* బిల్లులో ఎలాంటి మార్పులు, సవరణలు చేయని జీవోఎం
* ఆర్థిక ప్యాకేజీలపై మాత్రం కేబినెట్‌కు ప్రతిపాదనలు?
* అరగంటలో ముగిసిన మంత్రుల బృందం భేటీ
* కేబినెట్ నోట్ సిద్ధం.. సవరణల భారం మంత్రిమండలికే
* సాంకేతిక అంశాలపైనే దృష్టిపెట్టిన జీవోఎం
* బిల్లు అమలులో సమస్యలు వచ్చే అంశాలపైనే చర్చ
* రేపు భేటీ కానున్న కేబినెట్.. నేటి నుంచి పార్లమెంటు
* 10న రాజ్యసభలో బిల్లు.. లోక్‌సభలో 11న?
* బీజేపీ వైఖరిని బట్టబయలుచేసే వ్యూహంలో భాగంగానే ముందుగా రాజ్యసభలో విభజన బిల్లు
* ఆ పార్టీ వైఖరి తేలిన తర్వాత లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై స్పష్టత వచ్చే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణలు ఉంటాయా? రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు చేసిన సూచనల్లో వేటిని చేరుస్తారు? బిల్లులో ఉన్న వాటిలో వేటిని తొలగిస్తారు? రాష్ట్రం యావత్తూ ఎదురుచూసిన ఈ అంశంపై ఎటూ తేల్చకుండానే కేంద్ర మంత్రుల కమిటీ (జీవోఎం) మమ అనిపించింది. కొత్త రాజధాని ఏర్పాటుకు ఆర్థిక ప్యాకేజీపై ప్రతిపాదనలను మాత్రమే చేస్తూ.. సాంకేతిక సవరణలతో బిల్లును యథాతథంగా ఖరారు చేస్తూ కేబినెట్ నోట్‌కు ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర మంత్రిమండలికి పంపనుంది. కొత్త నిర్ణయాలు తీసుకొనే భారాన్ని కేంద్ర కేబినెట్‌కే వదిలేసింది.
తెలంగాణ బిల్లుపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన జీవోఎం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నార్త్‌బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు షిండే, ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్, జైరాం రమేశ్‌లతోపాటు హోంశాఖ సహాయ మంత్రి నారాయణస్వామి హాజరయ్యారు.
ఈ సమావేశంలో బిల్లు ఆమోదానికి, అమలుకు తలెత్తే న్యాయపరమైన సమస్యలు, సాంకేతిక అంశాలపైనే దృష్టి పెట్టినట్టు తెలిసింది. బిల్లుతో పాటు ఉండాల్సిన ఫైనాన్షియల్ మెమోరాండం, ఇతర అంశాలపై చర్చించింది. రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు ప్రతిపాదించిన 9,072 సవరణలను పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రధాన డిమాండ్లయిన పోలవరం ముంపు బాధిత ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం, కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ ఇవ్వడం వంటి అంశాలపై చర్చ జరిగినా.., వీటిపై నిర్ణయం తీసుకొనే భారాన్ని కేంద్ర మంత్రివర్గానికి వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
పోలవరం ముంపు బాధిత ప్రాంతాలను సీమాంధ్రలో కలపడంవల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు ఉండవన్న వాదన మినహా ఇతరత్రా ప్రయోజనం ఉండదని, అందువల్ల దీనిపై మార్పులు తగవని అభిప్రాయపడినట్లు తెలిసింది. కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక ప్యాకేజీపై మాత్రమే బిల్లులో అదనంగా చేరే అవకాశం కనిపిస్తోంది. ప్యాకేజీ ఎంత అనేది కూడా కేబినెట్ నిర్ణయానికే వదిలేసినట్టు సమాచారం. ఇప్పుడు ఏ సవరణలు చేసినా డిమాండ్లకు అంతం ఉండదని, పార్లమెంటులో వచ్చే సవరణలకే బిల్లులో స్థానం కల్పించాలని జీవోఎం భావిస్తున్నట్టు తెలిసింది. చివరకు బిల్లులో సాంకేతిక అంశాలు మినహాయించి ఎలాంటి మార్పులు లేకుండానే ముగిస్తూ కేబినెట్ నోట్‌ను ఆమోదించినట్టు సమాచారం.
అరగంటలోనే సమావేశం ముగియగా, జైరాం రమేశ్ తప్ప మిగతా మంత్రులందరూ వెళ్లిపోయారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ బిల్లు సిద్ధమైందని తెలిపారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనిని మంత్రిమండలి ఆమోదిస్తుందని, తర్వాత పార్లమెంటుకు వెళుతుందని చెప్పారు. జీవోఎం భేటీ సందర్భంగా కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి జీవోఎం సభ్యులను కలిశారు. వీరు బిల్లుకు పలు సవరణలు సూచించినట్టు సమాచారం.
కేబినెట్ భేటీ రేపు.. 10న రాజ్యసభలో బిల్లు
బిల్లుపై జీవోఎం రూపొందించిన కేబినెట్ నోట్‌కు తుది రూపం ఇచ్చి, ఆమోదించడానికి కేంద్ర మంత్రి మండలి గురువారం సమావేశం కానుంది. అక్కడి నుంచి బిల్లు రాష్ట్రపతి ద్వారా పార్లమెంటుకు చేరుతుంది. మరోవైపు బుధవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బిల్లును ఈనెల 10న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు. అలాగే లోక్‌సభలో ఈనెల 11న బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముందుగానే రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తన వైఖరిని వెల్లడించాల్సిన పరిస్థితిని కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన.
బీజేపీ వైఖరిని అనుసరించి మరునాడే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాలా లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలా అన్నది నిర్ణయించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నెల 12న రైల్వేబడ్జెట్, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నందున, సభ సజావుగా సాగేందుకు సొంత పార్టీ నేతలు సహకరించేలా ఒప్పించేందుకు కాంగ్రెస్ వార్‌రూంలో అధిష్టానం చర్చలు జరిపింది. మరోవైపు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఇరుప్రాంతాల ఎంపీలతో సమావేశం కానున్నారు.
మూజువాణి ఓటుతో ఆమోదించాలి: కేసీఆర్
రాష్ట్ర విభజన బిల్లును ఓటింగ్ లేకుండా మూజువాణి ఓటుతోనే ఆమోదించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అఖిలపక్ష సమావేశంలో కోరారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర మం త్రులు, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను ఇదే తరహాలో ఆమోదించారు. ఇప్పుడు కూడా అలాగే జరగాలి’’ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రికల క్లిప్పింగులను మంత్రి కమల్‌నాథ్‌కు అందజేశారు.
టీ బిల్లును తెస్తున్నాం: ప్రధాని
ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కీలకమైన తెలంగాణ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తున్నాం. సుదీర్ఘ చర్చ జరిగిన తరువాత తెలంగాణ బిల్లు లోక్‌సభకు వస్తోంది. సభ సజావుగా జరిగి బిల్లు పాస్ అవుతుందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. అవినీతి నిరోధం, మహిళా రిజర్వేషన్ బిల్లు, మత హింస బిల్లు వంటి ముఖ్యమైన చాలా అంశాలు పెండింగులో ఉన్నాయి.
ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ, ఈ అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది, సభ సజావుగా జరిగేందుకు సహకరించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి సభ్యుడి విధి. సభ్యుడు లేవనెత్తే ఏ అంశం పైనయినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ప్రధాని చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందుతుందన్న విశ్వాసముందని ప్రధాని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కేబినెట్‌కు అదే 'టీ'
Published Wed, Feb 5 2014 1:36 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement