దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర విభజన రాజకీయం వేడెక్కుతోంది. విభజన అంశంపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) చర్చల్లో సోమవారం నుంచి తుది అంకం మొదలుకానుంది. కేంద్ర అధికారులతో జీవోఎం చివరి భేటీ నిర్వహించనుంది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ కానుంది. నాలుగు రోజుల తర్వాత ఈ నెల 18వ తేదీన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించనుంది. మొత్తం మీద రాబోయే వారం, పది రోజుల్లో రాష్ట్ర విభజన కసరత్తును ఓ కొలిక్కి తీసుకొచ్చి 21వ తేదీకల్లా ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్‌కు సమర్పిస్తుందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల నుంచీ కాంగ్రెస్ నేతలు హస్తిన యాత్రకు సిద్ధమవుతున్నారు. నేటి భేటీ ప్రాతిపదికగా బిల్లుకు తుదిరూపం జీవోఎం సోమవారం నిర్వహిస్తున్న సమావేశంలో కేంద్ర ప్రభుత్వంలోని తొమ్మిది కీలక శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు పాల్గొంటున్నారు. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ఆస్తులు, అప్పుల పంపిణీ, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇతర ప్రాం తాల వారి హక్కులు, జన వనరులు, విద్యుత్ కేటాయిం పులు, ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, హైదరాబాద్ ఆదాయం ఇరు రాష్ట్రాలకు పంపిణీ.. తదితర అంశాలపై ఆయా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు శాఖల వారీగా జీవోఎంకు ఇప్పటికే నివేదికలు సమర్పించారు. వివిధ అంశాలపై తమకున్న తాజా సమాచారాన్ని జీవోఎం సభ్యులతో సోమవారం నాటి భేటీలో వివరించటంతో పాటు.. వివిధ సమస్యలకు పరిష్కారాలను సూచించనున్నారు. అలాగే, వివిధ వర్గాలు, పార్టీల నుంచి వ్యక్తమయిన అభ్యంతరాలు, అనుమానాలపై కూడా కార్యదర్శులు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. జీఓఎంకు అందిన 18 వేల వినతులను శాఖల వారీగా క్రోడీకరించే బాధ్యతను ఇప్పటికే కార్యదర్శులకు అప్పగించిన విషయం విదితమే. ఆయా వినతుల్లో పేర్కొన్న అంశాలను కూడా క్రోడీకరించిన వివిధ శాఖల కార్యదర్శులు సమగ్ర నివేదికలను జీవోఎం ముందు ఉంచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీలో చర్చల ఆధారంగానే తెలంగాణ ఏర్పాటుపై ఇప్పటికే సిద్ధమైన ముసాయిదా బిల్లుకు తుదిరూపం కల్పించే అవకాశాలున్నాయి. రేపు, ఎల్లుండి పార్టీల ప్రతినిధులతో భేటీలు... అలాగే.. ఈ నెల 12, 13 తేదీల్లో (మంగళ, బుధవారాల్లో) రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీఓఎం ‘అఖిలపక్ష’ సమావేశం నిర్వహించనుంది. రెండు రోజుల పాటు విడతల వారీగా జరిగే ఈ చర్చలకు రావాలని రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆహ్వానాలు పంపించిన విషయం తెలిసిందే. జీవోఎంను వ్యతిరేకించని ఐదు పార్టీలు-కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐకి మంగళవారం జీఓఎం 20 నిమిషాల చొప్పున సమయం కేటాయించింది. ఇక విభజనను గట్టిగా వ్యతిరేకించిన వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంతో పాటు రెండుకళ్ల సిద్ధాంతంతో నడుస్తున్న టీడీపీకి బుధవారం హోంశాఖ సమయం కేటాయించింది. వచ్చిన పార్టీల నాయకులతో జీఓఎం క్లుప్తంగా విభజనపై చర్చిస్తుందని, ఎవరైనా రాకపోతే రాలేదని రికార్డుల్లో రాసుకుంటుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. పార్టీలతో జరిపే చర్చల్లో అంతకుమించి పెద్దగా ఏమీ ఉండదని, విభజనకు సంబంధించిన ప్రక్రియ తెరవెనుక చకచకా సాగిపోతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ పార్టీల నుంచి వచ్చే సలహాలు, సూచనలను కూడా బిల్లులో పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులతో ఈ నెల 18న జీఓఎం సమావేశం కానుంది. వారి సలహాలు, సూచనలను పరిశీలించిన తర్వాత ముసాయిదా బిల్లుకు తుదిరూపమిచ్చి ఈ నెల 21న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. సీమాంధ్ర, తెలంగాణ నేతల పోటాపోటీ విభజనకు అభ్యంతరం లేదని చెప్తూ విభజన నేపధ్యంలో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించాలంటున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు జీఓఎంకు ఇప్పటికే ఒక నివేదికను అందజేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధితో కూడిన హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రధాన ప్రతిపాదనతో పాటు.. విభజన సరిహద్దులు, సీమాంధ్రలో భద్రాచలం డివిజన్ విలీనం, నదీ జలాల సమస్య పరిష్కారం వంటి అంశాలను అందులో ప్రస్తావించారు. ఇవే అంశాలపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి వివరించేందుకు సోమవారం ఉదయం 11.50 గంటలకు అపాయిట్‌మెంట్ కూడా తీసుకున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించిన అంశాలను పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మరింత అప్రమత్తమయ్యారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తమకు సమ్మతమని వారు స్పష్టం చేస్తున్నారు. సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గితే తెలంగాణలో మళ్లీ ఉద్యమం పెచ్చరిల్లే ప్రమాదముందని, అదే జరిగితే తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు ఫలితం దక్కే అవకాశాల్లేవని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని భావిస్తున్నారు. అనంతరం ఈ నెల 13 లేదా 14న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని, సీడబ్ల్యూసీ తీర్మానాన్ని యధాతథంగా అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ తరఫున డిప్యూటీ సీఎం, మంత్రి వట్టి విభజన దిశగా వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలంతా హస్తిన యాత్రకు సిద్ధమవుతున్నారు. అఖిలపక్ష భేటీకి పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వస్తే తప్ప ఢిల్లీ వెళ్లరాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నట్లు చెప్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గత మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసి కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. జీఓఎం ముందు పార్టీ తరఫున ఎవరు హాజరుకావాలన్న విషయంలో హైకమాండ్ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నందున సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని యధాయథంగా వినిపించేందుకు పీసీసీ అధ్యక్షుడిని ఒక్కరినే పంపితే సరిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. చివరకు హైకమాండ్ పెద్దలతో సంప్రదింపుల అనంతరం పార్టీ తరఫున ఇద్దరు ప్రతినిధులను జీఓఎం ముందుకు పంపాలని నిర్ణయించారు. ఆ మేరకు తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కోస్తా నుంచి మంత్రి వట్టి వసంతకుమార్ పేర్లను ఖరారు చేశారు. దానం, ముఖేశ్‌లకు దిగ్విజయ్ పిలుపు రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాద్ అంశం అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌లకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఇరువురు మంత్రులకు ఫోన్ చేసి ఢిల్లీ రావాలని ఆదేశించడంతో వారు ఆదివారం హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు గట్టిగా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వీరిని హైకమాండ్ పెద్దలు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రల రక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనున్నట్లు తెలిసింది.
Published Mon, Nov 11 2013 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
Advertisement