'కిరణ్, చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి'
కిరణ్, చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
Published Mon, Jan 27 2014 1:08 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
వై.ఎస్.విజయమ్మ డిమాండ్
{పజా సంక్షేమంపై వీరిద్దరికీ చిత్తశుద్ధి ఉంటే విభజన బిల్లు వచ్చేదే కాదు
హైకమాండ్ డెరైక్షన్‌లోనే 43 రోజుల తర్వాత వీరిద్దరి కొత్త డ్రామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇద్దరూ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వీరిద్దరూ.. ప్రజల హక్కులు, సంక్షేమం కోరే వారే అయితే.. అసలు రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చుండేదే కాదని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ డెరైక్షన్‌లోనే వీరిద్దరూ కూడా దాదాపు 43 రోజుల తర్వాత మరో సరికొత్త డ్రామాకు తెరతీశారని దుయ్యబట్టారు. కిరణ్, చంద్రబాబులు ఇద్దరూ ప్రజలను చులకన చేసి తమాషాలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయమ్మ ఆదివారం తన నివాసంలో పలు టీవీ చానళ్లకు ప్రత్యేక ఇంట ర్వ్యూలు ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం ఎవరు ఏ రూపంలో ప్రయత్నం చేసినా తప్పకుండా మద్దతిస్తామని ఉద్ఘాటించారు. ఇంటర్వ్యూల్లోని ముఖ్యాంశాలు విజయమ్మ మాటల్లోనే...
* సీఎం కిరణ్ మాటల తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 43 రోజుల తర్వాత బిల్లులో లోపాలు కనిపించాయా? అలాంటప్పుడు బిల్లుపై గడువు ఎందుకు కోరినట్లు?
* బిల్లులో లోపాలున్నాయని సభలో కిరణ్ చెప్పిన తర్వాతే చంద్రబాబుకు తెలిసొచ్చిందా? తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన బాబుకు ఆ మాత్రం కూడా తెలియలేదా? ఇలాంటి వ్యక్తి దేశాన్ని శాసించానని చెప్పుకోవటం ఆయనకే చెల్లుబాటవుతుంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నోటి నుంచి ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పటం లేదంటే వారి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది.
* చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన బిల్లు మన రాష్ట్రానికి వచ్చింది. బీహార్‌లో సభ తీర్మానం లేకుండా వస్తే తిప్పి పంపించారు. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ముఖ్యమైన పదవుల్లో ఉన్న వారు సమర్థవంతమైన నాయకులు లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది.
* వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచి సభలో ‘సమైక్య తీర్మానం’ చేయాలని, బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌కు కూడా సభా నిబంధనలు 77, 78 కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిని గుర్తుచేస్తూ కూడా మరో నోటీసు అందజేశాం. ఇదే విషయమై ప్రతీ రోజూ సభలో మేం డిమాండ్ చేస్తుంటే రెండు పార్టీల నాయకులు మమ్మల్ని గేలిచేస్తూ, కాలేజీలో ర్యాగింగ్ మాదిరిగా రకరకాలుగా అవమానించారు. వారెన్ని చేసినప్పటికీ సమైక్యం కోసం భరించాం.
* కిరణ్, చంద్రబాబు ఇద్దరూ కూడా బీఏసీ సమావేశాలకు రారు. ఇరు ప్రాంతాలకు చెందిన నాయకుల్ని పంపి రెండు వాదనలు వినిపిస్తారు.
* బీఏసీలో కూడా మేం చాలా స్పష్టంగా.. సభలో సమైక్య తీర్మానం చేయాలని, ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ మొదలుకుని నాయకులందరికీ విజ్ఞప్తి చేశాం. లేకపోతే చరిత్ర క్షమించదని కూడా చెప్పటం జరిగింది. మంత్రి రఘువీరారెడ్డిని ‘అన్నా తీర్మానం మీరు పెట్టినా మేం మద్దతిస్తాం’ అని చెప్పినప్పటికీ స్పందనలేదు.
* రాష్ట్రపతి హైదరాబాద్‌కు వస్తే మా పార్టీ తరఫున ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అఫిడవిట్లు సమర్పించాం. అదే విధంగా బిల్లులోని 1 నుంచి 108 దాకా ఉన్న క్లాజులన్నింటినీ వ్యతిరేకిస్తూ వాటిని తొలగించాలని సవరణలు ఇచ్చాం. ఇలా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఏ చిన్న అవకాశాన్ని మేం వదులుకోలేదు.
* రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఎవరు ఏ రూపంలో ప్రయత్నం చేసినా మా పార్టీ తప్పకుండా మద్దతిస్తుంది. సీఎం ఇచ్చిన నోటీసుపై సభలో ఓటింగ్ నిర్వహించినా మేం పాల్గొని అండగా నిలుస్తాం.
* మా పార్టీ సీమాంధ్రకే పరిమితమైందని కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా పార్టీ తెలంగాణలో కూడా ఉంది. రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రాంతాలకు అతీతంగా ప్రతి మనిషికీ సంక్షేమాన్ని అందించారు. ఆయన్ని అభిమానించే వారు అక్కడ కూడా ఉన్నారు. మేం సమైక్య నినాదంతోనే ఎన్నికలకు వె ళ్తాం.
* వైఎస్ మరణించిన వంద రోజుల్లోనే పాలకుల వైఫల్యం కారణంగా రాష్ట్ర విభజన ప్రకటన వచ్చింది. ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను తొలగించేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఏం చేశాయి? వీరి వైఫల్యం కారణంగా తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగాయి.
* 43 రోజుల తర్వాత కిరణ్, చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీయటమంటే దీని వెనక కాంగ్రెస్ హైకమాండ్ హస్తమున్నట్లు అనుమానం ఉంది. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు.
* రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు నడుస్తూనే ఉంది. కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడటం కోసం అవిశ్వాసం సందర్భంగా చంద్రబాబు ఏకంగా విప్ జారీ చేశారు. కేంద్రం లో కూడా ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా ముగ్గురు ఎంపీలను గైర్హాజరు చేసి అక్కడా కాంగ్రెస్‌ను ఆదుకున్నారు.
* రాజ్యసభ ఎన్నికల్లో తగిన సంఖ్యా బలం లేనందు వల్లే పోటీ చేయడంలేదు. మాకు 23 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. పోటీ చేయాలం టే ఇతరుల మద్దతు కోరాల్సి ఉంటుంది. మేం కుమ్మక్కు రాజకీయాలు చేయదలచుకోలేదు. అందుకే పోటీకి దూరంగా ఉంటున్నాం.
Advertisement
Advertisement