ఆదివారం గాంధీభవన్‌లో ఆదివాసీ గిరిజన సమావేశంలో ఠాక్రే తదితరులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల్లో ఆదివాసీ గిరిజనుల ఓట్లే కీలకమని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లోనూ తెలంగాణ గిరిజన ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ప్రాధాన్యతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులను మోసం చేస్తున్నాడని, మాయమాటలు చెప్పి వారి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరీలో బీఆర్‌ఎస్ గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు.
ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ భరత్ చౌహాన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో పాటు కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, అన్ని జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment