చిరంజీవికి ‘సమైక్య’ సెగ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి చిరంజీవికి ‘సమైక్య’ సెగ తాకింది. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ సోమవారం ఆయన నివాసాన్ని ముట్టడించింది. వేకువజామున మూడు గంటల నుంచి అక్కడే తిష్టవేసి విద్యార్థులు జేఏసీ నేత అడారి కిశోర్ నేతృత్వంలో పళ్లు తోముతూ, షేవింగ్ చేసుకుంటూ, స్నానాలు చేస్తూ నిరసన తెలిపారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన నివాసంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
గేట్లు ఎక్కి, చిరంజీవి బయటకు రావాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల దురుసు ప్రవర్తనకు నిరసనగా చైతన్య అనే విద్యార్థి కిరోసిన్‌ను తలపై పోసుకుని నినాదాలు చేశాడు. కిరోసిన్ అతడి నోట్లోకి, ముక్కులోకి వెళ్లడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. దుస్తులు వేసుకునేందుకైనా పోలీసులు అవకాశమివ్వలేదు. సీమాంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ జోక్యంతో రాత్రి 8గంటలకు వారిని విడిచిపెట్టారు.