'ఇంతకీ నేను ఏ ప్రాంతానికి చెందినవాడిని?'
హైదరాబాద్ : 'నా బాల్యం మహారాష్ట్రలో...విద్యాభ్యాసం కోస్తాంధ్రలో.... ఐఏఎస్ శిక్షణ కరీంనగర్లో.... అసెంబ్లీకి ఎన్నికైంది హైదరాబాద్ నుంచి .... ఇంతకీ నేను ఇప్పుడు ఏ ప్రాంతానికి చెందినవాడినో చెప్పాలని' లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రావనిలో రాజకీయాలు అంపశయ్యపై ఉందని అన్నారు. రాష్ట్ర విభజనతో పచ్చని నేలపై చిచ్చు రేగిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వందల రాత్రులు నిద్ర లేకుండా గడిపానని ఆయన అన్నారు. ఇవాళ పార్టీలు చచ్చిపోయాయని, కేవలం ప్రాంతాలు మాత్రమే మిగిలాయన్నారు.
విభజన నిర్ణయంతో తెలుగు మాట్లాడే ప్రజల్లో ఎన్నో ఆశలు, భయాలు ఉన్నాయని జేపీ అన్నారు. దీనిపై పార్టీలకు అతీతంగా చర్చ జరగాలని ఆయన కోరారు. ఏడు అంశాలపై పెద్ద మనుషుల ఒప్పందం జరిగిందని...అయితే అందులో అయిదు మాత్రమే అమలు అయ్యాయన్నారు. దాంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
తెలుగు ప్రజల మధ్య కేంద్రం చిచ్చు పెట్టిందని...బలవంతంగా ఐక్యత కొనసాగించటం కష్టమన్నారు. విరిగిన మనసుల్ని అతికించటం కష్టం అన్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని సకాలంలో స్పందించి ఉంటే ప్రజల మధ్య అగాధం వచ్చేది కాదన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ప్రాంతీయ భావం పెరిగిపోయిందని జేపీ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికి అస్థిత్వం ఎంతో అవసరం అని, అయితే అది హద్దు మీరకూడదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం, ఆవశ్యమని జేపీ స్పష్టం చేశారు. బలవంతంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే అపార నష్టం కలుగుతుందన్నారు. ప్రజలను ఒప్పించి విభజన చేపట్టాలని ఆయన అన్నారు.