అచ్చంపేట పాదయాత్రలో అభివాదం చేస్తున్న మాణిక్‌రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క, వీహెచ్ తదితరులు
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ పేరును సీఎం కేసీఆర్ ప్రస్తావించకపోవడం దుర్మార్గమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మాణిక్‌రావ్ ఠాక్రే విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చేరుకుంది. అచ్చంపేటలోని అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఠాక్రే మాట్లాడారు.
రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రతో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించినట్టే.. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. భట్టి చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో కేసీఆర్ సర్కారును గద్దె దించుతుందన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, తెలంగాణలోనూ అమలు పరుస్తామని వివరించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీల బతుకులు మారాలని సోనియా తెలంగాణ ఇస్తే, కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు కావస్తున్నా వారి జీవితాల్లో మార్పు రాలేదని ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత భట్టి చేపట్టిన పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రా నుందని తమిళనాడు సీఎల్పీ నేత సెల్వా పెరుతుంగై అన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నదీమ్ జావేద్, సిరివెళ్ల ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment