విభజనను క్రికెట్తో పోల్చొద్దు: విజయమ్మ
హైదరాబాద్: రాష్ట్ర విభజనను క్రికెట్తో పోల్చవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. రాబోయే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. విభజన బిల్లు తిరస్కార తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.
తాము కోరినట్టుగా సమైక్య తీర్మానం ప్రవేశపెట్టి, ముందే ఓటింగ్ జరిపి ఉంటే విభజన బిల్లు ఇంతవరకు వచ్చేది కాదన్నారు. తమతో పాటు రాజీనామాలు చేయమంటే ఏ ఒక్క ఎమ్మెల్యే స్పందించలేదని గుర్తు చేశారు. బిల్లులో తప్పులున్నాయని సీఎం అంటున్నారని, బిల్లు వచ్చినప్పుడు సమగ్రంగా చూడక పోవడం సీఎం కిరణ్ బాధ్యతారాహిత్యమేనని విమర్శించారు. విభజన బిల్లుకు కిరణ్, చంద్రబాబే కారణమన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా 3 సార్లు నోటీసు ఇచ్చామని గుర్తుచేశారు. చంద్రబాబు ప్యాకేజీ కోరడం దురదృష్టకరమన్నారు.
అప్పులు పంచితే రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుందన్నారు. సమైక్యాంధ్రతోనే రాష్ట్రం ముందుకు వెళుతుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామన్నారు. రాష్ట్రం కలిసే ఉండాలని వైఎస్ఆర్ కోరుకున్నారని తెలిపారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారని చెప్పారు. అందరం కలిసిఉంటేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్ విజయమ్మ అన్నారు.