* మంత్రుల బృందంతో భేటీకి ఢిల్లీ వెళ్తున్న బీజేపీ
* సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ముగ్గురు
* 12, 13 తేదీల్లో సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో సమావేశమయ్యేందుకు పలు పార్టీలు సిద్ధమయ్యాయి. బీజీపీ, సీపీఎంల నుంచి ఇద్దరు చొప్పున, సీపీఐ నుంచి ముగ్గురు ప్రతినిధులు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ పార్టీల ప్రతినిధులు జీవోఎంతో భేటీ అవుతారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీమాంధ్ర నుంచి డాక్టర్ కె.హరిబాబును ఈ నెల 12న ఈ సమావేశానికి పంపాలని బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ నిర్ణయించింది.
సీపీఐ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేష్, సీమాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ విల్సన్ 12న ఢిల్లీ వెళతారు. సీపీఎం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి 13న ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, జీవోఎంకు ఇచ్చిన లేఖకు అనుగుణంగానే వచ్చే సమావేశంలోనూ మంత్రుల బృందం ఏం చెబుతుందో విని, దానికనుగుణంగా స్పందించాలని ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ భేటీలో పార్టీ నేతలు కిషన్‌రెడ్డి బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, టి.ఆచారి, వి.రామారావు, శేఖర్‌జీ, రవీంద్రరాజు, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర వైఖరేమిటో చెప్పకుండా తమ అభిప్రాయాల్ని అడిగితే స్పందించకూడదని భేటీలో నిర్ణయించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూనే సీమాంధ్రుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని జీవోఎంను కోరాలని నిర్ణయించారు.
అలాగే, ఈ నెల 20 తర్వాత నాలుగు రథాలతో యాత్రలు నిర్వహించాలని బీజేపీ తీర్మానించింది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో జరిగే ఈ యాత్రలకు ఆయా ప్రాంతాల నేతలే సారథ్యం వహిస్తారు. జీవోఎంతో భేటీలో గతంలోలాగానే సమైక్య వాదాన్నే వినిపించాలని సీపీఎం నిర్ణయించింది. విభజన అనివార్యమయితే సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించమని డిమాండ్ చేసే అవకాశం ఉంది.
బీజేపీలోకి కెప్టెన్ కరుణాకర్..
బోధన్‌కు చెందిన కెప్టెన్ కరుణాకర్ సోమవారం హైదరాబాద్‌లో బీజేపీలో చేరనున్నారని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జీవోఎం ఏం చెప్తుందో చూద్దాం!
Published Mon, Nov 11 2013 3:32 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement