సమస్య ప్రజల మధ్య కాదు: జేపీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఉత్పన్నమయ్యే సమస్యలకు కేంద్ర ప్రభుత్వమే పరిష్కారం చూపాలని లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. విభజన అనంతర సమస్యలకు ముందే పరిష్కారం చూపాల్సిన అవసరముందన్నారు. గతం కంటే భవిష్యత్ బాగుంటుందన్న భరోసా కలిగించాలన్నారు. విడిపోయాక అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే అందరికీ న్యాయం జరిగేలా పరిష్కారం సాధ్యమేనని చెప్పారు.
తాము సూచించిన రోడ్మ్యాప్లో రెండు ప్రతిపాదనలే కేంద్రం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో తాము ప్రతిపాదించిన సూచనలను యుద్ధప్రాతిపతికన ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా గుర్తించాలని కోరామన్నారు. బిల్లుకు సంబంధించి అన్ని పార్టీలకు 5 అంశాలతో లేఖలు రాశామన్నారు. ప్రస్తుత సమస్య తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య కాదన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని జేపీ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.