కొలిక్కిరాని జీవోఎం సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) సంప్రదింపుల కొలిక్కి రాలేదు. ఒకట్రెండు రోజుల్లో మరోసారి జీవోఎం సభ్యులు భేటీ కానున్నారు. ఈ సాయంత్రం పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో జీవోఎం కీలక సమావేశం జరిగింది. గులాంనబీ ఆజాద్ మినహా మిగతా సభ్యులందరూ భేటీకి హాజరయ్యారు.
మూడున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో కీలక శాఖల ఉన్నతాధికారులతో మంత్రుల బృందం విడివిడిగా చర్చలు జరిపింది. ఆర్థిక, నీటిపారుదల, విద్యుత్ ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కూడా పాల్గొన్నారు.
కాగా, రాష్ట్ర విభజన అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు జీవోఎం వరుస భేటీలు నిర్వహిస్తోంది. అయితే కీలకమైన హైదరాబాద్ విషయంలో పీటముడి వీడకపోవడంతో మంత్రులు జుట్టు పీక్కుంటున్నారు. హైదరాబాద్పై పరిమిత ఆంక్షలతో తెలంగాణ ఏర్పాటు దిశగా జీవోఎం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.