'నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు'
హైదరాబాద్: శాసనసభలో ఒక ప్రహసనం ముగిసిందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో జరిగిందంతా పైశాచిక చర్య మాత్రమేనని అన్నారు. దీనివల్ల ఒరిగేదేమీలేదని ఆయన వ్యాఖ్యానించారు.. స్పీకర్, ముఖ్యమంత్రి కుమ్మక్కై దొడ్డిదారిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో నెగ్గించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో శాసనసభ పాత్ర నామమాత్రమేనని ఆయన అన్నారు. సభలో జరిగినదానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
ఫిబ్రవరిలో రెండో వారంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు వస్తుందన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి వచ్చేనెలలో రాజకీయ సన్యాసం తప్పదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదన్నారు. దీన్ని తమ గెలుపుగా చెప్పుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆగదని... తెలంగాణ ప్రజల ఆశలను మూటకట్టుకుని కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని... చివరి దశలో కూడా టీఆర్ఎస్ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడుతుందన్నారు.
తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేని టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. స్పీకర్ నాదేండ్ల మనోహర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారని ఆరోపించారు. విభజన బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత ఆమోదించిన తిరస్కార తీర్మానం చెల్లదని చెప్పారు.