పెంచుతోంది. ‘ఇదే చివరి భేటీ. ఇక మా పని ముగిసింది’ అని మంగళవారం ప్రకటించిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం), ఆ మర్నాడే మరోసారి సమావేశమై విభజన కసరత్తును కొనసాగించింది! బుధవారం సాయంత్రం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పలు ప్రతిపాదనలతో జీవోఎం సభ్యులతో సమావేశమయ్యారు. ఇక్కడి హోం శాఖ కార్యాలయంలో దాదాపు 2 గంటలపాటు జరిగిన ప్రత్యేక భేటీలో మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్, చిరంజీవి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు రెండు నెలల క్రితమే చేసిన ప్రతిపాదనలనే జీవోఎం వారి నుంచి మరోసారి తీసుకుంది. చివరికి భేటీ అసంపూర్తిగా ముగిసింది. గురువారం మరోసారి సమావేశం కావాలని జీవోఎం నిర్ణయించింది. ‘మంత్రులు ఎనిమిది, తొమ్మిది కీలకమైన సవరణలు చేశారు. నేడు మరోసారి జీవోఎం సమావేశం ఉంటుంది. వాటిని మరోసారి పరిశీలించాల్సి ఉంది’ అని భేటీ తర్వాత జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు. ముందుగా ప్రకటించిన విధంగా విభజన బిల్లు గురువారం కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందా అని ప్రశ్నించగా, ‘చూడాలి. ప్రయత్నించాలి’ అని బదులిచ్చారు. ఈ విషయమై తానేమీ చెప్పలేనని జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూడా భేటీ అనంతరం అభిప్రాయపడ్డారు.
‘‘అందుకే, సమయం పడుతుందని నేనెప్పటి నుంచో చెబుతున్నా’ అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5.30కు జరిగే కేబినెట్ భేటీ ఎజెండాలో విభజన బిల్లు ఉండటం అనుమానంగానే మారింది. ఎందుకంటే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జీవోఎం భేటీ కానుంది. దానికీ, కేబినెట్ భేటీకీ మధ్య సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఒకవేళ కేబినెట్ భేటీలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినా, దానికి ఆమోదముద్ర పడటం కష్టమేనని తెలుస్తోంది. అయితే కేవలం ఆర్థికాంశాలకు సంబంధించిన సవరణలను మాత్రమే జీవోఎం ప్రతిపాదించి కేబినెట్‌లో పెడితే మాత్రం అవి ఆమోదం పొందే అవకాశాలున్నాయి. అంతకు మించిన సవరణలైతే బిల్లు గురువారం కేబినెట్‌కు రావడం కష్టమేనంటున్నారు.
మీరు సిద్ధమైతే మేమూ ఓకే
జీవోఎంతో భేటీ అనంతరం చిరంజీవి, శీలం మీడియాతో మాట్లాడారు. తాము సవరణ ప్రతిపాదనలను వివరించామని, వాటిని బిల్లులో చేరిస్తే తమ ప్రాంత ప్రజలను ఊర డించే శక్తి తమకొస్తుందని చెప్పారు. ‘నిన్న (మంగళవారం) సాయంత్రం అధిష్టానం మాతో వార్ రూమ్‌లో సంప్రదింపులు జరిపింది. మేం విభజన వద్దన్నాం. రెండు నెలల క్రితం ఇచ్చిన మా ప్రతిపాదనలను పట్టించుకోనందున ససేమిరా అన్నాం. అయితే ఇప్పుడు అధిష్టానం స్పందించింది. పునరాలోచనలో పడింది. మా ప్రజల ఆవేదన, వ్యథ, ఆవేశం అర్థం చే సుకుంది. అప్పటి మా ప్రతిపాదనలను పరిశీలిస్తోం ది. వాటిని అమలు చేస్తే చివరకు తెలుగు వారందరినీ విజయం వరిస్తుంది’ అని శీలం అన్నారు.
వారే పిలిచారు: చిరంజీవి
ఈ సమావేశం తాము కోరితే జరగలేదని, వారే పిలిచారని చిరంజీవి చెప్పారు. ‘‘భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను సీమాంధ్రలో కలపడం, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం, హైదరాబాద్ ఆదాయాన్ని పంచడం, ఆస్తులు- అప్పులను తేటతెల్లం చేయడం, విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా.. పదేళ్లు అనే నిబంధన కాకుండా అసలు కాలపరిమితినే తీసేయడం వంటి అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాం. ఇవన్నీ పట్టించుకోనందుకే బిల్లు తిరస్కరణకు గురయ్యే పరిస్థితికి వెళ్లింది. దాంతో వారిప్పుడు ఆలోచనలో పడ్డారు. పునఃసమీక్షిస్తున్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో ఇవన్నీ ఉంటాయని భావిస్తున్నాం. మాకు 100 శాతం నమ్మకముంది. ఏం జరుగుతుందనే దాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది’ అని పేర్కొన్నారు.
ఏ సవరణలకు అంగీకరించారన్న ప్రశ్నకు, అవన్నీ చెప్పలేమని శీలం బదులిచ్చారు. ‘‘సమస్య పరిష్కారం కావాలి. ఇది సున్నితమైన, మనోభావాలకు చెందిన అంశం. తెలుగు వారంతా బాగుండాలి’ అన్నారు. విశాఖను కొత్త రాజధానిగా చే యాలని, ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కూడా కోరినట్టు కిశోర్ చంద్రదేవ్ తెలిపారు.
సవరణ అంశాలివే...!
ముఖ్యంగా భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ నుంచి సీమాంధ్రలో కలపాలన్న డిమాండ్‌ను కచ్చితంగా అమలు చేయాలని జీవోఎంకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. ఇది బిల్లులో ఉండాల్సిందేనన్నారు
హైదరాబాద్‌పై పెట్టిన ప్రతి పైసా రాష్ట్రం మొత్తం ఆదాయంలోంచేనని, ఇప్పుడు ఆ ఆదాయాన్ని పంచడంలో ఉన్న అభ్యంతరమేమిటని పట్టుబట్టారు
మిగతా అంశాలెలా ఉన్నా భద్రాచలం, హైదరాబాద్ ఆదాయం పంపకం డిమాండ్లపై తెలంగాణ ప్రజల నుంచి కూడా ఎలాంటి అడ్డంకులూ ఉండబోవన్నారు.
‘హైదరాబాద్‌ను యూటీ చేయడం వంటి డిమాండ్లను జీవోఎం తీర్చేలా కన్పించడం లేదు. యూటీని పోలిన అధికారాలనైనా వర్తింపజేయాలని కోరాం గానీ అదీ చేసేలా లేరు. కనీసం మాకు కొత్త రాజధాని ఏర్పడేదాకానైనా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరాం గానీ దానికీ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం సమ్మతంగానే ఉంది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశముంది. అలాగే సీమాంధ్రలో ఏర్పాటు చేయబోయే విద్యాసంస్థలన్నింటికీ ఖర్చును కేంద్రమే భరిస్తానంది’ అని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు.
జీవోఎం... ఇంకావుంది!
Published Thu, Feb 6 2014 1:10 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement