* తెలంగాణ బిల్లును పంపించేందుకు గడువును పెంచే అవకాశం
* గత సంప్రదాయాల్ని రాష్ట్రపతి పాటించవచ్చు
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ కోరితే.. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును తిరిగి పంపించడానికి శాసనసభకు ఇచ్చిన గడువును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గరిష్టంగా మరో 10 రోజుల పాటు పొడిగించవచ్చని బుధవారం అధికార వర్గాలు తెలిపినట్టు పీటీఐ వార్తా సంస్థ కథనం. గతంలో అలా పొడిగించిన దృష్టాంతాలు ఉన్నందున, గత సంప్రదాయాలను పాటిస్తూ.. రాష్ట్రపతి పొడిగింపు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అప్పటి రాష్ట్రపతి మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఇచ్చిన గడవును పొడిగించిన విషయాన్ని గుర్తుచేశాయి.
విభజన బిల్లును అసెంబ్లీకి పంపిస్తూ.. చర్చకు ఆరు వారాల సమయమిచ్చి, జనవరి 23లోగా తిప్పి పంపించాలని రాష్ట్రపతి కోరారు. అయితే, తెలంగాణ అనుకూల, ప్రతికూల సభ్యుల ఆందోళనల మధ్య సభలో బిల్లుపై చర్చ సజావుగా జరగలేదు. అసెంబ్లీకి ఇచ్చే గడువును రాష్ట్రపతి పొడిగిస్తే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పాస్ చేసేందుకు కేంద్రానికి తక్కువ సమయం లభిస్తుంది.
వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం ఫిబ్రవరి రెండోవారంలో పార్లమెంటు సమావేశం కానుంది. అప్పుడు 15 రోజులు లేక 10 పనిదినాల పాటు పార్లమెంటు పనిచేస్తుందని.. సమావేశాల అజెండాను ఇంకా ఖరారు చేయలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఇటీవల చెప్పారు. అసెంబ్లీ అభిప్రాయంతో సంబంధం లేకుండా విభజన ప్రక్రియను పార్లమెంటు పూర్తి చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడ్తున్నారు.
మరో 10 రోజులు
Published Thu, Jan 16 2014 2:46 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM
Advertisement