
హోంశాఖ కార్యాలయం వద్ద టీడీపీ హడావుడి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) భేటీకి ముందు పయ్యావుల కేశవ్ నేతృత్వంలో సీమాంధ్ర టీడీపీ నేతలు హోంశాఖ కార్యాలయం ముందు కొద్దిసేపు హడావుడి చేశారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్‌ను ఘెరావ్ చేశారు. ఓ కార్యకర్త జైరాం రమేశ్ కాళ్లపై పడ్డారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మంత్రి నారాయణస్వామిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పయ్యావుల ఏకంగా మంత్రి కారు ఎర్రబుగ్గను తీసి నేలకు కొట్టారు. హోంశాఖ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు వీరందరినీ బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం లేకుండా పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెట్టడం చట్ట విరుద్ధమని పయ్యావుల కేశవ్ అన్నారు. పార్లమెంటుకు ఈ అధికారంలేదని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు రెండూ సమానమైనవేనని అన్నారు.